శాంతియుత ర్యాలీపై పోలీసుల దాష్టీకం | Peaceful rally police fire | Sakshi
Sakshi News home page

శాంతియుత ర్యాలీపై పోలీసుల దాష్టీకం

Published Fri, Jul 24 2015 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

శాంతియుత ర్యాలీపై పోలీసుల దాష్టీకం - Sakshi

శాంతియుత ర్యాలీపై పోలీసుల దాష్టీకం

- అధికారపార్టీ నేతలఆదేశాలతో జంగా అరెస్ట్
- యరపతినేని అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయం
- పోలీసులపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు
- మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
సాక్షి, గుంటూరు:
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో పోలీసులు అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటూ ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా చేపట్టే ర్యాలీలపై జులుం ప్రదర్శిస్తున్నారు. అక్రమాలు బయటకు రాకుండా అధికారపార్టీ నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అధికారపార్టీ నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడటం, ఎదురుతిరిగిన వారిపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేయడం అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, రేషన్ మాఫియాలకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తూ కోట్లు గడిస్తున్నారు.

దీనిని ప్రతిఘటిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని అక్రమాలపై పోరాడేందుకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై గత రెండు రోజులుగా పోలీసులు ప్రవర్తిస్తున్నతీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంది. బుధవారం దాచేపల్లిలో యరపతినేని అక్రమాలకు నిరసనగా నల్లజెండాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన జంగాను దౌర్జన్యంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లిన సంఘటన తెల్సిందే. దీనికి నిరసనగా గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు జంగా గుంటూరుకు పాదయాత్రగా బయలుదేరారు. రాజుపాలెం మండలం, కోటనెమలిపురి గ్రామ బస్టాండు వద్దకు రాగానే పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా అక్కడ చేరుకుని జంగాను అరెస్టు చేసి రాజుపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. జంగా అరెస్టుకు నిరసనగా వైఎస్సార్ సీపీ రాజుపాలెం జడ్పీటీసీ మర్రి సుందర్రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పోలీసుస్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.

వారినిసైతం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెల్సుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మాచర్ల, బాపట్ల ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు తదితర నాయకులు రాజుపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని జంగాను పరామర్శించారు. ఈ విషయం ఇంతటితో వదిలేది లేదనీ, జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రమానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నాయకులు చెప్పారు. పోలీసులు అక్రమాలకు పాల్పడే రౌడీలు, గూండాలకు వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యయుతంగా పాదయాత్ర చేస్తున్న జంగాను అరెస్టు చేయడం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement