సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఓటమిపై బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హొస్సెన్ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను దారళంగా పరుగులివ్వడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని, ఈ విషయంలో అభిమానులు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. ఓటమికి తానే కారణమవుతానని ఊహించలేదని ఈ బంగ్లా బౌలర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టు విజయానికి దగ్గరగా వచ్చిందని, కానీ చివరకు తన వల్లె ఓడిపోయిందన్నాడు. దీంతో ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నానని, ఈ ఒక్కసారికి వదిలెయ్యాలని అభిమానులకు రూబెల్ బంగ్లా మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు.
ఇక 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజులో పాతుకు పోయిన బ్యాట్స్‌మెన్ సైతం లేరు. ఓ వైపు జిడ్డు బ్యాటింగ్‌తో భారత్ ఓటమి అంచుకు చేర్చిన విజయ్ శంకర్ ఉండగా అప్పుడే క్రీజులోకి దినేశ్ కార్తీక్ వచ్చాడు. ఇంకా భారత్ విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు అవసరం. 19 ఓవర్ వేసేందుకు రూబెల్ హోస్సెన్ సిద్దమయ్యాడు. ఇక బంగ్లా విజయం కాయమని అందరూ భావించారు. ఎందుకంటే అప్పటికి రూబెల్ 3 ఓవర్లు వేసి కేవలం 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసాడు.
దీంతోనే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ముందుగానే రూబెల్‌కు బంతి ఇచ్చాడు. కానీ కార్తీక్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుస బంతుల్లో 6, 4, 6, 0, 2, 4 లతో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో చివరి ఓవర్లో భారత్ లక్ష్యం 12 పరుగులకు చేరడం కార్తీక్ విన్నింగ్ షాట్‌తో భారత్‌ను గట్టెక్కించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఓటమి తనవల్లేనని భావించిన రూబెల్ అభిమానులను క్షమాపణలు కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment