టీమిండియాకు పసికూన బంగ్లాదేశ్ భారీ షాకిచ్చింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 4) జరిగిన తొలి వన్డేలో బంగ్లా పులులు టీమిండియాపై వికెట్ తేడాతో విజయం సాధించి, సంచలనం సృష్టించారు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో.. బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ (38 నాటౌట్), టెయిలెండర్ ముస్తాఫిజుర్ (10 నాటౌట్) సహకారంతో బంగ్లాదేశ్‌కు చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు.
మెహిది, ముస్తాఫిజుర్ చివరి వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, టీమిండియా విజయావకాశాలపై నీళ్లు చాల్లారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల చెత్త ప్రదర్శన ఓటమికి ప్రధాన కారణమైంది. 136 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్‌ను భారత ఫీల్డర్లు దగ్గరుండి మరీ గెలిపించారు. 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. టీమిండియా నిర్ధేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్ (5/36), ఎబాదత్ హొస్సేన్ (4/47) దెబ్బకు 186 పరుగులకే (41.2 ఓవర్లలో) ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. శిఖర్ ధవన్ (7), కోహ్లి (9), షాబాజ్ అహ్మద్ (0), శార్ధూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0), సిరాజ్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. టీమిండియా బౌలర్లు సిరాజ్ (3/32), కుల్దీప్ సేన్ (2/37), సుందర్ (2/17), శార్ధూల్ ఠాకూర్ (1/15), దీపక్ చాహర్ (1/32) దెబ్బకు 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయినప్పటికీ.. మెహిది హసన్, ముస్తాఫిజుర్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి తమ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా డిసెంబర్ 7న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment