ఎల్లప్పుడూ నన్ను అవమానించేలా: ప్రధాని మోదీ | PM Modi Slams Rahul Gandhi Some In Delhi Try To Teach Democracy | Sakshi
Sakshi News home page

వారికి నా శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

Published Sat, Dec 26 2020 3:48 PM | Last Updated on Sat, Dec 26 2020 4:35 PM

PM Modi Slams Rahul Gandhi Some In Delhi Try To Teach Democracy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రెండు నాల్కల ధోరణి కలిగిన కొంతమంది వ్యక్తులు తనకు ప్రజాస్వామ్యం గురించి హితబోధ చేయాలని ఆరాటపడుతున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి విమర్శలు చేశారు. అలాంటి వారు జమ్మూ కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి మండళ్ల(డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌) ఎన్నికలు జరిగిన తీరును ఓసారి పరిశీలించాలని చురకలు అంటించారు. ప్రజాస్వామ్య దేశంలోనే ఇలాంటివి జరుగుతాయని పేర్కొన్నారు. కాగా మోదీ సర్కారును విమర్శించే క్రమంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్యం లేదంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వారి స్థానంలో ఉన్నా ఆయనను కూడా టెర్రరిస్టుగానే అభివర్ణిస్తారంటూ ధ్వజమెత్తారు. (చదవండి: రాష్ట్రాన్ని నాశనం చేశారు: ప్రధాని మోదీ)

ఇక రాహుల్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. జమ్మూకశ్మీర్‌ వాసులకు ఆరోగ్య బీమా వర్తింప జేసే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘‘ ఢిల్లీలోని కొంతమంది నాయకులు ఎల్లప్పుడూ నన్ను అవమానించేలా మాట్లాడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్లకు డీడీసీ ఎన్నికలు నిర్వహించిన తీరు ప్రజాస్వామ్యానికి చక్కని ఉదాహరణగా నేను చూపిస్తాను. నిజానికి ఆ వ్యక్తులు, వారి పార్టీలు డెమొక్రసీ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పుదుచ్చేరిలో వారి పార్టీ ఎన్నికలు నిర్వహించదు. కానీ జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన ఏడాది కాలంలోనే పంచాయతీ స్థాయి ఎన్నికల నిర్వహణ సాఫీగా సాగింది. ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది. 

ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌ వాసులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువతతో పాటు వృద్ధులు కూడా భారీ ఎత్తున పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది హర్షిందగ్గ విషయం’’ అని ప్రధాని మెదీ పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్‌ స్థానిక ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్‌ కూటమి 13 జిల్లాల్లో ఆధిపత్యం కనబరచగా.. బీజేపీ ఆరు జిల్లాల్లో సత్తా చాటింది. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కమలనాథులు కశ్మీర్‌ లోయలో కమలం విరబూసిందంటూ హర్షం వ్యక్తం చేయగా.. అధికారం మాత్రం తమదేనంటూ కూటమి నేతలు వ్యాఖ్యానించారు. కాగా గుప్కార్‌ కూటమిలో జ‌మ్ముక‌శ్మీర్‌లో ప్ర‌ధాన పార్టీలైన‌ ఎన్సీ‌, పీడీపీ తోపాటు సీపీఐ-ఎం, పీపుల్స్ కాన్ఫ‌రెన్స్‌, ఆవామీ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌, సీపీఐ, పీపుల్స్ మూవ్‌మెంట్ తదితర పార్టీలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement