
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. తాజాగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. అలాగే వైద్య సిబ్బంది భద్రతను కోరుతూ పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన వారిలో ప్రముఖ వైద్యులు హర్ష్ మహాజన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సరిన్ తదితరులు ఉన్నారు.
ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్ధీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. మరోవైపు కోల్‌కతా పోలీసులు ఆగస్టు 18 నుండి ఆగస్టు 24 వరకు ఆర్‌జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు.
Comments
Please login to add a commentAdd a comment