భారత ప్రజాస్వామ్యం సచేతనమే కాదు, చలనశీలం కూడా! | MP Vijayasai Reddy Article On Indias Democratic System | Sakshi
Sakshi News home page

భారత ప్రజాస్వామ్యం సచేతనమే కాదు, చలనశీలం కూడా!

Published Tue, Jun 6 2023 7:30 PM | Last Updated on Tue, Jun 6 2023 7:32 PM

MP Vijayasai Reddy Article On Indias Democratic System - Sakshi

‘ఇండియాలో ఉన్నది సచేతన ప్రజాస్వామ్య వ్యవస్థ. న్యూఢిల్లీ వెళ్లే ఎవరైనా ఈ వాస్తవం స్వయంగా చూడవచ్చు,’ అని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌ హౌస్‌ వ్యూహాత్మక కమ్యూనికేషన్ల విభాగం సమన్వయకర్త జాన్‌ కర్బీ వ్యాఖ్యానించారు. భారతదేశంలో గత 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న విషయంపై అగ్రరాజ్యం అధికారి ఒకరు సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుతం లేనే లేదు. కాని, దేశంలో రోజురోజుకూ పరిణతి, పరిపక్వత సాధిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై కొందరు ప్రపంచ లేదా పాశ్చాత్య మేధావులు తరచు అభాండాలు వేస్తూ, అనుమానాలు వ్యక్తం చేయడం ఈమధ్య అలవాటుగా మారింది.

ఈ పరిస్థితుల్లో పైన చెప్పిన వైట్‌ హౌస్‌ అధికారి–భారత ప్రజాస్వామ్యం నాణ్యతపై వెలిబుచ్చిన అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం వైట్‌ హౌస్‌ విలేఖరుల సమావేశంలో ప్రఖ్యాత అమెరికా మీడియా సంస్థ నేషనల్‌ పబ్లిక్‌ రేడియో (ఎన్పీఆర్‌) ప్రతినిధి అస్మా ఖాలిద్‌ అడిగిన ప్రశ్నకు జవాబుగా పై మాటలు అన్నారు కర్బీ. ‘ఇండియాలో ప్రజాస్వామ్యం ఆరోగ్యంపై అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం ఏమాత్రమైనా పట్టించుకుంటోందా? ’ అని అస్మా ప్రశ్నించడంతో అమెరికా ఉన్నతాధికారి నిక్కచ్చిగా సమాధానమిచ్చారు.

21వ శతాబ్దం ఆరంభం నుంచి ఇండియాలో ఆర్థికాభివృద్ధి శరవేగంతో సాగుతున్న విషయం తెలిసిందే. ఒక్క ఆర్థికరంగంలోనే గాక అన్ని రంగాల్లో భారతదేశం, వివిధ పారిశ్రామిక, ధనిక దేశాల్లో భారతీయులు విశేష ప్రగతి సాధిస్తున్న విషయం కూడా అందరూ అంగీకరించే సత్యమే. అయితే, భారత్‌ కొత్త ప్రపంచ ఆర్థికశక్తిగా అవతరించడం గిట్టని అనేక మంది ఇండియాలో ప్రజాస్వామ్యం ‘ఆరోగ్యం’ లేదా నాణ్యతపై అప్పుడప్పుడూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. 1950 జనవరిలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కొన్నిసార్లు ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న రాజకీయపక్షాలే అధికారంలోకి వస్తే, మరికొన్ని సార్లు ప్రతిపక్షాలు విజయం సాధించి న్యూఢిల్లీలో గద్దెనెక్కాయి. అలాగే, 20కి పైగా ఉన్న అనేక రాష్ట్రాల్లోనూ అధికారం ఎన్నికల ద్వారానే వివిధ పార్టీల మధ్య బదిలీ అవుతోంది.

 ప్రజాస్వామ్యమే భారత్‌ ప్రాణం
1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలోనూ ప్రభుత్వాలు సుస్థిరంగా పనిచేస్తూ ముందుకు వెళ్లలేకపోయిన సందర్భాలు కూడా ఉన్న మాట నిజమే. కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రానప్పుడు భిన్న రాజకీయపక్షాల మధ్య అంగీకారం కుదరకపోవగంతో పదే పదే రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలూ చాలా ఉన్నాయి. కాని, ఇదంతా గతం. ఈమధ్య కాలంలో రాజకీయ అస్థిరత కారణంగా రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అలాగే, పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి అవసరమైన సాధారణ మెజారిటీ రాని పరిస్థితులు చూశాం.

1984 డిసెంబర్‌ పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకున్నా ప్రభుత్వాలు సాఫీగానే నడిచాయి. పూర్తి పదవీకాలం ఐదేళ్లు ప్రభుత్వాలు నడవకపోయినా ఆర్థికవ్యవస్థను, దేశాన్ని కలవరపరిచే సంక్షోభం ఎప్పుడూ తలెత్తలేదు. 1991 నుంచి 2014 వరకూ కేంద్రంలో మైనారిటీ లేదా సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగినా ప్రజాస్వామ్యం నాణ్యత లేదా ఆరోగ్యం సన్నగిల్ల లేదు. దాదాపు పాతికేళ్ల తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినది 2014, 2019 లోక్‌ సభ ఎన్నికల్లోనే. ఓ పక్క అంకితభావంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో పయనిస్తూనే మరో పక్క ఇండియా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. ఈ సానుకూల పరిస్థితుల్లో కూడా భారత ప్రజాస్వామ్యంపై అనుమానాలు రేకెత్తించడం అన్యాయం. అందుకే ఇండియాలో ప్రజాస్వామ్యం సచేతనంగా ఉందని, ఈ వాస్తవం స్వయంగా చూడడానికి న్యూఢిల్లీ వెళ్లి రావాలని అమెరికా అధికారి సలహా ఇవ్వడం శుభసూచికం.


విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement