ప్రభుత్వాలు రాజద్రోహం పేరిట అణచివేసే చర్యలతో లా కమిషన్ తన సమాలోచనా పత్రంలో విభేదిస్తూ ‘‘ప్రజలకు విమర్శించే హక్కు ఉందని పాలకులు గ్రహించాలి. రాజద్రోహం అనే అభియోగంతో దేశపౌరులతో ప్రభుత్వం చెలగాటమాడాలనుకుంటోంది’’ అని హెచ్చరించింది. భారతదేశంలో కాలం చెల్లిన రాజద్రోహం అభియోగం పెట్టడం సరికాదని తేల్చిచెప్పింది. తన దేశ చరిత్రను తానే విమర్శించడం లేదా వ్యతిరేకించడం భావప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమని గుర్తించాలని లా కమిషన్ సమా లోచనా పత్రం స్పష్టం చేసింది. అంతేగాని, ప్రభుత్వాల తాత్కాలిక విధానాలను వ్యతిరేకించే భావాలను రాజద్రోహ నేరంగా పరిగణించడానికి వీల్లేదని తెలిపింది.
భిన్నాభిప్రాయ స్వేచ్ఛ లేకుండా దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టలేదు. ప్రజా స్వామ్య రక్షణకు భిన్నాభిప్రాయ వ్యక్తీకరణే సరైన నియంత్రణ శక్తి. ఆ శక్తినే అడ్డుకుంటే ప్రజాస్వామ్యమే ఆ ఒత్తిడిలో బదాబదలై పోతుంది. సామాజిక ఆందోళనకారులను, కార్యకర్తలను పెద్ద పెట్టున అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. సుప్రీంకోర్టు ధర్మాసనం (న్యాయమూర్తులు దీపక్‌మిశ్రా, డీవై చంద్రచూడ్, ఏఎం.ఖాన్విల్కర్, 30–8–2018)
ఇటీవల దేశంలో ప్రభుత్వ స్థాయిలో సామాజిక, రాజకీయ దౌర్జన్య కాండపై నిరంతరం బలంగా గొంతువిప్పే ప్రముఖులపై దాడులు పెరిగి పోతున్నాయి. ప్రజాతంత్ర పద్ధతుల్లోనే ఉద్యమాలు సాగుతున్నా ఆందో ళనకారులను సహించలేని ప్రభుత్వాలు వారిపై నిర్బంధాన్ని అమలు జరపడానికి సాహసిస్తున్నాయి. ఆకస్మిక అరెస్టుకు గురైన ఐదుగురు ప్రముఖుల తరఫున దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రసిద్ధ చరిత్ర కారులు రొమీలా థాపర్, ప్రభాత్ పట్నాయక్‌తో పాటు సతీష్ దేశ్ పాండే, దేవకీ జైన్, మాజా దారూవాలా వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బెంచీ పై వ్యాఖ్య చేసింది. బహుశా, అందుకనే ప్రభుత్వం పోలీసులతో చేయించిన మూకుమ్మడి అరెస్టులుగా త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానిం చాల్సి వచ్చింది.
కనుకనే డీవై చంద్రచూడ్ ప్రభుత్వ చర్యను భిన్నాభిప్రా యాన్ని అణచివేయడంగా అభివర్ణించారు. ఇంతకుముందు పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి పాల్పడినప్పుడు ప్రధానమంత్రి ‘ఇందుకు నన్ను చంపుతారని నాకు తెలుసు’ అని ఓ ప్రకటన చేసి ప్రజలను ఆశ్చర్యచకితు లను చేశారు. అలాగే, తాజా అరెస్టులకు పాలకులు వ్యాపింపచేస్తున్న కారణాలు నమ్మదగ్గవిగా లేవు. భీమాకోరెగావ్‌లో ఎల్గార్ పరిషత్ ఆధ్వ ర్యంలో దళితులు జరిపిన ఆందోళనతో ఈ అరెస్టులను ముడివేశారు. ఈ ఆందోళనకు మావోయిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులు సమ కూర్చుతున్నారని, ఈ పని ఎల్గార్ పరిషత్ సమావేశాలకన్నా ముందు నుంచే జరుగుతోందన్నది అభియోగ ప్రచారం. ఇంకా, నిర్బంధంలోకి తీసుకున్న కార్యకర్తలకూ, మావోయిస్టులకు మధ్య నడిచిన ఉత్తరాల్లో ఒక దాన్లో ‘‘మోదీ పాలన అంతమొందించడానికి రాజీవ్ హత్య తర హాలో పథకం గురించిన ప్రస్తావన ఉందని కూడా ఆరోపించారు.
అప్రకటిత ఆత్యయిక పరిస్థితి!
దేశంలో బీజేపీ ‘గ్రాఫ్ పడిపోతోందని’ మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా గుర్తుచేస్తూ, ‘‘1975లో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీని మించిపోయేలా మోదీ పాలన సాగుతోంది. అప్రకటిత ఆత్యయిక స్థితిని సర్కారు కొనసాగిస్తోంది’ అని అన్నారు. ఇదే మాటలను బీజేపీ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శౌరీ, శత్రుఘన్‌సిన్హా పదేపదే చెబుతున్నారు. అలాగే, రిటైర్డ్ జడ్జీలు పీబీ సావంత్ (సుప్రీంకోర్టు), బీసీ కోల్సేపాటిల్ (బొంబాయి హైకోర్టు) ఈ అరెస్టులపై తీవ్ర నిరసన తెలి పారు. భీమాకోరెగావ్ ఆందోళనతో సంబంధం ఉందనే కారణంతో ప్రభుత్వం అరెస్టు చేసిన ఐదుగురికి ఎల్గార్ పరిషత్‌తో ఎలాంటి సంబంధాలు లేవని జస్టిస్ సావంత్ చెప్పారు. ఎల్గార్ పరిషత్ సమా వేశం జరపడానికి తనకూ, జస్టిస్ కోల్సేపాటిల్‌కు మాత్రమే సంబంధం ఉందనీ, అరెస్టు చేసిన ఐదుగురితో తమకు ఎలాంటి ఫోన్ సంబంధాలు గాని, ఇతరత్రా వ్యవహారాలుగాని లేవని సావంత్ ప్రసిద్ధ ఇంగ్లిష్ దిన పత్రిక ‘హిందూ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అంతేగాక, చట్టవ్యతి రేక కార్యకలాపాల నిరోధక చట్టం పేరుతో ఈ అరెస్టులు చేయడానికి రుజువుగా మారిన ఆ అజ్ఞాత లేఖను సైతం సర్కారు వెల్లడించలేక పోయింది. ప్రధాని మోదీ హత్య విషయం ప్రస్తావించారం టున్న లేఖను పూర్తిగా వెల్లడించలేకపోవడం పాలనా నిర్వహణలోని ప్రజా వ్యతిరేక కార్యకలాపంగానే జనం భావిస్తారు. ఈ తప్పుడు చట్టం ధనికవర్గ ప్రయోజనాల కోసం, వారి కొమ్ముకాసే పాల కుల అవసరాల కోసం తరచుగా అమలు జరుగుతోంది. ఈ బ్రహ్మస త్యాన్ని చివరికి లా కమిషన్ కూడా ఇటీవలే తూర్పారబట్టింది. తన విధా నాలు, చర్యలను విమర్శించే వారిని కొరత వేయజూసే దేశీయ ప్రభుత్వా లనూ, కేంద్రపాలకులను హెచ్చరించాల్సివచ్చింది. మానవ హక్కులు హరించ చూస్తున్న ప్రభుత్వాలు రాజద్రోహం పేరిట అణచివేసే చర్య లతో లా కమిషన్ తన సమాలోచనా పత్రంలో విభేదిస్తూ ‘‘ప్రజలకు విమర్శించే హక్కు ఉందని పాలకులు గ్రహించాలి. రాజద్రోహం అనే అభియోగంతో దేశపౌరులతో ప్రభుత్వం చెలగాటమాడాలనుకుం టోంది’’ అని హెచ్చరించింది.
బ్రిటన్‌లో రాజద్రోహం సెక్షన్ లేదు!
రాజద్రోహం అభియోగం మోపడానికి అవకాశమిచ్చే ఐపీసీ సెక్షన్ 124 –ఏను తిరగదోడాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలని కూడా లా కమిషన్ సూచించింది. ఈ రాజద్రోహం అభియోగానికి దోహదం చేసే సెక్షన్‌ను రూపొందించిన వలసపాలకులైన బ్రిటిష్‌వారే తమ దేశంలో దీన్ని చట్టం నుంచి తొలగించారని గుర్తుచేసింది. ఈ అభియోగం మోప డం సరికాదని బ్రిటిష్ సర్కారు భావించిన ఫలితంగా పదేళ్ల క్రితమే ఈ సెక్షన్‌ను రద్దుచేశారు. బహుశా బ్రిటిష్ ప్రభుత్వానికున్న ఇంతటి విచ క్షణా జ్ఞానం అభినవ భారత పాలక వ్యవస్థలకు లేదు. రాజకీయ ప్రత్య ర్థులపైనా, ప్రతిపక్షాలపైనా ఈ అభియోగం మోపి రాజకీయ లబ్ధిపొంద డానికి ఐపీసీ సెక్షన్–124 ఏను పదునైన ఆయుధంగా వాడుకుంటు న్నారు. ఇలాంటి నిరంకుశ చట్టాలకు ఉదాహరణగా తమ దేశం పేరు పేర్కొనవద్దని బ్రిటిష్‌వారు కోరుతున్నారని మన లా కమిషన్ డాక్యు మెంటు తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్నందున రాజద్రోహం అన్న పదాన్ని సమూలంగా నిర్వ చించుకోవాలని కమిషన్ కోరింది.
ఎందుకంటే, భావప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా పరిగణిస్తున్నాం కాబట్టి. కేవలం ప్రభుత్వాన్ని ఆచ రణలో హింసామార్గం ద్వారా కూల్చే సందర్భంలో మాత్రమే రాజ ద్రోహం అభియోగం చెల్లుబడి అవుతుందని కమిషన్ వివరించింది. అంతేగాని, తన దేశ చరిత్రను తానే విమర్శించడంగాని లేదా వ్యతిరే కించడం గాని భావప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమని గుర్తించాలని లా కమిషన్ సమాలోచనా పత్రం స్పష్టం చేసింది. అంతేగాని, ఎప్పటి కప్పుడు దేశంలో ఏర్పడే ప్రభుత్వాల తాత్కాలిక విధానాలను వ్యతి రేకించే భావాలను రాజద్రోహ నేరంగా పరిగణించడానికి వీల్లేదని లా కమిషన్ తెలిపింది. ఈ సందర్భంగా కొన్ని మాసాల క్రితం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిసంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌పై మోపిన రాజద్రోహ నేరాన్ని కమిషన్ ఉదాహరణగా పేర్కొంది. జాతీయ ఐక్యత లేదా సమగ్రతా పరిరక్షణ సందర్భాలకే పరి మితం కావలసిన ఈ ‘సెక్షన్124 ఏ’ను భావప్రకటనా స్వేచ్ఛను అణ గదొక్కడానికి ఉపయోగించరాదని ఆ విశిష్ట పత్రం స్పష్టం చేసింది. అంతేగాదు, చలనశీలమైన, స్పందించే శక్తిగల ప్రజాస్వామిక వ్యవస్థలో విధాన సమస్యలపై ఆరోగ్యకరమైన, పటిష్టమైన చర్చ జరగాలంటే భిన్నాభిప్రాయ ప్రకటన, విమర్శ ప్రధానం, ప్రాణసమానమని ఆ పత్రంలో ఉంది.
నీతి నియమాల గురించి, ప్రజాస్వామ్యం గురించీ ఊద రగొట్టే దేశీయ పాలకులు తమ పార్టీ, ప్రతిపక్షాల పార్లమెంటు సభ్యులు, శాససభ్యులకు వ్యతిరేకంగా నమోదైన కేసుల వివరాలను ఇవ్వడంలో, వెల్లడి చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తరచుగా ప్రశ్నిస్తోందని (31.8.2018) మరచిపోరాదు. చివరికి, ఇంత వరకూ లెజిస్లేటర్లపై క్రిమినల్ కేసులలో శిక్షలు పడిన వారందరినీ ఎన్ని కల రాజకీయాలలో శాశ్వతంగా పాల్గొనకుండా నిరోధించాలన్న బీజేపీ నాయకుడు అశ్వనీకుమార్ ఉపాధ్యాయ కోరుతూ కోర్టులో ప్రజా ప్రయో జన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయవలసి వచ్చిందని ‘లైవ్ లా’ రిపోర్టు వెల్లడించింది. అసలు, న్యాయంకోసం నిలబడి తీర్పులిస్తున్న కొందరు జడ్జీల జీవితాల్నే తుదముట్టిస్తూ లేదా పదవీ విరమణానంతర పదవులు చూపి అనుకూలంగా తీర్పులు రాబట్టుకుంటున్న రాబందులున్న వాతా వరణంలో అశ్వనీకుమార్ లాంటి బీజేపీ నాయకుల స్వరం కూడా మూగ పోతోందని గ్రహించాలి. అందుకే కాబోలు మహారాష్ట్ర కవి, ప్రసిద్ధ దళిత బహుజనుల ప్రతినిధి, సామాజిక అన్యా యాలకు గురైన ప్రొఫె సర్ వినాయక్ లష్కర్ –తులారామ్ చతుర్చంద్ కళాశాల సామాజిక శాస్త్రవేత్త హోదాలో తన గుండె బరువును ఈ కింది కవితలో తీర్చుకోవలసి వచ్చింది:
‘‘ఓ ప్రపంచమా! విను, విను –
ఏళ్లూ, పూళ్లూ గడుస్తున్నా మన అణగారిన
ప్రజల మనస్సుల్ని గుండెల్ని ఇంకా
ఇనుపకంచెలతోనే బంధించి ఉంచారు!
ఈ రోజుకీ దళిత గ్రామాలపై దేశంలో దాడులకు విరామం లేదు!
బ్రిటిష్ పాలనలో మాదిరే ఈనాడూ తమకు
న్యాయం జరగాలని గొంతెత్తలేని అవస్థ–
బహుశా పరాయివాడి మాదిరే నేటి పాలకుల నుంచీ
న్యాయాన్ని ఆశించలేని దుస్థితి వారిది!
ఇక న్యాయ వ్యవస్థ చూద్దామా దానిది కళ్లకు
గంతలు కట్టుకున్న గాంధారి పాత్రే!
దేశ స్వాతంత్య్ర పోరాటంలో మాకూ పాత్ర ఉంది
అయినా పోరాట యోధుల జాబితాలో
చివరికి– చరిత్రలో సీబీఐ కళ్లకూ మేం ఆనలేదు! మేం కనపడం!!
సీనియర్ సంపాదకులు
ఏబీకే ప్రసాద్
abkprasad2006@ahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment