
న్యూఢిల్లీ : నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఒక థ్రిల్లర్‌ను తలపించిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరి బంతిని సిక్సర్‌గా మలిచి.. టీమిండియాకు దినేశ్ కార్తీక్ (డీకే) మరుపురాని విజయాన్ని అందించాడు. అభిమానుల గుండెల్లో ఓవర్‌నైట్ డీకే హీరో అయిపోయాడు. అయితే, ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి అయిన రోహిత్ శర్మ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. కార్తీక్ చివరి బంతిని ఎదుర్కోవడాన్ని తాను చూడలేదని చెప్పాడు. మ్యాచ్ టై అవుతుందేమోనని భావించి.. సూపర్ ఓవర్ కోసం సన్నాహకాల్లో మునిగిపోయినట్టు తెలిపాడు. కార్తీక్ చివరి బంతి ఆడే సమయంలో.. ‘నేను మళ్లీ ప్యాడ్స్ కట్టుకునేందుకు డ్రెసింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాను’ అని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు.
దినేశ్‌కు ఇప్పటివరకు గేమ్‌లో తన ప్రతిభ చూపించే అవకాశం రాలేదని, ఈ మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో అతను చాటాడని, అతను చివరి బంతిని సిక్సర్‌గా మలచడం తనకెంతో ఆనందం కలిగించిందని చెప్పాడు. ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్‌ను ముందు పంపించడాన్ని సమర్థించుకున్న రోహిత్.. కార్తీక్ మ్యాచ్ ఫినిషింగ్ సామర్థ్యంపై అపారమైన నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించి.. రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ టీ-20 కెరీర్‌లో ఇది 14వ అర్ధసెంచరీ కావడం గమనార్హం.