వాగుడుకాయల కొలువులు
దాదాపు పన్నెండు చానళ్లు ఒకే పార్టీపైనా, ఆ పార్టీ నేతపైనా వీక్షకుల తలమొత్తేలా వ్యతిరేక ప్రచారాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల రుతువు ఆఖరి వారం రోజులలో అవి ఎంత హద్దులు మీరాయో కూడా ప్రేక్షకులు గమనించారు. అక్కసుతో కూడిన ఆ దుష్ర్పచారం అంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ నాయకుడు జగన్‌పైనే.
తుపానులు తీరం దాటేటప్పుడు భీకరమైన గాలులు, కుండపోత వర్షం తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి. అలాగే ఎన్నికల తుపాను సద్దుమణిగే ముందు రాజకీయ నేతల ప్రచార ఉద్ధృతి అవధులు దాటుతూ ఉంటుంది. వారి తరఫున పెయిడ్ న్యూస్ చానళ్లూ, ‘రాడియా’ మీడియాలూ, విశ్లేషకులూ, మానసిక విశ్లేషకులూ వారి వారి ఇష్టానిష్టాలను బట్టి వ్యాఖ్యానాలను వెలగబెడుతూ ఉంటారు. అసలు తామే బరిలో ఉన్నట్టు ఊగిపోతూ ఉంటారు. సర్వేలూ, వాటి విశ్లేషణ తీరు కూడా ఇంతే. అంతా ‘ప్రజాస్వామ్యం’ ముసుగులోనే సాగుతూ ఉంటుంది.
అందరి దృష్టీ అటే
ఎన్నికల సమయంలో కొన్ని పెద్ద రాజకీయ పక్షాలు తమకు అనుకూల సర్వేలను రాబట్టుకోవడానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయని సాక్షాత్తు ఎన్నికల కమిషన్ అంగీకరించింది. ఇలాంటి సర్వే కార్యక్రమాలు నిర్వహిస్తున్న పదమూడు సంస్థలలో ఒకటి రెండు మినహా (ఇందులో ఒకటి నీల్సన్ అండ్ ఆర్గ్) మిగిలినవన్నీ బోగస్ సర్వేలకు పాల్పడినవేనని వెల్లడయింది. వీటిలో ‘పెప్పర్ స్ప్రే’ ఉన్మాది జరిపిన సర్వే ఉన్నదో లేదో చెప్పలేం. ఎక్కువ చానళ్లూ, పత్రికలూ వ్యవ స్థానిష్టమైన విమర్శలు కాకుండా, కేవలం వ్యక్తి నిష్టమైన విమర్శలకే 90 పాళ్లు అంకితమైపోయి ఓటర్ల మధ్య విషపూరిత వాతావరణం నెలకొనడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. దాదాపు పన్నెండు చానళ్లు ఒకే పార్టీపైనా, ఆ పార్టీ నేతపైనా వీక్షకుల తలమొత్తేలా వ్యతిరేక ప్రచారాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల రుతువు ఆఖరి వారం రోజులలో అవి ఎంత హద్దులు మీరాయో కూడా ప్రేక్షకులు గమనించారు. అక్కసుతో కూడిన ఆ దుష్ర్పచారం అంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైనే.
వారంతా పులుకడిగిన ముత్యాలేనట
అడ్డదారులలో కోట్లకు పడగలెత్తిన వారు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలలో ఉన్నారు. ఈ నాయకులలో అవినీతి ఆరోపణలు సహా, రకరకాల కేసులలో ‘420’ లుగా నమోదైన వారూ మన మధ్య ఉన్నారు. ఎమ్మార్ హౌసింగ్ సొసైటీకి, ఐఎమ్‌జీకి 800 ఎకరాలు కట్టబెట్టి డబ్బు చేసుకున్న ఒకనాటి రాష్ట్రాధినేత కూడా ఇందులో ఉన్నాడు. వైద్య కళాశాలకు కేటాయించిన భూమిని గోల్ఫ్ క్రీడా సంస్థకు రహస్యంగా కుదువపెట్టి లాభించిన ప్రభుత్వాధినేత కూడా ఉన్నాడు. రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ధర్మాసనం చెప్పిన మూడు ప్రధానమైన తీర్పులలో దోషిగా నిరూపితమై కూడా అధికార పీఠాన్ని వదలక బల్లిలాగా కరుచుకుపోయివున్న పాలకుడూ ఇక్కడ ఉన్నాడు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంతో చేతులు కలిపి తెలుగు జాతి విభజనలో ‘రెండవ ఫిడేల్’గా మారిన మతతత్వ బీజేపీతో కేసుల నుంచి బయటపడడం కోసమే వియ్యమందిన వాడూ జనం మధ్యనే ఉన్నాడు.
కానీ చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒక్క జగన్ మాత్రమే జైలులో ‘శాశ్వతం’గా ఉండదగినవాడు. విడుదలకు అసలు తగడు. అతడు రాష్ట్రాధినేత అయితే రాష్ట్రాన్నే మింగేస్తాడని మానసిక విశ్లేషకుల పేరిట కొందరు కుహనా మనస్తత్వ పరిశీలకులు పదే పదే దుమారం లేపుతున్నారు. మరో విశ్వవిద్యాలయ కుహనా ఆచార్యుడు జైల్లో జగన్‌కు ఇంటర్వ్యూలే ఇవ్వకుండా చేయాలని కోర్టులను పరోక్షంగా శాసిస్తున్నాడు. వీళ్ల ధోరణి, తెర మీద కనిపించే వాళ్ల ముఖ కవళికలను పరిశీలిస్తే వీరు విశ్లేషకులు కారు, మానసిక రోగులని అనిపిస్తుంది. జగన్‌కు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ‘విజ్ఞత’నే ప్రశ్నించడానికి కూడా సాహసించాడు ఓ మానసిక విశ్లేషకుడు. ‘అన్ని కేసులు ఉన్న జగన్ విడుదలకు అనర్హుడు’ అని ఆ మానసిక విశ్లేషకుడు, తానే న్యాయమూర్తి స్థానంలో కూర్చున్నట్టు ఊహించుకుంటూ పూనకంతో ఊగిపోయాడు. నిజానికి ఇతడే మానసిక రోగి అనిపించేటట్టు చేశాడు.
పద్ధతి మేరకే బెయిలు
నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వం రూపొందించిన 26 జీవోలలో దోషం లేదనీ, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయనీ ఆయన మరణానంతరం రాష్ట్ర మంత్రిమండలి ధ్రువీకరించడం ఒక వాస్తవం. ఆ జీవోల అండతో జగన్ వ్యాపార సంస్థలు లాభించాయన్న ఫిర్యాదుకు ఎక్కడో విశ్వసనీయత లోపించబట్టే సీబీఐ కూడా సుప్రీంకోర్టు చేత చీవాట్లు తినవలసి వచ్చింది. 2-జీ, జైన్ హవాలా కుంభకోణం వంటి కొన్ని వ్యవహారాలను పరిశీలించి నిర్ధారించుకున్న తరువాతే సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యను ఆ సంస్థ డెరైక్టర్ రంజిత్ సిన్హా కూడా అంగీకరించవలసి వచ్చింది. కాబట్టే జగన్ కేసులో బెయిలు మంజూరుకు సాధికారత వచ్చిందని మరచిపోరాదు.
రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికీ, పాలకపక్షాల అడుగులకు మడుగులొత్తించేందుకూ సీబీఐ వంటి విచారణ సంస్థలను ప్రయోగిస్తున్నాయని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మీద గతంలోనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యర్థులను వేధించడానికి పాలక పక్షాలు ఏసీబీ, సీబీసీఐడీలను ఉపయోగించుకున్నాయన్నది దాచేస్తే దాగని సత్యం. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన తన ప్రజా ప్రతినిధులను రక్షించుకోవడానికి 1999లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశానికి సవరణ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిద్ధం కావడం (25-2-14) గమనించవచ్చు. అంటే క్రమంగా న్యాయవ్యవస్థ తన స్వతంత్ర ప్రతిపత్తిని పరిరక్షించుకోవడానికి ఇష్టపడుతోందని అర్థం చేసుకోవాలి.
అంతేకాదు, ఏసీబీ అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవడం కాకుం డా, కోర్టు ఆదేశాలను అనుసరించాలని కోర్టు చెప్పింది. 1999లో టీడీపీ మంత్రులూ, ఎంఎల్‌ఏలూ నడిపిన మద్యం సిండికేట్ల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం నాటి ఎన్నికలకు ముందు వారి రక్షణ కోసం దొంగచాటుగా జీవో వెలువరించడమూ, దాదాపు 80 మంది మీద ఉన్న కేసులను మాఫీ చేయడమూ చాలామందికి గుర్తుండే ఉండాలి. తప్పుం టే, చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఉంటే వాటిని విచారించి ఎవరినైనా శిక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. కానీ గురువింద గింజల మాదిరిగా తమ చట్ట వ్యతిరేక చర్యలనీ, పదవి కోసం పార్టీ వ్యవస్థాపకుడిని వెన్నుపోటు పొడవడాన్ని సమర్థించుకునే వారిని గానీ, ప్రధాని పదవి కోసం ఆశ పడుతూ ఊచకోతలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించే వారినిగానీ నమ్మరాదు. ఈ ఉభయులూ చెప్పింది చేయరు. చేసింది చెప్పరు.
గుజరాత్ నరమేధం మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘సిట్’ తరఫున ఆర్‌కే రాఘవన్ దర్యాప్తు జరిపి 2010 నాటికి నివేదిక ఇచ్చారు. అదే సుప్రీంకోర్టు ఉత్తర్వు మేరకు మరోసారి విచారణ జరిపి 2012లో అహ్మదాబాద్ మేజిస్ట్రేట్‌కు మరో నివేదిక ఇచ్చాడు. ఈ రెండింటికీ పొంతన లేదు. ఇదే అంశం మీద పనిచేసిన సుప్రీం కోర్టు ప్రత్యేక సలహాదారు రాజు రామచంద్రన్ ఈ సంగతి చెప్పారని మనోజ్ మిటా (టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ సంపాదకుడు) తను వెలువరించిన ‘నిజ నిర్ధారణ సంఘం: దాని కట్టుకథ’అనే పుస్తకంలో పేర్కొన్నారు. ‘సిట్’ మీద సుప్రీంకోర్టు పెట్టుకున్న నమ్మకానికి రాఘవన్ ద్వారా ద్రోహం జరిగిందని ఆయన వ్యాఖ్యానించాడు. 2010 నివేదిక ప్రకారం చూస్తే, మోడీ 2002, ఫిబ్రవరి 27న గోధ్రా సందర్శించినట్టు అంగీకరించాడు. అహ్మదాబాద్, గుల్బర్గా సొసైటీ, నరోదా పాటియా వంటి చోట్ల అల్లర్లు జరిగిన ప్రాంతానికి 2002, మార్చి 5న వెళ్లినట్టు చెప్పాడు. ఇక్కడ మోడీ వివక్ష సుస్పష్టం.
ఇప్పుడు మన టీవీ చానళ్లలో విశ్లేషణలు చేసే వారు ఎవరూ ఈ అంశాలను లేవనెత్తరు. మోడీ ఈనాటికీ గోధ్రా ఉదంతం మీద క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేడు. ఆయనకు సరిజోడి చంద్రబాబు. ఈ వాస్తవాలను వదిలేసి మన విశ్లేషకులు జగన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘అబద్ధాల నోటికి అర వీశెడు సున్నం’ పెట్టడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
- (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
ఏబీకే ప్రసాద్