30 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నా పట్టదా
Published Tue, Sep 13 2016 12:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
భీమవరం టౌన్ : పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతలా రాజ్యమేలుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు ప్రైవేట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడు నియోజకవర్గాల్లోని 30 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమించినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు, పర్యావరణం ఏమైపోయినా పర్వాలేదు, పెట్టుబడిదారులు, వారి ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం దారుణమన్నారు. సోమవారం ఫ్యాక్టరీ లోపలికి లారీల్లో యంత్ర సామాగ్రిని పంపేందుకు 600 మంది పోలీసులను మోహరించి కర్ఫ్యూ వాతావరణాన్ని నెలకొల్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఆ మూడు గ్రామాల్లో ప్రతి రెండిళ్లకు ఒక పోలీసును కాపలా పెట్టి ఫ్యాక్టరీలోకి యంత్ర సామాగ్రి పంపించడం పెట్టుబడిదారులపై ముఖ్యమంత్రికి ఉన్న అభిమానాన్ని చాటుతుందని విమర్శించారు. రైతులు పొలానికి వెళతామంటే కూడా ఒక పోలీస్ వెంట వచ్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చన్నారు. మంతెన సీతారామ్, ఆర్.సత్యనారాయణరాజు, సీహెచ్ బాబూరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement