సౌమ్య సర్కార్
ఢాకా: నిదహాస్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఓటమిని బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చివరి వరకూ గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ చివరి బాల్‌కి తలకిందులవ్వడాన్ని బంగ్లా ప్లేయర్లు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే మ్యాచ్ ఓటమిపై బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హుస్సేన్ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను ధారాళంగా పరుగులివ్వడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని, ఈ విషయంలో అభిమానులు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. తమ జట్టు ఓటమికి తానే కారణమవుతానని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నానని, ఈ ఒక్కసారికి వదిలేయాలని అభిమానులకు కోరాడు.
తాజాగా చివరి ఓవర్ వేసిన సౌమ్య సర్కార్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి తాను కూడా కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను ఇంతకుముందు కూడా బౌలింగ్ చేసాను.. కానీ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. ఈ మ్యాచ్‌తో ఎలాంటి పరిస్థితులోనైనా కట్టుదిట్టంగా బాల్స్ వేయగలననే నమ్మకం వచ్చింది. గతంలో మా జట్టు టీ20 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓటమి చవిచూసేది. కానీ ఇపుడు 200 పరుగులు లక్ష్మాన్ని కూడా చేయగలుగుతున్నాం. అదే విధంగా భారీ లక్ష్యాలను కూడా సునాయాసంగా చేధించగలుగుతున్నాము. కానీ మొన్నటి మ్యాచ్ ఓటమి మరచిపోలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ మ్యాచ్ గుర్తొస్తే బాధగా ఉంది. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి అవసరమైన 12 పరుగుల్ని సమర్పించుకోవడం నా కెరీర్‌లో చేదు జ్ఞాపకం. ప్రధానంగా చివరి బంతికి సిక్సర్ ఇచ్చి మా పరాజయంలో భాగమయ్యా. ఆ రోజు నేను బాగా బౌలింగ్ చేసి ఉంటే 16 కోట్ల మంది పెదవులపై చిరునవ్వును చూసేవాళ్లం’ అని సౌమ్య తెలిపాడు.
బంగ్లాదేశ్‌తో గత ఆదివారం ఉత్కంఠభరింతగా జరిగిన నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సౌమ్య వేసిని ఆఖరి బంతిని దినేష్ కార్తిక్ సిక్స్‌గా మార్చడంతో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment