మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ (ఫైల్ ఫొటో)
సాక్షి, విశాఖపట్నం : నోట్లకు ఓటు వేయడం అంటే అవినీతికి లైసెన్స్ ఇవ్వడమేనంటూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని చూస్తే గుండే ఆగిపోయే పరిస్థితి నెలకొందని, ఈ ప్రభావం వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై కూడా పడే అవకాశం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ తమ సిద్ధాంతాలు, ప్రజల పట్ల అంకితభావం గల వారిని కాకుండా కేవలం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే వారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నాయంటూ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే బయోడేటా కాకుండా బాలన్స్ షీట్ చూపించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలా ఓటుకు కోసం నోట్లు పంపిణీ చేసే నేతలు నిజాయితీగా పనిచేస్తారని ఆశించడం ప్రజల పొరపాటే అవుతుందని.. అందుకే ‘మార్పు అనేది ప్రజల నుంచే ప్రారంభం కావాలని, అధికార పార్టీలు మారితే ప్రయోజనం ఉండబోదు’ అన్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మాటలను రామకృష్ణ ఉటంకించారు.
రాజకీయ వ్యభిచారం జరుగుతోంది...
తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లభించడం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్న రామకృష్ణ.. ‘వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసమే 2 వేల కోట్ల రూపాయలను ఇక్కడున్న రాజకీయ నాయకులు రహస్య స్థావరాలకు తరలించారని’ ఒక కేంద్రమంత్రి స్వయంగా చెప్పారంటే రాజకీయ వ్యభిచారం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. డబ్బు సంపాదించడం కోసం అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు ఎంతటి ద్రోహులో.. నోట్లు తీసుకుని ఓటు వేసే ప్రజలు సైతం అంతటి ద్రోహులేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అవినీతి పెరుగుతూనే ఉంది..
ఒక సర్వేలో భాగంగా.. గత నాలుగేళ్లలో అవినీతి పెరిగినట్లు 65 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని రామకృష్ణ తెలిపారు. ఏసీబీ అధికారులు చిన్న చిన్న ఉద్యోగులపై కేసులు నమోదు చేస్తున్నారే గానీ.. భారీ అవినీతి తిమింగళాలను ఏమీ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడితే తప్ప గెలవలేని పరిస్థితులు ఉన్నంతకాలం అవినీతి లేని పాలన అందించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఈ రోజుల్లో అన్నింటా విజృంభిస్తున్న అవినీతికి సాధారణ ప్రజలే కారణమని పేర్కొన్నారు.
విద్యార్థి నాయకులే రాజకీయాల్లోకి..
గతంలో విద్యార్థి నాయకులుగా ఉన్నవారే తదుపరి రాజకీయాల్లో మేటి నాయకులుగా ఎదిగేవారని రామకృష్ణ అన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, సీఎం కేసీఆర్ వంటి వారు ఆవిధంగానే రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. ధన రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజలు పోరాటం చేయలేని పక్షంలో పారిశ్రామిక వేత్తలే రాజకీయ పార్టీలను సొంతం చేసుకునే ప్రమాదం ఉందని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసేవకు కాకుండా అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా రాజకీయాలను భావించడం దురదృష్టకరమైన విషయమని రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment