దినేశ్ కార్తీక్
సాక్షి, స్పోర్ట్స్ : నరాలు తెగెంత ఉత్కంఠకర మ్యాచ్‌లో చివరి బంతిని సిక్సుకు తరలించి భారత్‌కు విజయాన్నందించిన టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన జీవితంలో ఈ రాత్రిని ఓ అద్భుతమైన రాత్రిగా అభివర్ణించాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ అద్భుత ప్రదర్శనతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
దీంతో కార్తీక్‌పై అటు క్రికెట్ దిగ్గజాలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి ఇటు సామాన్య అభిమాని వరకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో కార్తీక్ సైతం ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘బహుషా నా జీవితంలో ఇది ఓ గొప్ప రాత్రి. ఇలాంటి అవకాశం మరోసారి రాకపోవచ్చు’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
Probably one of the best nights of my life. Nothing comes close to crossing the finish line for… https://t.co/lmy5k4DrMi
— DK (@DineshKarthik) 19 March 2018
ఇక ధోని వల్లె తనకు ఈ శక్తి వచ్చిందని, ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా టెన్షన్ లేకుండా, కూల్‌గా ఉండగలగడం ఒక్క ధోనీకే సాధ్యమని, మ్యాచ్‌ను విజయవంతంగా ఫినిష్ చెయ్యడం ధోనీ నుంచే నేర్చుకున్నానని మ్యాచ్ అనంతరం కార్తీక్ చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్ ముందు సీనియర్ వికెట్ కీపర్ ధోనికి విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు అవకాశమివ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ కెప్టెన్ రోహిత్ కార్తీక్‌పై ఉన్న నమ్మకంతో తొలి రెండు మ్యాచుల్లో ఈ ఇద్దరి ఆటగాళ్లకు అవకాశమిచ్చాడు. తర్వాత పంత్ బ్యాటింగ్‌లో ఇబ్బంది పడటంతో రాహుల్‌కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్తీక్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment