ఎలక్షన్ టూరిజం.. ఇదో సరికొత్త ట్రెండ్
ఓట్ల పండుగను కళ్లారా చూసేందుకు విదేశీ టూరిస్టుల క్యూ
విహార యాత్రలతో కలగలిపి ప్యాకేజీలు
రూ.40,000 – 1.5 లక్షల రేంజ్‌లో...
97 కోట్ల మంది ఓటర్లు
1.5 కోట్ల మంది పోలింగ్–భద్రతా సిబ్బంది
55లక్షల ఈవీఎంలు
10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు
ప్రపంచ ప్రజాస్వామ్య జాతరలో పూనకాలు లోడింగ్... అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు! 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్... యూరప్ మొత్తం జనాభా (75 కోట్లు) కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ!
అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓట్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కళ్లారా చూసేందుకు ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు వినూత్న ఐడియాతో వారికి ‘ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్’ను చూపించేందుకు ప్లాన్ చేశాయి. అదే ‘ఎన్నికల టూరిజం’. దేశంలో ఇప్పుడిది నయా ట్రెండ్!
‘కోడ్’ కూతతో 7 విడతల్లో 44 రోజుల పాటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మెగా సార్వత్రిక సమరంలో పారీ్టల ప్రచారం జోరందుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో భారీ సభలు.. పోటీ చేసే అభ్యర్థులు చేసే విన్యాసాలు... ప్రసంగాల్లో నేతల వాగ్దాటి... రాత్రికిరాత్రే పారీ్టలు మార్చే ఆయారాంలు, గయారాంలు.. హోరెత్తించే ర్యాలీలు.. కార్యకర్తల సందడితో దేశమంతా ఎన్నికల జ్వరం ఆవహించింది. మనకు ఇవేమీ కొత్తకాదు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువును ప్రత్యక్షంగా చూడాలనుకునే విదేశీయుల కోసం దేశంలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు ఎన్నికల టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి.
2019లో ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను చూసేందుకు దాదాపు 8,000 మంది విదేశీ టూరిస్టులు వచి్చనట్లు అంచనా. ముఖ్యంగా అమెరికా, చైనా, నేపాల్, యూఏఈ, ఉక్రెయిన్, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, మహిళా బృందాలు, చరిత్ర–సంస్కృతి, రాజకీయాల పట్ల మక్కువ చూపేవారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎన్నికల టూరిజం కోసం 25,000 మందికి పైగానే విదేశీ పర్యాటకులు రావచ్చని ట్రావెల్ కంపెనీలు
లెక్కలేస్తున్నాయి.
మెక్సికో స్ఫూర్తి
2005లో మెక్సికోలో బాగా విజయవంతమైన పోల్ టూరిజం స్ఫూర్తితో అహ్మదాబాద్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ అనే సంస్థ ఈ కాన్సెప్టును తొలిసారి దేశంలో ప్రవేశపెట్టింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంది. వణ్యప్రాణుల టూరిజం... మెడికల్ టూరిజం... విలేజ్ టూరిజం... హిమాలయన్ ట్రెక్కింగ్ టూరిజం... తీర్థయాత్రల టూరిజం... దేవాలయాలు–ఆధ్యాతి్మక టూరిజం.. యోగా టూరిజం.. ఇలా విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న జాబితాలోకి ఎన్నికల టూరిజాన్ని కూడా చేర్చింది.
గుజరాత్‌లో సక్సెస్ కావడంతో 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగించినట్లు ఆ సంస్థ చైర్మన్ మనీష్ శర్మ చెప్పారు. ‘ఎన్నికల సమయంలో భారత్‌ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ టూరిస్టుల్లో యూరోపియన్లు, మధ్య ప్రాచ్యం, పశి్చమాసియాకు చెందిన వారు ఎక్కువ. ర్యాలీల్లో లక్షలాది మంది పాల్గొనడం వారికి సరికొత్త అనుభూతిని అందిస్తోంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగానే ట్రావెల్ ఏజెన్సీలు ఎలక్షన్ టూరిజం ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. 6 రోజులకు ప్రారంభ ధర రూ. 40,000 కాగా, 2 వారాల ప్యాకేజీకి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి.
ప్యాకేజీల ప్రత్యేకతేంటి?
అటు పర్యాటకంగా, ఇటు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే కీలక ప్రాంతాలు, రాష్ట్రాలను ఏజెన్సీలు ప్రధానంగా ఎంచుకుంటున్నాయి. వారణాసి, ఢిల్లీతో సహా కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఎన్నికల టూరిజం ప్యాకేజీల్లో ప్రధానంగా చోటు దక్కించుకుంటున్నాయి. భారీ ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొనడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులతో మాటామంతీ, కలిసి భోజనం చేయడం, గ్రామ పంచాయతీలను సందర్శించడం వంటివన్నీ ప్యాకేజీల్లో చేరుస్తున్నారు.
పోటీ చేసే అభ్యర్థులను కలుసుకునే అవకాశాన్ని కూడా టూరిస్టులకు కలి్పస్తున్నారు. దీనివల్ల వారి ప్రచార వ్యూహాలు, ఇతరత్రా ఎన్నికల సంబంధ విషయాలను నేరుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. కేవలం ఎన్నికల కార్యక్రమాలనే కాకుండా చుట్టుపక్కల గుళ్లూ గోపురాలు, కోటలు, బీచ్‌ల వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చుట్టేసే విధంగా ప్యాకేజీలను రూపొందిస్తున్నామని శర్మ వివరించారు. అంతేకాదు ధాబాల్లో భోజనం, స్థానికంగా నోరూరించే వంటకాలను రుచి చూపించడం, ఆ ప్రాంతంలోని సంస్కృతి, సాంప్రదాయాలతో పర్యాటకులు మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
కాగా, ఢిల్లీకి చెందిన ఇన్‌క్రెడిబుల్ హాలిడేస్ అనే సంస్థ విదేశీ టూరిస్టులతో పాటు దేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ప్యాకేజీలను అందిస్తోంది. సందర్శనీయ ప్రదేశాలను చూపడంతో పాటు ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా పర్యాటకుల అభిరుచిని బట్టి ప్యాకేజీలను రూపొందిస్తున్నామని ఈ కంపెనీ కన్సల్టింగ్ పార్ట్‌నర్ సుదేశ్ రాజ్‌పుత్ పేర్కన్నారు. ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ రూ.25,000 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ట్రావెబ్రేట్.కామ్ ప్యాకేజీ కూడా ఇలాంటిదే. ఢిల్లీలోని ఎలక్షన్ మ్యూజియం సందర్శనలో మన ఎన్నికల చరిత్ర, చిరస్మరణీయ నాయకుల గురించి తెలుసుకోవడం, పోలింగ్‌ను తీరును చూపించడం, ఫలితాల రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ, విజేతల సంబరాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment