ప్రజాస్వామ్యం .. అపహాస్యం
ప్రజాస్వామ్య విధానాలను టీడీపీ నాయకులు తుంగలోకి తొక్కుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలను సొంతంగా అమలు చేస్తున్నారు. అధికారులు సైతం.
- ప్రొటోకాల్ పాటించిన అధికారులు
- డోన్ నియోజకవర్గంలో
అడ్డగోలుగా పింఛన్ల పంపిణీ
- అధికారపార్టీ నాయకుల ఇష్టారాజ్యం
డోన్ టౌన్: ప్రజాస్వామ్య విధానాలను టీడీపీ నాయకులు తుంగలోకి తొక్కుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలను సొంతంగా అమలు చేస్తున్నారు. అధికారులు సైతం..టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రొటోకాల్‌ను పాటించడం లేదు. ప్రజలతో ఎన్నికైన వారు కాకుండా ఓడినవారే అక్కడ అధికార దర్పం ప్రదర్శిస్తుంటారు. డోన్ నియోజకవర్గంలో ఈ తంతు సాగుతోంది. డోన్ నియోజకవర్గానికి ఇటీవల 2 వేల పింఛన్లు మంజూరయ్యాయి. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శనివారం డోన్ పట్టణంలో నిర్వహించారు. అయితే స్థానిక శాసన సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ మేరకు అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి సఫలీకృతులయ్యారు. ఎమ్మెల్యేను స్వయంగా కాని, ఫోన్ ద్వారా కాని ఆహ్వానించే తీరిక అధికారులకు కూడా లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వెంటాడుతున్న భయం..
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించకుండానే.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టడం, ప్రారంభోత్సవాలు చేయడం టీడీపీ నేతలకు షరా మామూలైంది. ఈ కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వనిస్తే ప్రజలందరి సమక్షంలో టీడీపీ నేతల అవినీతిని ఎత్తి చూపుతారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారనే భయం అధికారపార్టీ నాయకులను వెన్నాడుతోంది. ఇటీవల ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ సమయంలో నందికొట్కూర్ ఎమ్మెల్యే ఐజయ్య.. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. దీంతో అధికారపార్టీ నాయకులు చేపడుతున్న కార్యక్రమాల్లో మరింత జాగ్రత్తలు తీసుకొంటున్నారు. పిలిస్తే ఏ కార్యక్రమానికైనా హాజరై టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల సమక్షంలో ఎండగట్టేందుకు వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉంటారని తెలిసే వారిని ఆహ్వానించకుండానే ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆగమేఘాలపై కార్యక్రమం..
పీఏసీ చైర్మన్, స్థానిక శాసన సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అందుబాటులో లేని సమయం చూసి ఆగమేఘాలపై నియోజకవర్గపు స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, డోన్ మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రికె గాయత్రీదేవిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ ఫింఛన్లను అధికారపార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా.. తాము ఒక రోజు ముందుగానే ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటికి సమాచారం అందించినట్లు తెలిపారు. ఆయన అందుబాటులో లేకపోతే తాము భాద్యులమెలా అవుతామని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే హడావిడిగా పింఛన్లను పంపిణీ చేశామని చెబుతున్నారు.
నీతిమాలిన రాజకీయాలు
ప్రజాప్రతినిధులను ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఆహ్వనించకపోవడం ప్రజాస్వామ్యానికే అగౌరవం. ఇలాంటి నైతికతలేని, నీతిమాలిన రాజకీయాలకు టీడీపీ నాయకులు పాల్పడడం దురదృష్టకరం. ప్రొటోకాల్ పాటించాలనే ఇంగిత జ్ఞానం కూడా టీడీపీ నాయకులకు , అధికారులకు లేకపోవడం శోచనీయం. డోన్‌లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురించి నాకు కనీస సమాచారం కూడా లేదు.
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , పీఏసీ చైర్మన్, డోన్ శాసన సభ్యులు