
బీజేపీ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ అసంతృప్త ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో తీవ్రంగా విభేదిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను శత్రుఘ్న సిన్హా బాహాటంగా సమర్ధించారు. లెఫ్టినెంట్ జనరల్ సర్వాధికారాలను నిరసిస్తూ జరుగుతున్న సమ్మెను విరమించి అధికారులను తిరిగి విధుల్లోకి చేరాలని కోరడం ద్వారా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డైనమిక్ నేతగా నిరూపించుకున్నారని ఆయన ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ తీసుకున్న చొరవ నేపథ్యంలో ప్రధాని సైతం జోక్యం చేసుకుని సమ్మెను విరమించచేస్తారని తాను భావిస్తున్నానన్నారు.
ఢిల్లీ ప్రజల ప్రయోజనాలతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రధాని స్పందిస్తే మేలు చేసిన వారవుతారని వ్యాఖ్యానించారు. వేల మైళ్ల ప్రయాణమైనా ప్రారంభమయ్యేది ఒక్క అడుగుతోనే అంటూ సిన్హా ట్వీట్‌ను ముగించారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనను పక్కనపెట్టినప్పటి నుంచి పార్టీ నాయకత్వంపై ఆయన పలు సందర్భాల్లో కత్తిదూస్తున్న విషయం తెలిసిందే.
గత కొద్ది నెలలుగా బీజేపీ కేంద్ర నాయకత్వంపై, ప్రధాని మోదీపై వీలుచిక్కినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. గత వారం పార్టీ భాగస్వామ్య పక్షం జేడీయూ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు గైర్హాజరైన సిన్హా, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో శత్రుఘ్న సిన్హా పాల్గొనడంపై బీజేపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment