కలాల బలం ఇక కలేనా! | No one ask about Media freedom ? | Sakshi
Sakshi News home page

కలాల బలం ఇక కలేనా!

Published Wed, May 4 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

కలాల బలం ఇక కలేనా!

కలాల బలం ఇక కలేనా!

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు మీడియా స్వేచ్ఛ పట్ల ఉండాల్సిన వైఖరి ఇదేనా అని ప్రశ్నించే వాళ్లు కరువయిపోతున్నారు. మీడియాను కట్టడి చేస్తే, దాని నోరు నొక్కితే నష్టపోయేది ప్రజలూ, ప్రజాస్వామ్యం. ఇదేదో ప్రైవేటు వ్యవహారం అనుకుంటే పొరపాటు. ఒక న్యూస్ చానల్‌లో ప్రసారం అయ్యే కార్యక్రమం తమ అడుగులకు మడుగులొత్తే విధంగా లేనందుకు ఆపించే ప్రయత్నం ప్రభుత్వం చేసినా ఆ చానల్ యాజమాన్యం అందుకు గంగిరెద్దులా తలూపి కూర్చోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం.
 
 ఎమర్జెన్సీ (1975-1977) చీకటి రోజుల గురించి తెలియని వారుండరు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చను మిగిల్చిన రోజులు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి నలభై ఒక్క ఏళ్ళు పూర్తి కాబోతున్నాయి (జూన్ 25, 1975). దేశ ప్రజలందరూ ఎమర్జెన్సీ దుర్మార్గాన్ని అనుభవించారు. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా. 41 ఏళ్ల క్రితం నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పౌర, ప్రజాస్వామిక హక్కులన్నింటినీ కాలరాశారు. ఆ కాలంలో పత్రికా స్వేచ్ఛకు ఎంత తీవ్రమైన విఘాతం ఏర్పడిందో ఆ తరం వారందరికీ అనుభవమే. తరువాత తరం వారు చరిత్ర చదివి తెలుసుకునే ఉంటారు. నాడు సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన పత్రికలు ఉన్నాయి. వాటి అధిపతులు ఉన్నారు. జైలుకు వెళ్లిన పాత్రికేయులూ ఉన్నారు.
 
 వారిలో ఇద్దరిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు-  ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ పత్రికల యజమాని రామ్‌నాథ్ గోయెంకా, ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్. వ్యాపారంలో సంపాదించినదంతా కోల్పోయి ఇత్తడి చెంబుతో గుజరాత్‌కు తిరిగి అయినా వెళతాను కానీ ఇందిరాగాంధీకీ, ఆమె విధించిన ఎమర్జెన్సీకీ లొంగేది లేదని స్పష్టం చేసిన పత్రికా యజమాని గోయెంకా. ఎమర్జెన్సీని ఎదిరించి జైలుకు వెళ్లిన పాత్రికేయ దిగ్గజం కులదీప్ నయ్యర్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన గోయెంకా కట్టుబట్టలు, ఒక ఇత్తడి చెంబుతో వ్యాపారం చేయడానికి బయలుదేరి అంత ఉన్నతి సాధించారని చెపుతుంటారు. ఎమర్జెన్సీ దురాగతాలు ఎలాంటివో చెప్పడానికి గోయెంకా, కులదీప్ నయ్యర్‌ల ఉదంతాలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన రెండు ఉదాహరణలు మాత్రమే. వాళ్ల మాదిరిగానే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఎదిరించి నిలిచిన మరికొన్ని పత్రికలూ లేకపోలేదు.
 
 ఒదిగి ఉండమంటే.....
 అయితే చాలామంది పత్రికా యజమానులు, సంపాదకులు, పాత్రికేయులు బీజేపీ నాయకుడు ఎల్‌కె అడ్వానీ ఒక సందర్భంలో చెప్పినట్టు, ఎమర్జెన్సీ కాలంలో వాళ్లను ఇందిరాగాంధీ ఒదిగి ఉండమంటే సాష్టాంగ పడ్డారు(they were asked to bend but they crawled). ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు భారతదేశంలో మళ్లీ రాకూడదనే కోరుకోవాలి. 1970ల తరువాత పరిస్థితులు బాగా మారిపోయాయి. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు మళ్లీ ఎమర్జెన్సీ విధింపు వంటి ప్రయోగాలు చేసే ధైర్యం ఇప్పుడు లేదు. ఈ నలభై ఏళ్ల కాలంలో దేశంలో ప్రజాస్వామ్యం ఎన్నో ఉద్యమాల కారణంగా పరిపక్వమైంది.
 
 కాబట్టి మళ్లీ అటువంటి సాహసం ఇంకొకరు చేస్తారనుకోడానికి ఆస్కారం కూడా తక్కువే. పత్రికారంగం కూడా ఎంతో పరిణతి చెందింది. ఎన్నో విప్లవాత్మక మార్పులొచ్చాయి. టెక్నాలజీ పుణ్యమా అని ఎలక్ట్రానిక్ మీడియా ప్రవేశం తరువాత గత దశాబ్దకాలంలో మన దేశంలో కూడా మీడియాలో ఒక విస్ఫోటనం చూశాం. వ్యాపార అవసరాలూ, ప్రయోజనాలూ చేరిన తరువాత దేశంలో మీడియా స్వరూపం మారిపోయింది. రాజకీయ ప్రయోజనాలూ ఇందుకు తోడయ్యాయి. కొన్ని పెడ ధోరణులు ఉన్నా మీడియా ఇప్పటికీ సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలకు ఉన్న హక్కును తన బాధ్యతగా నిర్వర్తిస్తూనే ఉంది.
 
 ఎమర్జెన్సీ కాలం నాటి నిర్బంధాన్ని అమలు చేసే పరిస్థితి, అవకాశం లేకపోయినా మీడియా మీద భౌతికదాడులు సహా అన్ని రకాల దాడులూ జరుగుతూనే ఉన్నాయి. ఎమర్జెన్సీ తరువాత గడచిన ఈ నలభై ఏళ్ల కాలంలో ఈ దేశంలో అటువంటి సంఘటనలు ఎన్నో చూశాం. ఎమర్జెన్సీ కాలం మాదిరిగానే మీడియాను అదుపు చెయ్యాలనీ, తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనీ ఇప్పటికీ రాజకీయ నాయకత్వం, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు ఆశపడుతూనే ఉన్నారు. అడ్వానీ వ్యాఖ్యానించినట్టు ఒదిగి ఉండమంటే సాష్టాంగ పడే జాతి కూడా అక్కడక్కడా మనకు మీడియాలో తారసిల్లుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన మేరకు ప్రతి ఏటా మే నెల మూడవ తేదీ ప్రపంచమంతటా పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటాం.
 
 ఆ వేడుక నిన్ననే జరుపుకున్నాం ప్రపంచ దేశాలన్నిట్లో. మన దేశంలో కూడా పత్రికా స్వేచ్ఛ ప్రాశస్త్యాన్ని, అవసరాన్ని గురించి సభలూ సమావేశాలు నిర్వహించి మాట్లాడుకున్నాం. నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా అక్కడక్కడా వినిపించాయి. అదే రోజున, నిన్న రాజకీయ నాయకత్వం యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి తన గొంతు ఎట్లా నులిమేసిందో ఆవేదనతో చెప్పుకున్నాడు తెలుగు పాఠక ప్రపంచానికి ఒక సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు. కొద్ది సంవత్సరాలుగా ఒక టీవీ చానల్‌లో దినపత్రికల వార్తా విశ్లేషణ కార్యక్రమం కొన్నేళ్ల పాటు ఆయన నిర్వహించారు. అది కొన్ని మాసాలుగా ఆగిపోవడానికి దారితీసిన పరిస్థితులను, కారణాలను కొంత విరామం తరువాత సొంత బ్లాగ్‌లో రాసుకున్న వివరాలను ‘సాక్షి’ దినపత్రిక మే రెండో తేదీన ప్రచురించింది. 

సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాసరావుకు ఎదురయిన ఈ అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా పరిస్థితి ఏమిటో, పాలకులు మీడియా పట్ల ఎటువంటి వైఖరితో ఉన్నారో మనకు స్పష్టం చేస్తుంది. మీడియా మీద దాడి చెయ్యడానికి, ప్రతిబంధకాలు సృష్టించడానికి ఎమర్జెన్సీయే కానక్కర లేదు ఎపుడయినా అణచి పారేయ్యొచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛను ఎప్పుడయినా తమ అధికార బలంతో అడ్డుకోవచ్చు అని ఈ రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నోసార్లు రుజువు చేశారు. ప్రశ్నించేవాళ్లంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి గిట్టదు. విలేకరుల గోష్టిలో ఆయన చెప్పింది రాసుకుని రిపోర్ట్ చెయ్యాలే తప్ప వివరణ కోరుతూ ప్రశ్నలు వెయ్యకూడదు. అట్లా ప్రశ్నించే వారి మైండ్‌సెట్ మారాలంటారాయన. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం, పత్రికా ప్రపంచం రెండూ ఉండకూడదన్నది ఆయన మనోగతం.
 
 పొగడ్తలే రాయాలా?
 అమరావతి రాజధాని నిర్మాణం గురించి గొప్పగా రాయాలి తప్ప, గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఎలుకలు కరిచి శిశువు చనిపోయిందనీ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చీమలు పసిగుడ్డును పొట్టన పెట్టుకున్నాయనీ చిన్న చిన్న విషయాలు రాయకూడదంటారు ఆయన. అసలు అటువంటి సంఘటనల ప్రస్తావనే ఆయనకు ఇష్టం ఉండదు. చంద్రబాబు చేస్తున్న అమరావతి మహాయజ్ఞంలో ఇట్లాంటి సమిధలు ఎన్నో ఆహుతి కావాలన్నది ఆయన అభిప్రాయం. వేసవి ఎండలకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతుంటే మంచి నీళ్లేం ఖర్మ, మజ్జిగే సరఫరా చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రిని ఒక విలేకరి, ‘అయ్యా మజ్జిగ అందడం లేదు జనానికి!’ అంటే నువ్వేం చేస్తున్నావు, నీకు సామాజిక బాధ్యత లేదా, నీ సంఘం తరఫున నువ్వెందుకు మజ్జిగ సరఫరా చెయ్యవు? అని గద్దించి కూర్చోబెట్టేస్తారు. ప్రజలు ఎన్నుకున్నది తమనే కానీ మీడియా వారిని కాదని ఆయనకు జ్ఞాపకం ఉండదు.
 
 ప్రశ్నించేవారేరి?
 మీడియా పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీడియా నోరు నొక్కెయ్యడానికి వారు ఎంత దూరమైనా వెళ్ళగలరు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక వ్యవస్థలతో పదే పదే అక్షింతలు వేయించుకున్నా వారి వైఖరి మారదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే కొన్ని చానళ్ల ప్రసారాలు నెలల తరబడి ఆగిపోతాయి. అనుకూల మీడియాకు అంతా హాయిగా గడిచిపోతుంది. దారికి రాని మీడియానూ, అందులో పనిచేసే వారినీ కట్టడి చెయ్యడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గం ఏమిటంటే, అది కొమ్మినేని శ్రీనివాసరావు వంటి పాత్రికేయులకు ఎదురయిన అనుభవమే. అప్పుడు యాజమాన్యాలు దారికొస్తాయి.

అయినా దారికి రాని మీడియా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనే ఒక బెదిరింపు అస్త్రం ఉండనే ఉంది. అదెలా సాధ్యం అని ప్రశ్నించే వాళ్లుండరు. ప్రశ్నిస్తే ప్రభువులకు కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు మీడియా స్వేచ్ఛ పట్ల ఉండాల్సిన వైఖరి ఇదేనా అని ప్రశ్నించే వాళ్లు కరువయిపోతున్నారు. మీడియాను కట్టడి చేస్తే, దాని నోరు నొక్కితే నష్టపోయేది ప్రజలూ, ప్రజాస్వామ్యం. ఇదేదో ప్రైవేటు వ్యవహారం అనుకుంటే పొరపాటు. ఒక న్యూస్ చానల్‌లో ప్రసారం అయ్యే కార్యక్రమం తమ అడుగులకు మడుగులొత్తే విధంగా లేనందుకు ఆపించే ప్రయత్నం ప్రభుత్వం చేసినా ఆ చానల్ యాజమాన్యం అందుకు గంగిరెద్దులా తలూపి కూర్చోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం.
 
 ఇందిరాగాంధీ వంటి ప్రసిద్ధ నాయకురాలిని ఎదిరించి నిలిచిన రామ్‌నాథ్ గోయెంకాను ఇటువంటి యాజమాన్యాలు ఆదర్శంగా తీసుకోలేక పోవచ్చు. కానీ,  మరీ అడ్వానీ చెిఓప్పన నేల మీద పాకే జాతిలో చేరిపోవడం మాత్రం శోచనీయం. ప్రభుత్వాల ఈ మీడియా వ్యతిరేక వైఖరిని ఎదిరించి యాజమాన్యాలు నిటారుగా నిలబడనంత కాలం శ్రీనివాసరావు వంటి పాత్రికేయులు బలికాక తప్పదు.
 - దేవులపల్లి అమర్
 datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement