సంక్షుభిత బంగాళం | Sakshi Editorial On Bangladesh political crisis | Sakshi
Sakshi News home page

సంక్షుభిత బంగాళం

Published Tue, Aug 6 2024 5:17 AM | Last Updated on Tue, Aug 6 2024 5:17 AM

Sakshi Editorial On Bangladesh political crisis

భయపడినంతా అయింది. బంగ్లాదేశ్‌ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. హింసాత్మకంగా మారిన విద్యార్థుల నిరసనలు, వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం మధ్య అవామీ లీగ్‌ పార్టీ సారథి షేక్‌ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి, సైనిక విమానంలో దేశం విడిచిపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సాగిన 1971 నాటి బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నవారి కుటుంబ సభ్యు లకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన వివాదాస్పద కోటా విధానంపై మొదలైన రచ్చ చివరకు ఇంతకు దారి తీసింది. 

జూలైలో ఢాకా యూనివర్సిటీలో ఆరంభమైన విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఇంతలు అంతలై, ఘర్షణలకు దారి తీశాయి. గత నెలలోనూ, అలాగే ఈ ఆదివారమూ కలిపి 300 మందికి పైగా అమాయకుల ప్రాణాలు పోవడంతో బంగ్లాలో పరిస్థితులు వేగంగా మారాయి. గత నెలలో సుప్రీమ్‌ కోర్ట్‌ జోక్యం చేసుకొని, అన్నీ కలిపి 56 శాతమున్న రిజర్వేషన్లను 7 శాతానికి తగ్గించినప్పుడు నిరసనలు తగ్గి, ప్రశాంతత నెలకొంటుందని భావించారు. 

అప్పటికి కాస్త ఆగినట్టనిపించినా, మృతుల కుటుంబాలకు న్యాయం పేరిట మళ్ళీ నిరసనలు రేగాయి. ప్రభుత్వ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య మళ్ళీ రేగిన ఘర్షణల్లో ఒక్క ఆదివారమే 100 మంది దాకా చనిపోవడం, విద్యార్థుల ‘చలో ఢాకా’ ప్రదర్శన నేపథ్యంలో అగ్నిపర్వతం బద్దలైంది. 

క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను గుర్తించకుండా, నిరంకుశంగా వ్యవహరిస్తే ఎంతటి పాపు లర్‌ నేతకైనా ఎలాంటి దురవస్థ తలెత్తుతుందో సోమవారం నాటి దృశ్యాలు కళ్ళకు కట్టాయి. దేశ వ్యాప్త కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ సేవల సస్పెన్షన్‌ విధించినా ఢాకాలో రోడ్ల నిండా జనం, ప్రధాని నివా సాన్ని వారు చుట్టుముట్టిన తీరు, హసీనా రాజీనామా, విలాసవంతమైన ఆమె నివాసంలోకి జనం చొచ్చుకుపోయి లూటీ సాగించిన తీరు చూస్తుంటే... సరిగ్గా రెండేళ్ళ క్రితం 2022 జూలైలో శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్సేకు ఎదురైన ఘటనలు గుర్తుకొస్తాయి. 

దేశాలు, ప్రజలు వేరైనా, రెండు ఘటనల్లోనూ నిరంకుశ పాలన, అవినీతి, ఆశ్రిత పక్షపాతాలే ఇంతటి జనాగ్రహానికి కారణమయ్యా యని మరిచిపోరాదు. అయితే, బంగ్లాలో రెచ్చిపోయిన జనం ప్రధాని నివాసంలోకే కాక, ఆఖరికి దేశ పార్లమెంట్‌లోకి చొరబడి యథేచ్ఛగా ప్రవర్తించడం విస్మయం కలిగిస్తుంది. 

షేక్‌ హసీనా తండ్రి, బంగ్లాదేశ్‌ జాతిపిత అయిన ముజిబుర్‌ రెహమాన్‌ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేయడం, బంగబంధు మ్యూజియమ్‌ను తగలబెట్టడం, అధికార అవామీ లీగ్‌ ఆఫీసులకూ – పోలీస్‌ స్టేషన్లకూ – ప్రభుత్వ ఆఫీసులకూ నిప్పు పెట్టడం ప్రజాస్వామ్య వాదులకు ఆవేదన, ఆందోళన కలిగించక మానవు. 

అయిదు దశాబ్దాల స్వతంత్ర బంగాళం ఇటీవలెన్నడూ చూడని హింస, రాజకీయ సంక్షోభం ఇది. ఒక రకంగా ఇది అయిదుసార్లు బంగ్లా ప్రధానిగా వ్యవహరించిన 76 ఏళ్ళ హసీనా స్వయంకృతం. 2009 జనవరి నుంచి పదహారేళ్ళుగా నిర్విరామంగా అధికారంలో ఉన్న ఈ ఉక్కుమహిళ అనేక సంక్షోభాలనూ, హత్యాయత్నాలనూ దాటి వచ్చి, దేశాన్ని ఆర్థికంగా పైకి తెచ్చిన మాట నిజమే. 

ఒక దశలో ఇస్లామిక్‌ ప్రపంచంలో ప్రజాస్వామ్య, లౌకికవాదాలకు నమూనాగా తెచ్చుకున్న పేరూ పెద్దదే. కానీ, ప్రతిపక్ష నేతల్ని జైలులో పెట్టి, విమర్శకులను దేశద్రోహులుగా చిత్రించి, చట్టంతో పని లేకుండా ప్రత్యర్థుల్ని అడ్డు తొలగించుకుంటూ వచ్చి అభిమానుల్లో సైతం అప్రతిష్ఠ తెచ్చుకున్నారు. కోవిడ్‌ అనంతర పరిస్థితులు, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైంది. 

పెరిగిన ధరలు, పెచ్చుమీరిన నిరుద్యోగం, అణచివేతలతో అన్ని వర్గాల్లో అసంతృప్తి పేరుకుంది. పైగా, గడచిన రెండు తడవలుగా బంగ్లా ఎన్నికలు పరిహాసప్రాయమయ్యాయి. ముఖ్యంగా ఈ ఏటి జన వరి ఎన్నికలు వట్టి రిగ్గింగ్‌ అనే ఆరోపణలూ వచ్చాయి. ఇప్పుడామె రాజీనామాతో రోడ్డు మీద కొచ్చి ఆడామగా ఆనందిస్తున్న తీరు చూస్తే మార్పుకై జనం ఎంతగా మొహం వాచారో అర్థమవుతుంది.  

హసీనా రాజీనామాతో ప్రస్తుతం బంగ్లాదేశ్‌ సైన్యం కనుసన్నల్లోకి వెళ్ళింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్మీ ఛీఫ్‌ సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఆందోళనలకు అడ్డుకట్ట వేసి పరిస్థితిని చక్కదిద్దుతామనీ, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుందనీ ఆర్మీ ఛీఫ్‌ ప్రకటించారు. అయితే, అది అంత సులభమేనా? దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. 

పాలనా యంత్రాంగం పూర్తిగా పడకేసింది. సాక్షాత్తూ సైన్యం ఎదుటే ప్రదర్శకులు రెచ్చిపోతున్న దృశ్యాలూ కనిపించాయి. గత వారం నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ వర్గీయులు సహా ఇంతకాలం అణచివేతకు గురైన ప్రతిపక్షాల మద్దతుదారులూ రోడ్డెక్కడంతో నిరసనకారుల్లో అందరూ విద్యార్థులే అనుకోలేం. అనూహ్య విధ్వంసం చూస్తుంటే, అసాంఘిక శక్తులు చేరాయన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి. 

బంగ్లాదేశ్‌ పరిణామాలు భారత్‌పై చూపే ప్రభావమూ ఎక్కువే. కొన్నేళ్ళుగా భారత అనుకూల హసీనా ఏలుబడి మనకు కలిసొచ్చింది. ఇప్పుడిక ప్రతికూల పార్టీలు అక్కడ అధికారంలోకి వస్తే చిక్కులు తప్పవు. మళ్ళీ ఒకప్పటిలా సరిహద్దులో తీవ్రవాద సంస్థల పీడ పెరుగుతుంది. అవి అక్కడ తిష్ఠ వేసి, మన ఈశాన్య రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తాయి. చొరబాట్లూ ఎక్కువవుతాయి. కోటీ 30 లక్షల మంది హిందువులున్న బంగ్లాలో భారత మైనారిటీల భద్రత ప్రశ్నార్థకమవుతుంది. హసీనా ఉండగానే వారి పైన దాడులు తప్పలేదు. 

ఇక, ఛాందసవాద, ప్రతికూల శక్తులు గద్దెనెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో? అలాగే, ఢాకా దృశ్యాలను చూస్తే, ఇదే అదనుగా తీవ్రవాద శక్తులు విజృంభించ కుండా బంగ్లా సమాజం అప్రమత్తం కావాలనిపిస్తోంది. ముందుగా శాంతిభద్రతలు నెలకొనడం అవసరం. ఎలాంటి సర్కారుతో సాగాలి, మళ్ళీ ఎన్నికలు లాంటివన్నీ ఆ తర్వాతే! అది పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారం, ప్రజాభీష్టం. ఏమైనా రానున్నరోజులు బంగ్లాకే కాదు భారత్‌కూ కీలకం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement