CPR Treatment: All Information In Telugu About CPR During Cardiac Arrest - Sakshi
Sakshi News home page

Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు..

Published Tue, Feb 22 2022 9:55 AM | Last Updated on Tue, Feb 22 2022 11:17 AM

CPR During Cardiac Arrest: Someone Life is in Your Hands - Sakshi

సాక్షి, అమరావతి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్‌ అరెస్ట్‌) వంటి సమస్యలకు గురై మరణించటం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ.. పౌష్టికాహారం తీసుకుంటూ ఫిట్నెస్‌తో ఉండేవారు సైతం గుండె సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి.. సీపీఆర్‌ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ఏఈడీ అందుబాటులో ఉంచుకోవాలి 
విదేశాల్లో జిమ్‌లు, పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో ‘ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉంటాయి. వీటిద్వారా గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్, ఇతర గుండె సమస్యలకు గురైన వ్యక్తులకు ఏఈడీ ద్వారా షాక్‌ ఇస్తారు. ఇలా చేస్తే వెంటనే గుండెపోటు, కార్డియాక్‌ అరెస్టు నుంచి కోలుకునే అవకాశం 60 నుంచి 65 శాతం ఉంటుంది. మన దగ్గర కూడా ఈ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలామందిని రక్షించడానికి వీలవుతుంది.
 
కార్డియాక్‌ అరెస్ట్‌ లక్షణాలు 
తల తిరగటం, అలసటగా అనిపించడం, గుండెల్లో దడ, ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం. 

సీపీఆర్‌ ఇలా.. 
గుండెపోటుకు గురైన లేదా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్‌ అరెస్ట్‌ అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన 3–4 నిమిషాల్లో సీపీఆర్‌ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి 60 నుంచి 70% అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్‌ ప్రక్రియలో భాగంగా గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తద్వారా గుండె కండరాలన్నిటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సీపీఆర్‌ చేస్తూనే 108కుఫోన్‌చేసి అంబులెన్స్‌ను రప్పించి ప్రాథమికచికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి.

వైద్య పరీక్షలు చేయించుకోవాలి.. 
40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్‌ వంటి పరీక్షలతో పాటు కొలెస్ట్రాల్, గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబంలో పూర్వీకులు ఎక్కువగా గుండెపోటుతో మరణించిన దాఖలాలు ఉంటే అలాంటి వారు జాగ్రత్త పడాలి. రెండేళ్లకు ఒకసారి ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్‌ లేదా స్ట్రెస్‌ టెస్ట్‌లు చేయిచుకోవాలి. కఠిన వ్యాయామాలు చేసే వారికి గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గుండెపోటు లాంటి  ప్రమాదానికి దారితీయవచ్చు. దీన్నే డిఫెక్షన్‌ అంటారు. కొవ్వు కణాలతో ఏర్పడిన ‘ప్లాక్‌’పైన పగుళ్లు ఏర్పడటం వల్ల రక్తం గడ్డకట్టి, అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటుకు కారణం కావచ్చు.  ప్రొటీన్‌–సి, ప్రొటీన్‌–ఎస్, యాంటీ థ్రాంబిన్‌–3 తగ్గటం వంటి లోపాలున్న వారిలో ఈ తత్వం ఉంటుంది. అలాగే హోమోసిస్టిన్‌ అనే జీవరసాయనం రక్తంలో ఎక్కువగా ఉన్న వారిలోనూ క్లాట్‌ ఏర్పడే గుణం ఎక్కువ.  
– డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, కర్నూలు జీజీహెచ్‌ 

కఠిన వ్యాయామాలు వద్దు.. 
కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్త ప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్‌ ఫైబ్రిలేషన్‌ కారణంగానే కార్డియాక్‌ అరెస్ట్‌ సంభవిస్తుంది. ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె  కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్‌ నోడ్‌ సరైన విద్యుత్‌ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్థవంతంగా రక్తాన్ని పంపవు. 40 సంవత్సరాలు పైబడిన వారెవరైనా సరే కఠిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఈ వయసులో ఉన్న  వారు జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు మొదలు పెట్టే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కఠిన వ్యాయామాలు చేసినప్పుడు అప్పటికే లోపల ఉన్న సమస్యలు జఠిలమై కార్డియాక్‌ అరెస్ట్‌ కావడానికి ఆస్కారం ఉంటుంది.  
– డాక్టర్‌ చైతన్య, గుండె వైద్య నిపుణులు విజయవాడ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement