‘పొరుగు’ బంధాలు కీలకం
న్యూఢిల్లీ: భారత్ అభివృద్ధిలో పొరుగు దేశాలతో సంబంధాలు కూడా ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కీలక వాణిజ్య మార్గం పెట్రాపోల్-బెనాపోల్ ల్యాండ్ పోర్టును బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. పశ్చిమ బెంగా ల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పెట్రాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు (ఐసీపీ) ద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థ అనుసంధానత మరింత బలపడి, సంబంధాలు మెరుగవుతాయన్నారు. భారత్, బంగ్లాదేశ్‌ల ఆర్థికాభివృద్ధి, అనుసంధానతలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద ఈ ల్యాండ్ పోర్టు ప్రారంభోత్సవం ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ఘట్టమన్నారు. ఏటా 15 లక్షల మంది ప్రజలు, లక్షన్నర ట్రక్కులు ఈ సరిహద్దు నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. బంగ్లాదేశ్‌లోని ఢాకా, కిషోర్‌గంజ్‌ల్లో జరిగిన ఉగ్రవాద దాడులపై మోదీ సంతాపాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేం దుకు బంగ్లాకు భారత్ అండగా ఉంటుందని హసీనాకు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపారాభివృద్ధికి ఐసీపీ కీలక అడుగని హసీనా వెల్లడించారు. భారత్‌తో సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు.
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్యానికి పెట్రాపోల్-బెనాపోల్ ప్రధాన సరిహద్దు మార్గం. యాభై శాతానికి పైగా ద్వైపాక్షిక వాణిజ్యం ఈమార్గం ద్వారానే జరుగుతుంది. భద్రత, ఇమిగ్రేషన్, కస్టమ్స్ వంటి ముఖ్య సేవలను సమర్థవంతంగా పెట్రాపోల్ ఐసీపీ అందిస్తుంది. సరిహద్దుల్లో గందరగోళం లేకుండా ప్రజా, సరుకు రవాణాకు దోహడపడుతుంది. 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ల్యాండ్ పోర్టు ద్వారా 68 వేల కోట్ల వాణిజ్యం జరుగుతుందని మమత చెప్పారు.