సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కోసమే తాము పోరాటం చేస్తున్నామని, అంతేకాని సొంత ప్రయోజనాల కోసం ధర్నా చేయడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం హరిస్తుందంటూ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద గత ఐదు రోజులుగా నిరసన వ్యక్తం చేస్నున్న సంగతి తెలిసిందే. ఆరో రోజు కూడా వారి నిరసన కొనసాగుతోంది. కాగా కొన్ని టీవీ చానెళ్లు తమ పోరాటాన్ని ‘ ఏసీ -సోఫాకా ధర్నా’ ( ఏసీలో బెడ్‌పై కూర్చొని ధర్నా) అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘ఈ ధర్నా వల్ల వ్యక్తిగతంగా నాకు ఏం ఉపయోగం లేదు. నా కోసమో, నా పిల్లల కోసమో ధర్నా చేయడం లేదు. ఇది సరదా కోసం చేస్తుంది కాదు. కొన్ని టీవీ చానెళ్లు మా నిరసను ‘ ఏసీ సోఫాకా ధర్నా’ ( ఏసీలో బెడ్‌పై కూర్చొని ధర్నా) అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేసే ధర్నా’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరాహార దీక్ష చేస్తోన్న తమ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
బలవంతంగా తరలిస్తే మంచి నీళ్లు కూడా తీసుకోం
లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి తమను బలవంతంగా తరలిస్తే పచ్చి మంచి నీళ్లను కూడా తీసుకోబోమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే వరకూ నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘25 మంది ఇక్కడకు వచ్చారు. వారు మమల్ని తరలించడానికే వచ్చారనుకుంటాను. కానీ మా దీక్ష మాత్రం విరమించేది లేదు. ఒక వేళ మమల్ని బలవంతంగా తరలిస్తే పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకో’ అని వీడియోలో తెలిపారు.
కాగా బీజేపీ, ఆప్ కలిసి ధర్నా నాటకం ఆడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. పాలనను వదిలేసి ధర్నా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని మండిపడ్డారు. మరో వైపు బీజేపీ కూడా ధర్నాకు దిగింది. రాష్ట్రం ప్రభుత్వం ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, నీటి కొరతను తీర్చాలంటూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ మేరకు వారు రాష్ట్రపతికి లేఖను కూడా రాశారు.
Comments
Please login to add a commentAdd a comment