High Mortality Due To Heart Related Problems In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

గుండెను గాబరా పెట్టకండి

Published Wed, Jun 1 2022 5:06 AM | Last Updated on Wed, Jun 1 2022 2:21 PM

High mortality due to heart related problems in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020లో అత్యధిక మరణాలు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్లే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో కరోనా వైరస్‌ సంబంధిత మరణాలు ఉన్నట్టు వెల్లడైంది. రిజిస్ట్రార్‌ జనరల్, సైన్సెస్‌ కమిషనర్‌ ఇటీవల ‘రిపోర్ట్‌ ఆన్‌ మెడికల్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్స్‌ 2020’ నివేదికను వెల్లడించింది. అందులో పేర్కొన్న ప్రకారం 2020లో రాష్ట్రంలో 4,55,000 మరణాలు నమోదయ్యాయి.

వీటిలో 22.3 శాతం అంటే 1,01,353 మరణాలను వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు ధ్రువీకరించిన మరణాల్లో 60.6 శాతం మరణాలు ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన హార్ట్‌ఎటాక్, కార్డియాక్‌ అరెస్ట్, కరోనరీ ఆర్టరీ, కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి), అరిథ్మియా సహా పలు రకాల జబ్బుల కారణంగా సంభవించాయి. ఈ వ్యాధుల కారణంగా 61,395 మరణాలు నమోదు కాగా మృతుల్లో అత్యధికంగా పురుషులే ఉన్నారు.

మృతుల్లో పురుషులు 39,677 మంది కాగా.. మహిళలు 21,718 మంది ఉన్నారు. రెండో స్థానంలో కరోనా సంబంధిత సమస్యల కారణంగా 12 శాతం, మూడో స్థానంలో శ్వాసకోశ వ్యాధులతో 7.2 శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనా సంబంధిత మరణాల్లో 9,751 మందిలో వైరస్‌ నిర్ధారణ అవగా, 2,442 మందిలో వైరస్‌ నిర్ధారణ కాలేదు. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులతో 7,328 మరణాలు సంభవించగా.. ఇందులో న్యూమోనియాతో 4,085 మరణాలు నమోదయ్యాయి.


క్రమంగా పెరుగుతున్న ధ్రువీకరణ మరణాలు
రాష్ట్రంలో మరణాల రిజిస్ట్రేషన్, వైద్యుల ధ్రువీకరణ శాతం క్రమంగా పెరుగుతోంది. 2019లో రాష్ట్రంలో 4,01,472 మరణాలు రిజిస్టర్‌ కాగా.. ఇందులో కేవలం 12.9 శాతం మరణాలను మాత్రమే వైద్యులు ధ్రువీకరించారు. 2020 సంవత్సరానికి వైద్యుల ధ్రువీకరణ  22.3 శాతానికి పెరిగింది.

ఒత్తిడికి గురవ్వకూడదు
పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి తోడు మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడి, జీవన శైలి కారణంగా రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతున్నాయి.

దీనివల్ల గుండెకు, గుండె నుంచి ఇతర అవయవాలకు వెళ్లే రక్తప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్బుల బారినపడటంతో పాటు కార్డియోమయోపతి, బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించడానికి ప్రయత్నించాలి. తీసుకునే ఆహారం, జీవన శైలిని మార్చుకోవాలి.
– డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు జీజీహెచ్‌

వ్యాయామం చేయాలి
ఏరోబిక్స్, యోగా, ఇతర వ్యాయామాలను జీవన శైలిలో ఓ భాగంగా చేసుకోవాలి. జంక్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. తద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి అసాంక్రమిక జబ్బుల బారినపడకుండా ఉండవచ్చు. ప్రస్తుతం యువతలో మధుమేహం, రక్తపోటు బయటపడుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి.

రోజుకు అరగంట మించకుండా వాకింగ్, జాగింగ్, యోగా, ఇతర వ్యాయామాలు చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. స్వీయ రోగ నిరోధకత పెంచుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. కరోనా వచ్చి తగ్గినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడంతోపాటు, ఇతర నియమాలు పాటిస్తే ఊపిరితిత్తులు, గుండె, ఇతర వ్యాధుల బారినపడకుండా ఉండగలరు.
– డాక్టర్‌ రాంబాబు, విమ్స్‌ డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement