సమాజపు కక్కసు కడిగే అమ్మలు! | All India Progressive Association | Sakshi
Sakshi News home page

సమాజపు కక్కసు కడిగే అమ్మలు!

Published Thu, Oct 6 2016 10:59 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

సమాజపు కక్కసు   కడిగే అమ్మలు! - Sakshi

సమాజపు కక్కసు కడిగే అమ్మలు!

ఫస్ట్ పర్సన్

సరిగ్గా అన్నం తినేటప్పుడే అనుకుంటా..
ఒక్క పూట కాదు .. ఒక్క రోజు కాదు.. ప్రతి పూటా..
ప్రతి రోజూ సరిగ్గా అన్నం తినేటప్పుడే...
అమ్మ తినేటప్పుడే బిడ్డ దొడ్డికెళ్తాడు!
ఎంగిలి చేయి కొడుక్కొని బిడ్డ ముడ్డి కడిగి
మళ్లీ చేతులు కడుక్కొని అమ్మ అన్నం తింటుంది!!
ఆమె అమ్మ... మరి వీళ్లు..??
- రామ్, ఫీచర్స్ ఎడిటర్

 

స్వచ్ఛ భారత్‌పై మీ అభిప్రాయం?
1.6 లక్షల మంది మహిళలు ఇతరుల మలాన్ని ఎత్తిపోసే దయనీయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రతిరోజూ ఒకరు లేదా  ద్దరు మనుషులు ఇందులో చనిపోతున్నారు. ఈ పనిచేస్తున్న స్త్రీలలో అయితే అబార్షన్ రేట్ అధికంగా ఉంది. ఆస్తమా, చర్మవ్యాధులూ వీరిని అనుక్షణం పట్టిపీడిస్తున్నాయి. విద్య, వైద్యం వీరికి ఏరకంగానూ అందుబాటులో లేదు. కనీస గుర్తింపుకి సైతం వీరు నోచుకోలేదు. తరతరాలుగా ఇదే పనిలో ఉండి, ఇందులోనే ప్రమాదంలో చనిపోతే ఒక్క రూపాయి కూడా వీరికిరాదు. చనిపోయిన కుటుంబాలకు ఆరులక్షల రూపాయలివ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సఫాయి కర్మచారీ ఆందోళన్ పోరాటంతో 2013లో చట్టం కూడా చేశారు. ఈ వ్యవస్థని నిషేధిస్తూ 1993లోనే చట్టం వచ్చింది. చట్టాలు అమలుచేయడానికి కూడా పోరాడాల్సిన దుస్థితి మనది. ఎన్ని చట్టాలొచ్చినా వీరి బతుకుల్లో వీసమెత్తు మార్పులేదు.  కానీ ఒక్కరోజు చీపురు పట్టుకుని ఊడ్చినందుకు ప్రపంచమంతా స్వచ్ఛభారత్ చర్చనీయాంశం అయ్యింది. ఇదే రియల్ ఫేస్ ఆఫ్ అవర్ డెమొక్రసీ.


పాకీ రిపోర్టర్. ఇదేదో చెడ్డమాటలా స్ఫురించడం లేదూ? వినసొంపుకాని అశుద్ధం లాంటి శబ్దమేదో మనకి అంటుకున్నట్టు అనిపిస్తోంది కదూ? మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే అమానవీయ పనిని నిషేధించే మహోద్యమంలో భాగమైనందుకు, అశుద్ధ భారతాన్ని అక్షరాలతో కడిగేసే యుద్ధంలో పాల్గొన్నందుకు బాషాసింగ్ అనే జర్నలిస్టుకి  తోటి జర్నలిస్టుమిత్రుల నుంచి దక్కిన వ్యంగ్యపు బిరుదే ‘పాకీ రిపోర్టర్’. ఔట్‌లుక్ బ్యూరోచీఫ్‌గా ఉన్నప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ మొదలు కర్నాటక వరకు పాకీ పనివారి జీవితాల్లోని అమానవీయ కోణాన్ని అక్షరీకరించేందుకు దొడ్లల్లో మలాన్ని ఎత్తివేసే పాకీపనివారితోనే తిరిగి వారితోనే తిని, ఆ అంటరాని జనంతో మమేకమౌతూ బాషాసింగ్ రాసిన ‘అన్‌సీన్’ పుస్తకపు జర్నీయే ఈ ఇంటర్వ్యూ.

మీ పుస్తకానికి ‘అన్‌సీన్’ అని పేరెందుకు పెట్టారు?
సమాజంలో మనకి కనిపించే రంగులు చాలా ఉన్నాయి. కానీ కనిపించని రంగులు ఇంకా ఎక్కువ. అశుద్ధాన్ని కడిగేపనిలో తరాల తరబడి గడిపిన స్త్రీలకు ఇంటికెళ్ళాక పసుపు రంగు ఆహారాన్ని చూస్తే కడుపులో దేవుతుంది. అది గుర్తుకొస్తే ఆ పూటకి మెతుకు దిగదు. అంతర్జాతీయ మానవ హక్కుల గురించి మాట్లాడుకుంటున్న మన దేశంలో మానవ మలమూత్రాలను ఎత్తివేసే అమానవీయ పనిలో రోజూ ఛస్తూ బతుకుతోన్న అనేకానేక మంది స్త్రీల జీవితాలు ఎవ్వరికీ పట్టవు. మనుషుల మలమూత్రాలను చేతులతో ఎత్తివేసి, మ్యాన్‌హోల్స్‌లో దిగి, సెప్టింక్ ట్యాంకుల్లో పడి భారత దేశ స్వచ్ఛత కోసం ప్రాణాలర్పిస్తున్నవారు మన చుట్టూనే ఉన్నా వారి ఉనికినే మనం గ్రహించం. చూడ లేక కాదు, చూడడానికి ఇష్టపడని ఈ పనిలో మునిగితేలుతోన్న వారి జీవితాలను గురించి రాసాను కనుకనే దీనికి ‘అన్‌సీన్’ అని పేరు పెట్టాను.

పారిశుద్ధ్య పని వారిపై కథనాలను రాయాలని ఎందుకనుకున్నారు?
నేను ఔట్‌లుక్ బ్యూరో చీఫ్‌గా ఉన్నప్పుడు ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ అసోసియేషన్‌కి చెందిన శ్రీలతా స్వామినాథన్ మానవ మలమూత్రాలను ఎత్తివేసే ఓ అనాగరిక కుల వ్యవస్థను గురించి నాకు తొలిసారి తెలియజేశారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాలోని ఆ దుర్మార్గమైన సంఘటన నన్ను కలచివేసింది. అది రాయడానికి వెళ్ళిన నేను పాకీ పనిపేరుతో కొనసాగుతోన్న దుర్మార్గమైన కుల వ్యవస్థ మూలాలను తెలుసుకోగలిగాను. దొడ్లల్లో డ్రైలెట్రిన్స్‌ని తమ చేతులతో శుభ్రంచేసేవారికి ఇళ్లలోనికి ప్రవేశం నిషేధం. ఆ ఇంటి దొడ్డి తప్ప ఆ పరిసరాల్లో కూడా వారు సంచరించడానికి అనర్హులు. పొరపాటున వారు అక్కడికి వస్తే ఆ ప్రాంతమంతా పసుపునీళ్ళు చల్లుతారు. ‘‘నిండు గర్భిణీగా ఉన్న నేను జారిపడిపోయి లేవలేకపోతే పక్కనున్న కర్ర ని నావైపు నెట్టారు తప్ప నన్ను ముట్టుకునేందుకు సాహసించలేదు. వాళ్ళ అశుద్ధాన్నంతా మేం మా చేతుల్తో ఎత్తివేసి మేం అపవిత్రమైపోయామన్నమాట’’ ఓ స్త్రీ అనుభవం ఇది. అందుకే ఇంటివెనుకవైపు వీధి తలుపులెప్పుడూ వీరికోసం తెరిచే ఉంటాయి. అశుద్ధాన్ని ఎత్తివేసిన తరువాత వారు మోకరిల్లితే పెద్దమనుషులు జాలిపడి వారి వీపులపైన రొట్టెలు విసురుతారు. వారు చేసిన అమానవీయ పనికి డబ్బులకి బదులు దక్కిన గౌరవ వేతనమది.

 
ఈ పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది?

నా రిపోర్టింగ్‌లో భాగంగా ‘సఫాయి కర్మచారీ ఆందోళన్’ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న మానవతామూర్తి ఎస్‌ఆర్ శంకరన్‌గారిని కలిసాను. బెజవాడ విల్సన్ వీరి కోసమే పని చేస్తున్నారనీ అతనిని కలవమని చెప్పారు. అతనితో మాట్లాడకుండా ఈ వ్యాసాన్ని పూర్తిచేయొద్దని కూడా చెప్పారు. అతనితో మాట్లాడాకనే వ్యాసం పూర్తి చేశాను. ఈ వ్యాసం ఔట్‌లుక్‌లో ప్రముఖంగా ప్రచురించారు. దీనికి అత్యంత ఆదరణ లభించింది. ప్రముఖులెందరో ఔట్‌లుక్ కార్యాలయానికి లేఖలు రాసారు. అభినందించారు. అప్పుడే నాకు రామనాథ్ గోయెంకా అవార్డు వచ్చింది. ఎస్‌ఆర్ శంకరన్ గారు నా వ్యాసాన్ని చదివి, పుస్తకంగా తేవాలని సూచించారు. అదే ప్రేరణతో నేను రాయడం కొనసాగించాను. దాని ఫలితమే ఈ పుస్తకం ‘అన్‌సీన్’. దాన్నే రచయిత్రి సజయ అశుద్ధ భారత్‌గా తెలుగులోనికి అనువదించారు.

 పాకీ పనివారితో ప్రయాణం మీపైన ఎటువంటి ప్రభావాన్ని చూపింది?
మానవ విసర్జితాల్లోనే జీవితాలను వెళ్ళబుచ్చుతోన్న వారి కన్నీళ్ళుతెప్పించే కథలు జర్నలిస్టుగా నా బాధ్యత కంటే ఓ మనిషిగా నా కర్తవ్యాన్ని నాకు గుర్తుచేశాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన పాకీపనివారనుభవిస్తోన్న అంటరానితనాన్ని నేను స్పష్టంగా అర్థం చేసుకున్న తరువాతే నేను డీక్యాస్టిఫై కావడం మొదలయ్యింది. కానీ నాతోటి జర్నలిస్టులు, మిత్రులు కూడా నేను చేస్తున్న పనిని హర్షించలేకపోయారు. ఎప్పుడూ పాకీ పనివారిని గురించి తప్ప నువ్వింకేమీ రాయవా అని వేళాకోళం చేసేవారు. నాకు పాకీ రిపోర్టర్ అనే బిరుదుని కూడా ఇచ్చారు. 

 
వీరు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు?

డ్రైలెట్రిన్స్‌ని శుభ్రం చేసీ, చేసీ వేళ్ళు పాచిపోయి, వంకర్లుపోయిన వారు కొందరైతే, వళ్ళంతా పుళ్ళయి, ఇన్‌ఫెక్షన్స్‌తో బతుకుభారమైన వాళ్ళు మరికొందరు. ఇందులో పనిచేస్తున్నవారిలో 96 శాతం మంది స్త్రీలే. ఇన్‌ఫెక్షన్స్ కారణంగా వారికి పుట్టే పిల్లలు సైతం అంగవికలురుగానూ, మానసిక వికలాంగులుగానూ పుడుతున్నారు.

 
ఈ కుటుంబాల్లోని స్త్రీలు ఏమనుకుంటున్నారు?
ఈ అమానవీయ పనికి కులమే కారణం అని నాకర్థం అయ్యింది. అందుకే ఈ పనికి యంత్రాలక్కర్లేదన్న ఈ అగ్రకుల ఆధిపత్య భావజాలం మనల్ని వెంటాడుతోంది. ఈ సమాజంలో కొందరు ఈ పనికోసమే పుడతారని నిర్దేశించారు. ఈ పని ఈశ్వరేచ్ఛ అనికూడా నిర్వచించారు. ఇదే పవిత్రకార్యమైతే అందరూ ఎందుకు చేయరు? కొన్ని కులాలే ఈ పనిని ఎందుకు చేయాల్సి వస్తోందన్నది నా ప్రశ్న? ఇందులో మగ్గిపోతున్న వారంతా ఈ అమానవీయ వ్యవస్థ అంతం కోసం పోరాడుతున్నారు. కలెక్టరు కార్యాలయాల ముందు పెంట తట్టలను తగులబెడుతున్నారు. బకెట్లను గిరాటు వేస్తున్నారు. తమజీవితాలు ధారపోసిన ఈ దుర్గంధం ఛాయలు కూడా తమ బిడ్డలకు సోకకూడదనుకుంటున్నారు.

 
బెజవాడ విల్సన్

అణగారిన వర్గాలతో కలిసి మిగిలిన సమాజం చేయి చేయి కలిపి పనిచేయాల్సిన సమయమిది. ఈ జనంతో కలిసి పనిచేసే వారికి కూడా ఈ కులం అంటుకుంటుంది. అది వారిని ఆ వర్గాల నుంచి వెలివేస్తుంది. ఈ వర్గం వారితో మమేకమయ్యేందుకు ఉపయోగపడుతుంది కూడా... అని ఇంటర్వ్యూ ముగించారు.


సఫాయికర్మచారీ ఆందోళన్‌లో కలిసి 13 ఏళ్ళపాటు ప్రయాణించిన బాషాసింగ్ కులరహితంగా మారడంలో సఫలీకృతమయ్యారు. బాషాసింగ్ మార్క్సిస్టు కుటుంబం నుంచి వచ్చారు. ఇటు తల్లి కులం, అటు తండ్రి కులం కాకుండా తను వేరే కులస్థుడిని వివాహమాడారు. ఇప్పుడు ఆమె కూతురికి ఏ కులం వర్తిస్తుందని ఆమె ప్రశ్నిస్తూ ఉంటుంది.

 సంభాషణ: అత్తలూరి అరుణ
ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement