న్యూఢిల్లీ: ప్రశాంత్ కిశోర్. ఎవరికీ పరిచయం చేయనక్కర్లేని పేరు. ఎన్నో రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా తెరవెనుక పని చేసి తనకంటూ ఒక ఇమేజ్ కల్పించుకున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయంతో మరోసారి ఆయన పేరు దేశవ్యాప్త రాజకీయాల్లో మారుమోగిపోతోంది. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ–ప్యాక్)తో గత డిసెంబర్‌లో ఆప్ చేతులు కలిపింది. అప్పట్నుంచి ఆప్ ప్రచార ధోరణే మారిపోయింది. బీజేపీ చేసే వ్యతిరేక ప్రచారానికి అసలు బదులివ్వొద్దని, సంయమనం పాటించాలని కేజ్రివాల్‌కు సూచించింది ప్రశాంత్ కిశోరేనని ఐప్యాక్ వర్గాలు వెల్లడించాయి. అలా పాజిటివ్ ప్రచారంతో ఆప్ విజయభేరి మోగించింది. ఫలితాలు వెలువడగానే ప్రశాంత్ కిశోర్ ‘‘భారత్ ఆత్మను కాపాడడానికి ఒక్కటై నిలిచిన ఢిల్లీవాసులకి ధన్యవాదాలు’’అని ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఆప్ సర్కార్ విద్య, ఆరోగ్య రంగాల్లో సాధించిన విజయాలనే ప్రచారంలో హైలైట్ చేశారు. స్విమ్మింగ్ పూల్స్‌తో ఉన్న పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌ల గురించి విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, ఆప్ థీమ్ సాంగ్ లగేరహో కేజ్రివాల్ అనే పాటను బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దాడ్లానీతో దగ్గరుండి ట్యూన్ చేయించి ప్రభుత్వ పథకాలు జనంలోకి వెళ్లేలా చేయడంలో విజయం సాధించారు. ఐపాక్ సంస్థ తొలిసారిగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెరవెనుక ఎన్నికల వ్యూహాలను రచించింది. అప్పుడు ప్రచారంలో ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ చాయ్ పే చర్చ కార్యక్రమం రచించింది ప్రశాంత్ కిశోరే.
Comments
Please login to add a commentAdd a comment