ఎప్పుడో 2007లో ప్రపంచకప్‌లో అనూహ్యంగా బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడింది... ఆపై మూడు వరల్డ్ కప్‌లలో కూడా బంగ్లాను టీమిండియా చిత్తుగా ఓడించింది...ఇప్పుడు తాజా ఫామ్, బలాబలాలను బట్టి చూస్తే రోహిత్ సేనకు టోర్నీలో వరుసగా నాలుగో విజయం అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
తమ మొదటి పోరులో అఫ్గన్‌ను ఓడించినా... ఆపై రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిన బంగ్లా మళ్లీ కోలుకునే ప్రయత్నంలో ఉంది. అయితే అన్ని రంగాల్లో అత్యంత పటిష్టంగా ఉన్న టీమిండియాను ఆ జట్టు నిలువరించడం దాదాపు అసాధ్యం కావచ్చు.
పుణే: వరల్డ్ కప్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగి వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరో సమరానికి సన్నద్ధమైంది. నేడు జరిగే పోరులో మరో ఆసియా జట్టు బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. ఇటీవలి ఆసియా కప్ సహా గత ఏడాది కాలంలో భారత్‌పై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 3–1తో బంగ్లాదేశ్‌కు మెరుగైన రికార్డు ఉంది.
అయితే ప్రస్తుతానికి వచ్చే సరికి ఆ లెక్క ఇక్కడ పని చేయకపోవచ్చు. ఆసీస్, అఫ్గన్, పాక్‌లను అలవోకగా ఓడించిన టీమిండియాకు బంగ్లాపై కూడా అదే జోరు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన ఆటగాళ్లెవరూ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న బంగ్లా ఎంత వరకు పోటీనిస్తుందనేది చూడాలి. 1998 తర్వాత బంగ్లాదేశ్ జట్టు భారత గడ్డపై భారత్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
మార్పుల్లేకుండా...
ఫామ్‌ను బట్టి చూస్తే సహజంగానే ఈ మ్యాచ్ కోసం భారత్ తమ తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. గత రెండు మ్యాచ్‌లలో 131, 86 స్కోర్లతో సత్తా చాటిన రోహిత్ మళ్లీ చెలరేగితే బంగ్లాకు చుక్కలు చూపించగలడు. పాక్‌తో విఫలమైనా టోరీ్నలో ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేసిన కోహ్లి కూడా తన ధాటిని ప్రదర్శించగలడు.
బంగ్లాదేశ్‌పై ఆడిన 15 వన్డేల్లో ఏకంగా 67.25 సగటుతో చెలరేగిన కోహ్లి 4 సెంచరీలూ బాదాడు. టాప్–5లో ఇతర బ్యాటర్లు గిల్, అయ్యర్, రాహుల్ కూడా చెలరేగిపోగలరు. రాహుల్ ప్రతీ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తుండగా, అయ్యర్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. పాండ్యా, జడేజా తమ ఆల్‌రౌండ్ పాత్రను సమర్థంగా నిర్వహిస్తున్నారు. శార్దుల్ స్థానంలో కాస్త చర్చ కొనసాగుతున్నా...పిచ్‌ను బట్టి చూస్తే అతడినే కొనసాగించవచ్చు.
పేస్ విభాగంలో కూడా బుమ్రా, సిరాజ్ జోరు మీదుండటంతో సీనియర్ షమీకి అవకాశం దక్కడం కష్టమే. మరో వైపు కుల్దీప్ ఇప్పటి వరకు కేవలం 3.9 ఎకానమీ నమోదు చేయడం చూస్తే అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుంది. మూడు మ్యాచ్‌లలో కలిపి 28 ప్రత్యర్థి వికెట్లు తీసిన భారత్...మొత్తంగా 9 వికెట్లే కోల్పోయింది.
ఆదుకునేదెవరు...
భారత్‌పై పదహారేళ్ల క్రితం విజయంలో భాగమైన షకీబ్, ముషి్ఫకర్ బహుశా చివరి సారి వరల్డ్‌కప్‌లో భారత్‌తో కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చాలని పట్టుదలగా ఉన్నారు. ముషి్ఫకర్ రెండు అర్ధ సెంచరీలు సాధించినా షకీబ్ విఫలం కావడంతో జట్టుపై భారం పడుతోంది.
మూడు మ్యాచ్‌లు ముగిసినా అతడినుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. నజు్మల్, దాస్ ఒకే మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించారు. కొత్త బ్యాటర్ తన్‌జీద్ కూడా ప్రభావం చూపలేకపోగా, ప్రపంచకప్‌కు ముందు అద్భుతంగా ఆడి అంచనాలు పెంచిన తౌహీద్ వరుసగా విఫలమయ్యాడు. మరో ఆల్‌రౌండర్ మిరాజ్‌లోనూ నిలకడ లోపించింది. బౌలింగ్‌లో ముస్తఫిజుర్ మినహా అంతా విఫలమయ్యారు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, పాండ్యా, జడేజా, శార్దుల్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.
బంగ్లాదేశ్: షకీబ్ (కెప్టెన్ ), తన్‌జీద్, దాస్, నజ్ముల్, తౌహీద్, ముష్ఫికర్, మిరాజ్, మహ్ముదుల్లా, తస్కీన్, షరీఫుల్, ముస్తఫిజుర్.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. గతంలోనూ భారీగా పరుగులు వచ్చాయి. బుధవారం నగరంలో జల్లులు కురిసినా...మ్యాచ్ రోజు వర్షసూచన లేదు.
రోహిత్‌కు 3 జరిమానాలు...
వరల్డ్ కప్‌లో 142 స్ట్రైక్‌రేట్‌తో దూసుకుపోతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ రోడ్డుపై అంతకు మించిన వేగాన్ని ప్రదర్శించాడు. ముంబై–పుణే హైవేపై తన కారులో పరిమితికి మించిన వేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ అధికారులు అతనిపై మూడు చలాన్లు విధించారు. భారత జట్టుతో చేరేందుకు ముంబైనుంచి తన కారులో పుణేకు వెళ్లిన రోహిత్ చాలా ప్రమాదకరంగా కారు నడిపాడని అధికారులు వెల్లడించారు. అతని అత్యధిక స్కోరు 264 నంబర్ ప్లేటుతో ఉన్న రోహిత్ ‘లాంబోర్గిని’ ఒక దశలో గంటకు 200–215 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయిందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment