
ముంబై: ప్రజాస్వామ్యం, పాలకుల వ్యవహార తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యతిరేకించే వారి మాటను పాలకుడు వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్షగా పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి, దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటాడని చెప్పారు. రచయితలు, మేధావులు, కవులు నిర్భయంగా తమ భావాలను వ్యక్తీకరించాలని తెలిపారు.
పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్ష ఏంటంటే.. ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని అందించినా దాన్ని పాలకుడు సహించవలసి ఉంటుందన్నారు. ఆ ఆలోచనలను పరిగణలోకి తీసుకొని నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
దేశంలో విమర్శకుల అభిప్రాయ బేధాల్లో సమస్య లేదు కానీ.. అభిప్రాయాలను వెల్లడించడంలోనే సమస్య ఉంది. మనం రైటిస్టులు, లెఫ్టిస్టులం కాదు. మనం అవకాశవాదులం. రచయితలు, మేధావులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరుతున్నాం. ఒకరి లోపాలను గుర్తించేందుకు ఎప్పుడూ విమర్శకులు చుట్టుముట్టాల్సిన అవసరం ఉంది. అంటరానితనం, సామాజిక న్యూనత భావం, ఆధిపత్యం కొనసాగినంత కాలం దేశం అభివృద్ధి చెందదని అన్నారు.