సరిహద్దు సమస్యకు చెల్లుచీటీ | India, Bangladesh ratify historic land agreement | Sakshi
Sakshi News home page

సరిహద్దు సమస్యకు చెల్లుచీటీ

Published Sun, Jun 7 2015 5:28 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

సరిహద్దు సమస్యకు చెల్లుచీటీ

సరిహద్దు సమస్యకు చెల్లుచీటీ

 మోదీ బంగ్లా పర్యటనలో ఎల్‌బీఏ అమలు ఖరారు
భారత ప్రధానికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన బంగ్లా ప్రధాని
మోదీ, హసీనా, బెంగాల్ సీఎం మమతల సమక్షంలో ఒప్పందం
భారత్‌కు 500 ఎకరాలు, బంగ్లాకు 10,000 ఎకరాల భూమి బదిలీ
బంగ్లాదేశ్‌కు తాజాగా 200 కోట్ల డాలర్ల రుణం ప్రకటించిన మోదీ
తొలి రోజు పర్యటనలో బంగ్లాతో భారత్ 22 ఒప్పందాలు ఖరారు

ఢాకా: భారత్-బంగ్లాదేశ్ మధ్య 41 ఏళ్ల సుదీర్ఘ సరిహద్దు వివాదానికి తెరపడింది.

భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లా పర్యటన సందర్భంగా.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల సమక్షంలో రెండు దేశాలూ శనివారం చరిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందాన్ని(ఎల్‌బీఏ) ఖరారు చేసుకున్నాయి. బంగ్లాలో తొలిసారి పర్యటిస్తున్న మోదీ.. ఆ దేశానికి తాజా 200 కోట్ల డాలర్ల రుణసాయం ప్రకటించారు.

అలాగా.. తీస్తా, ఫేని నదీ జలాల పంపిణీ సమస్యలకూ న్యాయబద్ధ పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు  సముద్ర ప్రాంత భద్రతలో సహకారం, మానవ అక్రమ రవాణా, నకిలీ భారత కరెన్సీ నిర్మూలన తదిరాలపై 22 ఒప్పందాలు కదుర్చుకున్నాయి.   
 
ఢాకాలో మోదీకి హసీనా స్వాగతం...
మోదీ తొలిసారిగా రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన నిమిత్తం శనివారం ఢాకా చేరుకున్నారు. హసీనా ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మోదీకి స్వాగతం పలికారు. ఆమె మంత్రివర్గ సహచరులూ హాజరయ్యారు. విమానాశ్రయంలోనే ఆయనకు సైనిక వందనం సమర్పించారు. ఢాకా మోదీ, హసీనా, మమతల ఫొటోలు, కటౌట్లతో తోరణాలు ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీని బలంగా వ్యతిరేకించే మమత బంగ్లా పర్యటనలో ఆయనతో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించటం విశేషం. అంతకుముందు.. సోనార్ గావ్ హోటల్‌లో మమతతో  మోదీ 20 నిమిషాలు సమావేశమై చర్చించారు. అనంతరం ఒకే వాహనంలో బంగ్లా ప్రధాని హసీనా కార్యాలయానికి చేరుకున్నారు.
 
ఎల్‌బీఏ అమలు.. 200 కోట్ల డాలర్ల రుణం...
హసీనా, మోదీలు సుదీర్ఘంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ముగ్గురి సమక్షంలో ఎల్‌బీఏ అమలుకు సంబంధించిన పత్రాలను ఇరు దేశాలూ ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇందులో భాగంగా.. సరిహద్దులో బంగ్లా నుంచి భారత్‌కు 51 ప్రాంతాలు, భారత్ నుంచి బంగ్లాకు 111 ప్రాంతాలు లభించనున్నాయి. మొత్తం మీద భారత్‌కు 500 ఎకరాలు, బంగ్లాకు 10,000 ఎకరాల భూమి దక్కనుంది.

అలాగే.. 50,000 మంది ప్రజల పౌరసత్వానికి సంబంధించిన సమస్య కూడా ఈ ఒప్పందం ద్వారా పరిష్కారం కానుంది. అనంతరం మోదీ, హసీనాలు మీడియాతో మాట్లాడారు. భారత్ 200 కోట్ల డాలర్లను బంగ్లాకు రుణంగా అందిస్తుందని మోదీ ప్రకటించారు. ఇంతకుముందు ప్రకటించిన 80 కోట్ల డాలర్ల రుణాన్ని సత్వరం అమలు చేస్తామని, 20 కోట్ల డాలర్లను పూర్తిగా పంపిణీ చేస్తామన్నారు. ఈశాన్య భారతంలో ఉగ్రవాదులు తలదాచుకునే ప్రాంతంగా పరిగణించే బంగ్లాలో ఉగ్రవాదుల పట్ల ఉపేక్ష చూపబోమని హసీనా హామీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య లోటును పూరించటానికి రెండు ప్రత్యేక ఆర్థిక మండళ్లను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు.
 
బంగ్లా యుద్ధ అమరవీరులకు నివాళులు
1971 బంగ్లా స్వాతంత్య్ర యుద్ధం అమరవీరులకు నివాళులు అర్పించి మోదీ బంగ్లా పర్యటనను ప్రారంభించారు. ఢాకా చేరుకున్న వెంటనే ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా సావర్ వద్ద ఉన్న ‘జాతియో స్మృతి సౌధో’ వద్దకు వెళ్లి అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి మౌనం పాటించారు. పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోసం బంగ్లాదేశ్ చేసిన ఆ యుద్ధంలో భారత్ కూడా బంగ్లాకు సాయపడ్డం తెలిసిందే. అక్కడ బంగబంధు మనుమడు షేక్ రెజ్వాన్ సిద్దిఖి మోదీకి స్వాగతం పలికారు.
 
సామర్లకోట ప్రాజెక్టు పరికరాలతో ప్రాజెక్టు
బంగ్లాదేశ్‌లో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో భారీ విద్యుత్ ప్లాంటు, ఎల్‌ఎన్‌జీ దిగుమతి టెర్మినల్‌లు నెలకొల్పేందుకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ సంస్థ ఆ దేశంతో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోటలో విద్యుత్ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసిన పరికరాలను బంగ్లాలో విద్యుత్ ప్రాజెక్టును వేగంగా నిర్మించేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది.
 
హిందూ మైనారిటీల కోసం గళం విప్పాలి...
కాగా, బంగ్లాదేశ్‌లోని తాము అనునిత్యం మత ఛాందసవాదుల నుంచి మత వివక్ష, దాడుల భయంతో జీవిస్తున్నామని.. దీనిపై  మోదీ గుర్తించి, బంగ్లా నాయకత్వంతో చర్చించాలని అక్కడి హిందువులు కోరారు.  మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ చిట్టగాంగ్ వెటరినరీ-యానిమల్ సెన్సైస్ వర్సిటీలో పోస్టర్లు అతికించినందుకు గాను..ముగ్గురు ఇస్లాం అతివాదులను అరెస్ట్ చేశారు.
 
భారత్ - బంగ్లా మధ్య రెండు బస్సు సర్వీసులు షురూ
మోదీ తొలి బంగ్లాదేశ్ పర్యటనను పురస్కరించుకుని.. భారత్ - బంగ్లాల మధ్య రెండు బస్సు సర్వీసులను ప్రారంభించారు. కోల్‌కతా - ఢాకా - అగర్తల; ఢాకా - షిల్లాంగ్ - గువాహటిల మధ్య నడిచే ఈ బస్సు సర్వీసులను ఢాకాలో హసీనా, మమతాబెనర్జీలతో కలసి మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హసీనాకు అగర్తలా - ఢాకా - కోల్‌కతా బస్సు టికెట్‌ను మోదీ ఇవ్వగా.. మోదీకి ఢాకా - షిల్లాంగ్ - గువాహటి బస్సు టికెట్‌ను హసీనా ఇచ్చారు.

మమతాబెనర్జీ కూడా హసీనాకు కోల్‌కతా - ఢాకా - అగర్తలా బస్సు టికెట్‌ను ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా రెండు ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం చేసే ఈ బస్సు సర్వీసులు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తాయని మోదీ పేర్కొన్నారు. కోల్‌కతా నుంచి ఢాకా మీదుగా అగర్తలా వెళ్లే బస్సు సర్వీసు వల్ల.. త్రిపురకు ప్రయాణించే దూరం 560 కిలోమీటర్లు తగ్గనుంది.
 
హసీనాకు వెంకటగిరి పరదా బహూకరించిన మోదీ
ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటగిరిలో ప్రత్యేకంగా చేతితో అల్లిన పరదాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు కానుకగా ఇచ్చారు. జామ్‌దానీ శైలిలో అల్లిన ఈ పరదాపై కల్పవృక్షం, కామధేనువుల చిత్రాల అల్లికలు ఉన్నాయి. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విటర్‌లో వ్యాఖ్యల ద్వారా వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement