సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ప్రోత్సాహంతోనే ఢిల్లీ ఐఏఎస్‌లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. రాష్ట్ర హక్కులను కేంద్రం హరిస్తుందంటూ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద గత ఆరు రోజులుగా నిరసన వ్యక్తం చేస్నున్న సంగతి తెలిసిందే. ఏడో రోజు కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు.
ఐఏఎస్‌లు విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి లేఖ కూడా రాశారు. గత వారం రోజులు పోరాటం చేస్తున్నా.. ప్రధాని నోరు మెదపడం లేదని విమర్శించారు. అధికారులను పనిచేయవద్దని చెప్పి ప్రధాన మంత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘ ఢిల్లీ ఐఏఎస్ అధికారులకు పని చేయవద్దని చెప్పి, వారితో ఆందోళన చేయిస్తున్న ప్రధాని చేతుల్లో ప్రజాస్వామ్యం భద్రంగా ఉందా’ అని ట్వీటర్ ద్వారా ప్రశ్నించారు.
కాగా కేజ్రీవాల్ ధర్నాకు శనివారం నలుగురు ముఖ్యమంత్రులు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం విజయన్ శనివారం రాత్రి 9 గంటలకు ఏపీ భవన్ నుంచి పాదయాత్రగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment