ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ నుండి బయటపడిన మొత్తం 41 మంది కార్మికులను రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్య పరీక్షల్లో వీరంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించామని ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ మీడియాకు తెలియజేసింది. కార్మికులను క్షుణ్ణంగా పరీక్షించామని, రక్తపరీక్షలు, ఈసీజీ, ఎక్స్‌రే రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని ఎయిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం చైర్మన్ డాక్టర్ రవికాంత్ తెలిపారు.
చార్‌ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఉత్తరకాశీ టన్నెల్‌లో ఒక భాగం నవంబర్ 12న కూలిపోయి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ నేపధ్యంలో 17వ రోజున వారు విజయవంతంగా బయటపడ్డాడు. వెంటనే వారిని ఇంటెన్సివ్ హెల్త్ చెకప్ కోసం ఎయిమ్స్ రిషికేశ్‌కు చేర్చారు.
డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ కార్మికులు ఇంత కాలం సొరంగంలో మగ్గిపోయారని, అందువల్ల వారికి పర్యావరణ అనుకూలత అవసరమని, ఇది కొద్ది రోజుల్లో జరుగుతుందని అన్నారు. ఇక్కడి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం కార్మికుల మొబైల్ నంబర్లు తీసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సొంత రాష్ట్రాలలోని వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు వారికి సంబంధించిన సమాచారం అందించామన్నారు.
కార్మికులు ఈరోజు లేదా రేపటిలోగా వారి ఇంటికి చేరుకుంటారని డెహ్రాడూన్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రామ్‌జీ శరణ్ శర్మ తెలిపారు. కాగా బాధిత కార్మికుల్లో గరిష్టంగా 15 మంది జార్ఖండ్‌కు చెందినవారు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, ఐదుగురు ఒడిశా, బీహార్, ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు, ఇద్దరు ఉత్తరాఖండ్, అస్సాం, ఒకరు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారున్నారు.
ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు?
Comments
Please login to add a commentAdd a comment