India-Bangladesh
-
భారత్ నుంచి బంగ్లాకు పైప్‌లైన్ ద్వారా డీజిల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు డీజిల్ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్‌కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్‌కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్‌లైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది. -
ఉల్లి లేకుండా వంట వండు..
న్యూఢిల్లీ: ఉల్లిపాయల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడంతో పొరుగుదేశం బంగ్లాదేశ్‌కు సెగ తగులుతోంది. వంటలో ఉల్లిపాయ వేయవద్దంటూ తన వంటమనిషికి సూచించానంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్–బంగ్లాదేశ్ బిజినెస్ ఫోరంలో ఆమె పాల్గొన్నారు. ‘మీరు (భారత్) ఎందుకు ఉల్లి ఎగుమతిని ఆపారో తెలీదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెబితే బాగుండేది. మీరు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు ఇబ్బంది కలుగుతోంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెప్పండి’ అంటూ హసీనా వ్యాఖ్యానించారు. భారత్, చైనా వంటి దేశాల మధ్య ఉండటం వల్ల తమ దేశంలో పెట్టుబ డులు లాభదాయకమని తెలిపారు. అనంతరం వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యా పారం జరిగే పలు ఉమ్మడి అంశాలు ఉన్నాయని తెలిపారు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య నడుస్తున్న బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలును, రెండు సార్లకు పెంచాలని భావిస్తున్నామన్నారు. -
నా జీవితంలో ఓ అద్భుతమైన రాత్రి..
సాక్షి, స్పోర్ట్స్ : నరాలు తెగెంత ఉత్కంఠకర మ్యాచ్‌లో చివరి బంతిని సిక్సుకు తరలించి భారత్‌కు విజయాన్నందించిన టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన జీవితంలో ఈ రాత్రిని ఓ అద్భుతమైన రాత్రిగా అభివర్ణించాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ అద్భుత ప్రదర్శనతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కార్తీక్‌పై అటు క్రికెట్ దిగ్గజాలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి ఇటు సామాన్య అభిమాని వరకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో కార్తీక్ సైతం ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘బహుషా నా జీవితంలో ఇది ఓ గొప్ప రాత్రి. ఇలాంటి అవకాశం మరోసారి రాకపోవచ్చు’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. Probably one of the best nights of my life. Nothing comes close to crossing the finish line for… https://t.co/lmy5k4DrMi — DK (@DineshKarthik) 19 March 2018 ఇక ధోని వల్లె తనకు ఈ శక్తి వచ్చిందని, ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా టెన్షన్ లేకుండా, కూల్‌గా ఉండగలగడం ఒక్క ధోనీకే సాధ్యమని, మ్యాచ్‌ను విజయవంతంగా ఫినిష్ చెయ్యడం ధోనీ నుంచే నేర్చుకున్నానని మ్యాచ్ అనంతరం కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ ముందు సీనియర్ వికెట్ కీపర్ ధోనికి విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు అవకాశమివ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ కెప్టెన్ రోహిత్ కార్తీక్‌పై ఉన్న నమ్మకంతో తొలి రెండు మ్యాచుల్లో ఈ ఇద్దరి ఆటగాళ్లకు అవకాశమిచ్చాడు. తర్వాత పంత్ బ్యాటింగ్‌లో ఇబ్బంది పడటంతో రాహుల్‌కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్తీక్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. -
బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
కొలంబో : నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 177 పరుగు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (3-22) దెబ్బతీశాడు. సుందర్‌కు తోడు శంకర్, శార్ధుల్ ఠాకుర్, చహల్‌లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేసింది. ముష్పికర్ రహీమ్ 75(55 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సు), హసన్(7)లు నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా పతనాన్ని శాసించిన సుందర్ టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుంధర్ అద్భుత బౌలింగ్‌తో బంగ్లాను ఆదిలోనే దెబ్బకొట్టాడు. గత శ్రీలంక మ్యాచ్‌లో చెలరేగిన లిటన్ దాస్ (7), సౌమ్య సర్కార్ (1),లతో పాటు తమీమ్ ఇక్బాల్ (27)ను సుందర్ పెవిలియన్‌కు పంపించాడు. నాలుగు ఓవర్ల వేసిన సుందర్ 13 డాట్ బంతులు వేయడం విశేషం. ముష్పికర్ రహీమ్ హాఫ్ సెంచరీ ముష్పికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్ కలసి ఐదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.అనంతరం షబ్బీర్ రహ్మన్ 27 (23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు) ఠాకూర్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో రహీమ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో సిరాజ్ భారీగా పరుగులు ఇవ్వడంతో ఓదశలో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే 19 ఓవర్లో శార్ధుల్ కట్టిడి చేయడంతో మ్యాచ్ భారత్ వశమైంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకొని దారుణంగా విఫలమయ్యాడు. మెరిసిన రోహిత్ బ్యాట్ గత కొద్ది రోజులుగా నిలకడలేమితో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ 89 ( 61 బంతులు, 5 ఫోర్లు 5 సిక్సులు) ఎట్టకేలకు ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. అర్థ సెంచరీ వరకూ నిలకడగా ఆడిన రోహిత్ తరువాత తనదైన శైలిలో చెలరేగాడు. రోహిత్‌కు తోడు సురేశ్ రైనా 47(30 బంతుల్లో 5 ఫోర్లు,2 సిక్సులు), శిఖర్ ధావన్(35, 27 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సు)లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. -
మన హైదరాబాదీ వచ్చేశాడు!
కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో స్పల్ప మార్చులు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో జయదేవ్ ఉనద్కత్ స్థానంలోకి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. గత రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన ఈ హైదరాబాదీకి ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు అవకాశం లభించింది. ఇక బంగ్లాదేశ్ జట్టులో టస్కిన్ స్థానంలో అబూ హైదర్‌ను తీసుకున్నారు. ఈ సిరీస్‌లో రోహిత్ సేనకు ఇది చివరి మ్యాచ్ కాగా ముష్ఫికర్ బృందం ఆతిథ్య శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు లంకపై సంచలన విజయం నమోదు చేసిన బంగ్లాదేశ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గితే రన్‌రేట్ వంటి సాంకేతికాంశాల అవసరం లేకుండా నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఓడినా ప్రస్తుతానికి రన్‌రేట్ మెరుగ్గా (+0.21) ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది రాదు. అయితే... శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం కోసం కొంత ఎదురుచూడాల్సి రావచ్చు. తుదిజట్లు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రైనా, రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, చహల్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్. బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్‌దాస్, ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, అబు హైదర్, మెహదీ హసన్, నజ్ముల్ ఇస్లాం. -
సురేశ్ రైనా అరుదైన ఘనత
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నిదహాస్ ట్రోఫిలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో సిక్సు బాది అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన మూడో భారత ఆటగాడిగా కొనసాగుతున్న రైనా తాజా సిక్సుతో 50 సిక్సుల ఘనతను సొంతం చేసుకున్నాడు. 27 బంతుల్లో 28 పరుగులు చేసిన రైనా ఇందులో ఒక ఫోరు, సిక్సు బాదాడు. భారత ఆటగాళ్లలో 74 సిక్సులతో యువరాజ్ తొలి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ(69) సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్ జాబితాలో క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్‌లు 103 సిక్సులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
శ్రీలంకనే గెలిచింది.. బంగ్లాదేశ్ గెలవలేదా?
► బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అష్రాఫుల్ లండన్: భారత పై శ్రీలంకనే విజయం సాధించినపుడు బంగ్లాదేశ్ అలవోకగా విజయం సాధిస్తుందని బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మద్ అష్రాఫుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఇది బంగ్లాదేశ్‌కు కలిసొచ్చె అంశమని అష్రాఫుల్ అభిప్రాయపడ్డాడు. ఈ అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకోని ఫైనల్ పోరులో నిలుస్తామని అష్రాఫుల్ ధీమా వ్యక్తం చేశాడు. సెమీస్‌కు చేరిన మా జట్టు చాల సంతోషంగా ఉందన్నాడు. కానీ భారత్ పరిస్థితి అలా లేదని చాంపియన్స్‌గా నిలుస్తారని 130 కోట్ల జనాభా వారిపై ఆశలు పెట్టుకున్నారని అష్రాపుల్ పేర్కొన్నాడు. భారత్‌పై పవర్ ప్లేలో మూడు వికెట్లు తీస్తే గెలవడం సులవని అష్రాఫుల్ అభిప్రాయపడ్డాడు. ఇక న్యూజిలాండ్‌పై అనూహ్య విజయం సాధించిన బంగ్లాదేశ్, దురదృష్టంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో మా ఆటతీరు మెరుగైందని, ఆసీయా కప్ ఫైనల్ కూడా వచ్చామని మరో మాజీ కెప్టెన్ హబీబుల్ బషీర్ గుర్తు చేశాడు. ఇది బంగ్లా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టమని, మినీ వరల్డ్ కప్ వంటి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని బషీర్ చెప్పుకొచ్చాడు. ఇక భారత్‌పై ఒత్తిడి ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. బషీర్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ 2007 ప్రపంచకప్‌లో భారత్‌పై సంచలన విజయం నమోదుచేసింది. దీంతో భారత్ లీగ్ దశలోనే టోర్నినుంచి నిష్ర్కమించింది. -
‘పొరుగు’ బంధాలు కీలకం
న్యూఢిల్లీ: భారత్ అభివృద్ధిలో పొరుగు దేశాలతో సంబంధాలు కూడా ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కీలక వాణిజ్య మార్గం పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్టును బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. పశ్చిమ బెంగా ల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పెట్రాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు (ఐసీపీ) ద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థ అనుసంధానత మరింత బలపడి, సంబంధాలు మెరుగవుతాయన్నారు. భారత్, బంగ్లాదేశ్‌ల ఆర్థికాభివృద్ధి, అనుసంధానతలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఈ ల్యాండ్ పోర్టు ప్రారంభోత్సవం ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ఘట్టమన్నారు. ఏటా 15 లక్షల మంది ప్రజలు, లక్షన్నర ట్రక్కులు ఈ సరిహద్దు నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. బంగ్లాదేశ్‌లోని ఢాకా, కిషోర్‌గంజ్‌ల్లో జరిగిన ఉగ్రవాద దాడులపై మోదీ సంతాపాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేం దుకు బంగ్లాకు భారత్ అండగా ఉంటుందని హసీనాకు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపారాభివృద్ధికి ఐసీపీ కీలక అడుగని హసీనా వెల్లడించారు. భారత్‌తో సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్యానికి పెట్రాపోల్-బెనాపోల్ ప్రధాన సరిహద్దు మార్గం. యాభై శాతానికి పైగా ద్వైపాక్షిక వాణిజ్యం ఈమార్గం ద్వారానే జరుగుతుంది. భద్రత, ఇమిగ్రేషన్, కస్టమ్స్ వంటి ముఖ్య సేవలను సమర్థవంతంగా పెట్రాపోల్ ఐసీపీ అందిస్తుంది. సరిహద్దుల్లో గందరగోళం లేకుండా ప్రజా, సరుకు రవాణాకు దోహడపడుతుంది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ల్యాండ్ పోర్టు ద్వారా 68 వేల కోట్ల వాణిజ్యం జరుగుతుందని మమత చెప్పారు. -
సరిహద్దు సమస్యకు చెల్లుచీటీ
మోదీ బంగ్లా పర్యటనలో ఎల్బీఏ అమలు ఖరారు ♦ భారత ప్రధానికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన బంగ్లా ప్రధాని ♦ మోదీ, హసీనా, బెంగాల్ సీఎం మమతల సమక్షంలో ఒప్పందం ♦ భారత్‌కు 500 ఎకరాలు, బంగ్లాకు 10,000 ఎకరాల భూమి బదిలీ ♦ బంగ్లాదేశ్‌కు తాజాగా 200 కోట్ల డాలర్ల రుణం ప్రకటించిన మోదీ ♦ తొలి రోజు పర్యటనలో బంగ్లాతో భారత్ 22 ఒప్పందాలు ఖరారు ఢాకా: భారత్-బంగ్లాదేశ్ మధ్య 41 ఏళ్ల సుదీర్ఘ సరిహద్దు వివాదానికి తెరపడింది. భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లా పర్యటన సందర్భంగా.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల సమక్షంలో రెండు దేశాలూ శనివారం చరిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందాన్ని(ఎల్బీఏ) ఖరారు చేసుకున్నాయి. బంగ్లాలో తొలిసారి పర్యటిస్తున్న మోదీ.. ఆ దేశానికి తాజా 200 కోట్ల డాలర్ల రుణసాయం ప్రకటించారు. అలాగా.. తీస్తా, ఫేని నదీ జలాల పంపిణీ సమస్యలకూ న్యాయబద్ధ పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు సముద్ర ప్రాంత భద్రతలో సహకారం, మానవ అక్రమ రవాణా, నకిలీ భారత కరెన్సీ నిర్మూలన తదిరాలపై 22 ఒప్పందాలు కదుర్చుకున్నాయి. ఢాకాలో మోదీకి హసీనా స్వాగతం... మోదీ తొలిసారిగా రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన నిమిత్తం శనివారం ఢాకా చేరుకున్నారు. హసీనా ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మోదీకి స్వాగతం పలికారు. ఆమె మంత్రివర్గ సహచరులూ హాజరయ్యారు. విమానాశ్రయంలోనే ఆయనకు సైనిక వందనం సమర్పించారు. ఢాకా మోదీ, హసీనా, మమతల ఫొటోలు, కటౌట్లతో తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీని బలంగా వ్యతిరేకించే మమత బంగ్లా పర్యటనలో ఆయనతో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించటం విశేషం. అంతకుముందు.. సోనార్ గావ్ హోటల్లో మమతతో మోదీ 20 నిమిషాలు సమావేశమై చర్చించారు. అనంతరం ఒకే వాహనంలో బంగ్లా ప్రధాని హసీనా కార్యాలయానికి చేరుకున్నారు. ఎల్బీఏ అమలు.. 200 కోట్ల డాలర్ల రుణం... హసీనా, మోదీలు సుదీర్ఘంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ముగ్గురి సమక్షంలో ఎల్బీఏ అమలుకు సంబంధించిన పత్రాలను ఇరు దేశాలూ ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇందులో భాగంగా.. సరిహద్దులో బంగ్లా నుంచి భారత్‌కు 51 ప్రాంతాలు, భారత్ నుంచి బంగ్లాకు 111 ప్రాంతాలు లభించనున్నాయి. మొత్తం మీద భారత్‌కు 500 ఎకరాలు, బంగ్లాకు 10,000 ఎకరాల భూమి దక్కనుంది. అలాగే.. 50,000 మంది ప్రజల పౌరసత్వానికి సంబంధించిన సమస్య కూడా ఈ ఒప్పందం ద్వారా పరిష్కారం కానుంది. అనంతరం మోదీ, హసీనాలు మీడియాతో మాట్లాడారు. భారత్ 200 కోట్ల డాలర్లను బంగ్లాకు రుణంగా అందిస్తుందని మోదీ ప్రకటించారు. ఇంతకుముందు ప్రకటించిన 80 కోట్ల డాలర్ల రుణాన్ని సత్వరం అమలు చేస్తామని, 20 కోట్ల డాలర్లను పూర్తిగా పంపిణీ చేస్తామన్నారు. ఈశాన్య భారతంలో ఉగ్రవాదులు తలదాచుకునే ప్రాంతంగా పరిగణించే బంగ్లాలో ఉగ్రవాదుల పట్ల ఉపేక్ష చూపబోమని హసీనా హామీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య లోటును పూరించటానికి రెండు ప్రత్యేక ఆర్థిక మండళ్లను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగ్లా యుద్ధ అమరవీరులకు నివాళులు 1971 బంగ్లా స్వాతంత్య్ర యుద్ధం అమరవీరులకు నివాళులు అర్పించి మోదీ బంగ్లా పర్యటనను ప్రారంభించారు. ఢాకా చేరుకున్న వెంటనే ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా సావర్ వద్ద ఉన్న ‘జాతియో స్మృతి సౌధో’ వద్దకు వెళ్లి అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి మౌనం పాటించారు. పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోసం బంగ్లాదేశ్ చేసిన ఆ యుద్ధంలో భారత్ కూడా బంగ్లాకు సాయపడ్డం తెలిసిందే. అక్కడ బంగబంధు మనుమడు షేక్ రెజ్వాన్ సిద్దిఖి మోదీకి స్వాగతం పలికారు. సామర్లకోట ప్రాజెక్టు పరికరాలతో ప్రాజెక్టు బంగ్లాదేశ్‌లో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో భారీ విద్యుత్ ప్లాంటు, ఎల్ఎన్జీ దిగుమతి టెర్మినల్లు నెలకొల్పేందుకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ సంస్థ ఆ దేశంతో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోటలో విద్యుత్ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసిన పరికరాలను బంగ్లాలో విద్యుత్ ప్రాజెక్టును వేగంగా నిర్మించేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. హిందూ మైనారిటీల కోసం గళం విప్పాలి... కాగా, బంగ్లాదేశ్‌లోని తాము అనునిత్యం మత ఛాందసవాదుల నుంచి మత వివక్ష, దాడుల భయంతో జీవిస్తున్నామని.. దీనిపై మోదీ గుర్తించి, బంగ్లా నాయకత్వంతో చర్చించాలని అక్కడి హిందువులు కోరారు. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ చిట్టగాంగ్ వెటరినరీ-యానిమల్ సెన్సైస్ వర్సిటీలో పోస్టర్లు అతికించినందుకు గాను..ముగ్గురు ఇస్లాం అతివాదులను అరెస్ట్ చేశారు. భారత్ - బంగ్లా మధ్య రెండు బస్సు సర్వీసులు షురూ మోదీ తొలి బంగ్లాదేశ్ పర్యటనను పురస్కరించుకుని.. భారత్ - బంగ్లాల మధ్య రెండు బస్సు సర్వీసులను ప్రారంభించారు. కోల్‌కతా - ఢాకా - అగర్తల; ఢాకా - షిల్లాంగ్ - గువాహటిల మధ్య నడిచే ఈ బస్సు సర్వీసులను ఢాకాలో హసీనా, మమతాబెనర్జీలతో కలసి మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హసీనాకు అగర్తలా - ఢాకా - కోల్‌కతా బస్సు టికెట్‌ను మోదీ ఇవ్వగా.. మోదీకి ఢాకా - షిల్లాంగ్ - గువాహటి బస్సు టికెట్‌ను హసీనా ఇచ్చారు. మమతాబెనర్జీ కూడా హసీనాకు కోల్‌కతా - ఢాకా - అగర్తలా బస్సు టికెట్‌ను ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా రెండు ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం చేసే ఈ బస్సు సర్వీసులు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తాయని మోదీ పేర్కొన్నారు. కోల్‌కతా నుంచి ఢాకా మీదుగా అగర్తలా వెళ్లే బస్సు సర్వీసు వల్ల.. త్రిపురకు ప్రయాణించే దూరం 560 కిలోమీటర్లు తగ్గనుంది. హసీనాకు వెంకటగిరి పరదా బహూకరించిన మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటగిరిలో ప్రత్యేకంగా చేతితో అల్లిన పరదాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు కానుకగా ఇచ్చారు. జామ్దానీ శైలిలో అల్లిన ఈ పరదాపై కల్పవృక్షం, కామధేనువుల చిత్రాల అల్లికలు ఉన్నాయి. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విటర్లో వ్యాఖ్యల ద్వారా వివరించారు.