నిప్పు కాలుతుంది, అయినా నిప్పు లేనిదే రోజు గడవదు. కాలకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే నిప్పును వాడుకోవాలి. అధికారం కూడా అంతే; అధికారం చెడగొడుతుందనీ, సంపూర్ణ అధికారం సంపూర్ణంగా చెడగొడుతుందనీ ఒక ఆంగ్ల మేధావి సెలవిచ్చాడు. లోకవ్యవహారం సజావుగా సాగాలంటే అందుకు అవసరమైన అధికారాన్ని ఒక వ్యక్తి చేతిలోనో, వ్యవస్థ చేతిలోనో పెట్టక తప్పదు.
మళ్ళీ అది చెడుదారి పట్టకుండా అవసరమైనప్పుడు కళ్లేలు బిగించకా తప్పదు. ఒక తెగకు లేదా ఒక ప్రాంతానికి చెందిన జనం సమష్టి ప్రయోజనాల కోసం ఎప్పుడైతే గుంపు కట్టారో అప్పుడే అధికార– నియంత్రణల రెండింటి అవసరాన్నీ గుర్తించారు. ఆ క్రమంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక కోణంలో చూస్తే మానవచరిత్ర అంతా అధికారమూ, దాని నియంత్రణల మధ్య ఎడతెగని పెనుగులాటే!
ఈ పెనుగులాట రూపురేఖలు మన పురాణ ఇతిహాసాలలోనూ కనిపిస్తాయి. దశరథుడు అవడానికి రాజే కానీ పెద్దకొడుకైన రాముడికి పట్టాభిషేకం చేసే స్వతంత్రాధికారం మాత్రం ఆయనకు లేదు. పౌరజానపద పరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. ఆ పౌర జానపదులలో తరుజనులు, గిరిజనులూ కూడా ఉన్నారని రామాయణం చెబుతోంది. దశరథుడికి పౌరజానపదుల ఆమోదం సునాయాసంగా లభించింది కానీ; మహాభారత ప్రసిద్ధుడైన యయాతికి మాత్రం అంత సులువుగా లభించలేదు.
తన చిన్న కొడుకైన పూరునికి రాజ్యం అప్పగించాలన్న తన ప్రతిపాదనను అతడు పౌరజానపదుల ముందు ఉంచినప్పుడు, పెద్దకొడుకైన యదువు ఉండగా చిన్నకొడుకును ఎలా రాజును చేస్తావని వారు ప్రశ్నించారు. యయాతి వారిని ఎలాగో ఒప్పించి తన నిర్ణయాన్ని అమలు చేశాడు. ప్రజామోదంతో రాజైన వ్యక్తి ఆ తర్వాత సర్వస్వతంత్రుడై విర్రవీగినప్పుడు అతణ్ణి తొలగించిన ఉదాహరణలూ ఉన్నాయి. మహాభారతంలోని పురూరవుడు, నహుషుడు ఆ కోవలోకి వస్తారు.
రాజు ధర్మతత్పరతను ఉగ్గడించే కథలు; ధర్మం తప్పిన రాజూ, అతని రాజ్యమూ కూడా భస్మీపటలమైన కథలూ చరిత్రకాలంలోనూ కనిపిస్తాయి. బెజవాడ రాజధానిగా ఏలిన విష్ణుకుండిన రాజు మాధవవర్మ, తన కొడుకు ప్రయాణించే రథం కింద పడి ఒక పౌరుడు మరణించినప్పుడు కొడుకని చూడకుండా మరణశిక్ష అమలు చేస్తాడు. ‘శిలప్పదికారం’ అనే ప్రసిద్ధ తమిళ కావ్యంలో నాయిక కణ్ణగి తన భర్త కోవలన్ కు పాండ్యరాజు ఒకడు అన్యాయంగా మరణశిక్ష అమలు చేసినప్పుడు ఆగ్రహించి అతని రాజ్యాన్ని బూడిదకుప్ప కమ్మని శపిస్తుంది. శిక్షించే అధికారంతో పాటు తప్పొప్పులను నిర్ణయించే అధికారాన్ని కూడా రాజు గుప్పిట పెట్టుకున్న దశను ఈ కథ సూచిస్తుంది.
రాజూ, రాజ్యాధికారమూ, ధర్మబద్ధత, దండనీతి గురించిన భావనలు ఏ ఒక్క దేశానికో పరిమితమైనవి కావు; సార్వత్రికమైనవీ, అత్యంత ప్రాచీనమైనవీ కూడా! ఆధునిక భాషాశాస్త్ర నిర్ధారణలనే ప్రామాణికంగా తీసుకుంటే, ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలరూపమైన ‘రెగ్’ అనే మాటే సంస్కృతంలో రాజశబ్దంగానూ, ఇతర ఇండో–యూరోపియన్ భాషల్లో దానికి దగ్గరగా ధ్వనించే ‘రెక్స్’ (లాటిన్) వంటి శబ్దాలుగానూ మారింది. ‘సరళరేఖలా తిన్నగా నడిచేది, నడిపించే’ దనే అర్థం కలిగిన ‘రెగ్’ అనే మాట నుంచే నేటి రెగ్యులేషన్, రెగ్యులర్, రైట్, రీజన్, రెజీమ్ మొదలైన మాటలు వచ్చాయని భాషావేత్తలు అంటారు. రాజశబ్దం ఎంత ప్రాచీనమో, కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న రాజదండం కూడా అంతే ప్రాచీనమూ, సార్వత్రికమూ కూడా!
మన పురాణ, ఇతిహాసాలలో రాచరికానికీ, రాజుల నియామకానికీ ఇంద్రుడు బాధ్యుడిగా కనిపిస్తాడు. చేది దేశాన్ని పాలించే వసురాజు విరక్తుడై అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఇంద్రుడు అతణ్ణి తిరిగి రాజ్యపాలనకు ప్రోత్సహించి ఇతర రాజోచిత పురస్కారాలతోపాటు, ఒక రాజదండాన్నీ చేతికిచ్చాడని మహాభారతం చెబుతోంది.
ఇలాగే ఇంద్రుడు రాజ్యపాలనకు ప్రోత్సహించిన మరో రాజు – మాంధాత. ధర్మరక్షణను రాజుకు నిత్యం గుర్తు చేస్తూ ఉంటుంది కనుక రాజదండాన్ని ధర్మదండంగా కూడా అన్వయించారు. పట్టాభిషేక సమయంలో రాజుకీ, గురువుకీ మధ్య నడిచే ఒక సంభాషణ ప్రకారం, ‘నన్ను ఎవరూ శిక్షించలే’రని రాజు అంటాడు; అప్పుడు, ‘ధర్మం నిన్ను శిక్షిస్తుంది’ అంటూ గురువు మూడుసార్లు ధర్మదండంతో అతని శిరసు మీద కొడతాడు.
ఈ రాజదండం ఆనవాయితీ రోమన్లకూ సంక్రమించింది. వారిలో మొదట్లో వ్యక్తికేంద్రిత పాలన కాక, పౌరకేంద్రిత పాలన– అంటే గణతంత్ర వ్యవస్థ ఉండేది. రాచరికాన్నీ, రాజు అనే మాటనూ కూడా వారు ఏవగించుకునేవారు. ఒక దశలో రోమ్ సైనిక నియంతగా ఉన్న జూలియస్ సీజర్ ఈజిప్టు రాణి క్లియోపాత్రా ప్రేమలో పడిన తర్వాత, అక్కడున్న వ్యవస్థ ప్రభావంతో సింహాసనాన్నీ, రాజదండాన్నీ స్వీకరించాడు. అదే చివరికి అతని హత్యకు దారితీసింది.
అధికారమంతా రాజు దగ్గరే పోగుబడే ప్రమాదం తలెత్తినప్పుడు అతణ్ణి అదుపు చేసే సంకేత పాత్రను రాజదండం నిర్వహించి ఉండవచ్చు. ఆధునిక ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ ద్వారా ఆ ప్రమాదాన్ని అరికట్టేందుకు ఆయా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఏ వ్యవస్థ ఏ హద్దుల్లో ఉండాలో చెప్పే రాజ్యాంగమూ వచ్చింది. అదే నేటి అసలు సిసలు రాజదండం!
రాజదండం – రాజ్యాంగ దండం
Published Mon, May 29 2023 12:11 AM | Last Updated on Mon, May 29 2023 12:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment