కొలంబో : నిదహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 177 పరుగు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (3-22) దెబ్బతీశాడు. సుందర్‌కు తోడు శంకర్, శార్ధుల్ ఠాకుర్, చహల్‌లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేసింది. ముష్పికర్ రహీమ్ 75(55 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సు), హసన్(7)లు నాటౌట్‌గా నిలిచారు.
బంగ్లా పతనాన్ని శాసించిన సుందర్
టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుంధర్ అద్భుత బౌలింగ్‌తో బంగ్లాను ఆదిలోనే దెబ్బకొట్టాడు. గత శ్రీలంక మ్యాచ్‌లో చెలరేగిన లిటన్ దాస్ (7), సౌమ్య సర్కార్ (1),లతో పాటు తమీమ్ ఇక్బాల్ (27)ను సుందర్ పెవిలియన్‌కు పంపించాడు. నాలుగు ఓవర్ల వేసిన సుందర్ 13 డాట్ బంతులు వేయడం విశేషం.
ముష్పికర్ రహీమ్ హాఫ్ సెంచరీ
ముష్పికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్ కలసి ఐదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.అనంతరం షబ్బీర్ రహ్మన్ 27 (23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు) ఠాకూర్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో రహీమ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో సిరాజ్ భారీగా పరుగులు ఇవ్వడంతో ఓదశలో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే 19 ఓవర్‌లో శార్ధుల్ కట్టిడి చేయడంతో మ్యాచ్ భారత్ వశమైంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకొని దారుణంగా విఫలమయ్యాడు.
మెరిసిన రోహిత్ బ్యాట్
గత కొద్ది రోజులుగా నిలకడలేమితో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ 89 ( 61 బంతులు, 5 ఫోర్లు 5 సిక్సులు) ఎట్టకేలకు ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. అర్థ సెంచరీ వరకూ నిలకడగా ఆడిన రోహిత్ తరువాత తనదైన శైలిలో చెలరేగాడు. రోహిత్‌కు తోడు సురేశ్ రైనా 47(30 బంతుల్లో 5 ఫోర్లు,2 సిక్సులు), శిఖర్ ధావన్(35, 27 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సు)లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment