న్యూఢిల్లీ/జమ్మూ: ప్రజాస్వామ్యం గురించి కొందరు వ్యక్తులు తనకు నిత్యం పాఠాలు చెబుతున్నారని, వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడం, ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం దేశానికి గర్వించే క్షణమని చెప్పారు. ఆయన శనివారం జమ్మూకశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఇక్కడ మూడంచెల పంచాయతీ వ్యవస్థ పూర్తిరూపం సంతరించుకుందని మోదీ తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోందని అన్నారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన కొద్ది కాలంలోనే పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం(కాంగ్రెస్) స్థానిక ఎన్నికలు ఇంకా నిర్వహించలేదని ఆక్షేపించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..
ప్రజాస్వామ్యంపై వారికున్న గౌరవం ఇదేనా?
‘‘ఢిల్లీలో కూర్చున్న కొందరు వ్యక్తులు నన్ను నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు. అభ్యంతరకర పదజాలం వాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి నాకు రోజూ పాఠాలు చెబుతున్నారు. వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతా. ప్రజాస్వామ్యం గురించి నాకు బోధిస్తున్న పార్టీ పుదుచ్చేరిలో అధికారంలో ఉంది. ఆ పార్టీ అక్కడ స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. పుదుచ్చేరిలో చివరిసారిగా 2006లో స్థానిక ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం 2011లోనే ముగిసింది. అయినా ఎన్నికలే జరపడం లేదు. అంటే వారు చెప్పేదానికి, చేసేదానికి ఏమాత్రం పొంతన లేదని దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. ప్రజాస్వామ్యం పట్ల వారికున్న గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
కొత్త నాయకత్వానికి శ్రీకారం
జమ్మూకశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. ప్రతికూల వాతావరణం, కరోనా భయం ఉన్నప్పటికీ ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటేశారు. నాకెంతో గర్వంగా ఉంది. దేశానికి ఇదొక గర్వించే క్షణం. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం, భద్రతా సిబ్బంది అహోరాత్రులు శ్రమించారు. ప్రజల కోసం పని చేసినవారు ఎన్నికల్లో గెలిచారు. కొత్త దశాబ్దంలో కొత్త నాయకత్వానికి ఇది శ్రీకారం. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో ప్రజలు వారి హక్కులను వారు పొందారు. పాత చరిత్రను వెనక్కి నెట్టేసి, కొత్త భవిష్యత్తు కోసం ఓటేశారు.’’
‘ఫెరాన్’ ధరించిన మోదీ
జమ్మూకశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కశ్మీరీ సంప్రదాయ ఫెరాన్ వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలను గత ఏడాది కశ్మీర్ వ్యవసాయ కూలీ ఒకరు మోదీకి బహూకరించారు. కశ్మీర్ పర్యటనలో ఈ వస్త్రాలు ధరించాలని మోదీ భావించినప్పటికీ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా అది సాధ్యం కాలేదు.
ఇది చరిత్రాత్మక దినం
‘‘ఆయుష్మాన్ భారత్ పథకంతో జమ్మూకశ్మీర్‌లో ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాకు అర్హులవుతారు. ఈ ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం. జమ్మూకశ్మీర్ సమగ్ర అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన నేతలు సరిహద్దు రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించారు. ఆ తప్పిదాన్ని మేము సరిచేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జమ్మూకశ్మీర్‌లో 12 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
మోదీ పాలనలో జమ్మూకశ్మీర్‌లో శాంతి: అమిత్ షా
ప్రధానమంత్రి మోదీ ఆరేళ్ల పాలనాకాలం జమ్మూకశ్మీర్‌లో చరిత్రలో 1990 తర్వాత అత్యంత శాంతియుతమైన కాలంగా గుర్తుండిపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభోత్సవం లో ఆయన ప్రధాని మోదీతోపాటు గువాహటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ ప్రజలతో నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం, ప్రేమ ఉన్నాయని తెలిపారు.
ఆయనను తాను ఎప్పుడు కలిసినా జమ్మూకశ్మీర్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి, ప్రజల బాగోగులు, శాంతి భద్రతల గురించి కచ్చితంగా ప్రస్తావిస్తుంటారని గుర్తుచేశారు. 2019 ఆగస్టు 5 తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రతిరంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. శాంతి లేకుంటే అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. యువత కలలు నిజం కావాలంటే శాంతి చాలా ముఖ్యమని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన అన్ని హామీలను ప్రధాని మోదీ తప్పనిసరిగా నెరవేరుస్తారని ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment