న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పరిపాలనా వ్యవహారాలపై అధికారం ఎవరిదన్న వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి భారీ ఊరట కలిగించింది. శాంతిభద్రతలు(పబ్లిక్ ఆర్డర్), పోలీసు శాఖ, భూమి మినహా మిగిలిన పరిపాలనా వ్యవహారాలపై శాసన, కార్యనిర్వాహక అధికారాలు స్థానిక ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటాయని తేల్చిచెప్పింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పును ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికే అధికార యంత్రాంగంపై నియంత్రణ ఉండాలని ధర్మాసనం పేర్కొంది.
అధికారులు మంత్రుల ఆదేశాలు పాటించకపోతే, వారికి నివేదించకపోతే పరిపాలనపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. దేశ రాజధాని అయిన ఢిల్లీకి ప్రత్యేక స్వరూపం ఉందని, ఇతర రాష్ట్రాల తరహాలో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. కాబట్టి ఢిల్లీలో పరిపాలనపై అధికారాలు ప్రజాప్రతినిధులతో కూడిన స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టంచేసింది. ఢిల్లీలో పబ్లిక్ ఆర్డర్, పోలీసు శాఖ, భూమిపై అధికారాలు కేంద్రానివేనని ఉద్ఘాటించింది.
సహకార సమాఖ్య స్ఫూర్తి ప్రకారం రాజ్యాంగం నిర్దేశించిన పరిధులకు లోబడి కేంద్రం తన అధికారాలను ఉపయోగించాలని సూచించింది. సివిల్ సర్వీసు అధికారులు రాజకీయంగా తటస్థంగా వ్యవహరించాలని, ప్రభుత్వం రోజువారీగా తీసుకొనే నిర్ణయాలను అమలు చేయడానికి మంత్రుల పరిపాలనాపరమైన నియంత్రణ కింద పనిచేయాలని పేర్కొంది. సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం పరస్పరం సహకరించుకోవాలని సూచించింది.
కేజ్రీవాల్ కార్యాచరణ ప్రారంభం
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే అరవింద్ కేజ్రీవాల్ తన కార్యాచరణ ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఇక తన చేతులను ఎవరూ కట్టిపారేయలేరని, అభివృద్ధిని 10 రెట్లు వేగవంతంగా చేస్తామని చెప్పారు. సర్వీసెస్ సెక్రెటరీ పోస్టు నుంచి ఆశీష్ మోరేను తొలగించారు. ఆయన స్థానంలో 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఏకే సింగ్‌ను నియమించారు. ఢిల్లీలో త్వరలో బదిలీ–పోస్టింగ్ పరిశ్రమ రాబోతోందని బీజేపీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. చరిత్రాత్మక తీర్పు అని కాంగ్రెస్ పేర్కొంది.
కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌తో వివాదం
ఢిల్లీలో పరిపాలన సర్వీసులపై అధికారాలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని తేల్చిచెబుతూ 2015లో కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా కాకుండా భారత రాజ్యాంగం ఢిల్లీకి విశిష్ట హోదా కల్పించిందని తెలియజేసింది. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరం వ్యక్తం ఆప్ ప్రభుత్వం తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ సానుకూల తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై 2019 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇద్దరు సభ్యులు భిన్నంగా స్పందించారు. ఢిల్లీలో పాలనపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉండవని జస్టిస్ అశోక్ భూషణ్ చెప్పగా, మరో సభ్యుడు జస్టిస్ ఏకే సిక్రీ దాన్ని వ్యతిరేకించారు. దీంతో ‘ఆప్’ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ వివాదాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు గతేడాది మే 6న సుప్రీంకోర్టు ప్రకటించింది. వివాదంపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది.
ఇది ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్
సుప్రీంకోర్టు తీర్పుపట్ల ‘ఆప్’ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలకు న్యాయం చేకూర్చిన సుప్రీంకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై ఢిల్లీలో అభివృద్ధిని వేగవంతం అవుతుందని అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ‘ఇది మైలురాయి లాంటి తీర్పు, సత్యమేవ జయతే’ అని ‘ఆప్’ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధా ట్వీట్ చేశారు.
చదవండి: కర్ణాటక కాంగ్రెస్‌దే! ఎగ్జిట్ పోల్స్ వెల్లడి.. ఒకవేళ హంగ్ అయితే కింగ్‌మేకర్ ఆ పార్టీయే!
Comments
Please login to add a commentAdd a comment