‘‘మనపై నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. ఇంతగొప్ప బాధ్య తను మన భుజాలపై మోపడాన్ని ప్రతి ఒక్కరం గుర్తు చేసుకోవాలి. 2024 ఎన్నికల్లో ఇంతకన్నా గొప్పగా ప్రజల తీర్పు వచ్చేలా పని చేద్దాం. రాజకీయ ప్రక్షాళన ద్వారానే ఇది సాధ్యం.’’– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశంలో, కాబోయే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిశానిర్దేశం.
‘సరళత్వానికి అర్థం మెత్తగా ఉండటమని కొందరు భావిస్తారు. కానీ అన్నిచోట్లా బోళాతనంతో నేరుగా ప్రవర్తించరాదు. అవసరమైతే కౌటి ల్యంతో (నేర్పుతో) ప్రమాదం నుంచి బయటపడాలి.’’– చాణక్యనీతి
నేను చూశాను, నేను విన్నాను, మీకు అండగా నేను ఉన్నాను– దేశంలో ఎంతమంది నాయకులు ప్రజాక్షేత్రంలో తామూ ఉన్నామని చెబుతూనే రాజకీయాల్లో ఇంత దమ్ముతో.. దశాబ్దాలుగా అనేక అగచాట్లకు మౌనంగా గురవుతూ లోలోన కుమిలిపోతున్న అసంఖ్యాక సామాన్య ప్రజాబాహుళ్యానికి భరోసా ఇవ్వగలిగారా? పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఉండి అలా నినదించగలవాళ్లెందరు? ఆ ఒకే ఒక్కడు ఆరోగ్యశ్రీ సహా ఎన్నో క్రియాశీల సంక్షేమ పథకాల ద్వారా దేశంలోని అరడజనుకు పైగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శప్రాయుడైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాక్షిగా తిరిగి ప్రజాక్షేత్రంలోకి దుమికిన ఆయన పుత్రుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒక్కరే! వీరిరువురికి పూర్వం టీడీపీ అధినేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ పదవిని అధిష్టించక ముందే ఒక చిరంతన సత్యాన్ని వెల్లడించారు– ‘పేదవాడికి చౌకధరకు అన్నం రెండు పూటలా పెట్టలేని పాలకుడు దేనికి’ అని ప్రశ్నించారు. దశమగ్రహంగా ఆయన ఇంట్లోకి దూరిన చంద్రబాబు మామకు వెన్ను పోటు పొడిచి మరీ అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత అనతి కాలం లోనే అవినీతి చక్రవర్తిగా కుట్రదారునిగా కుహనాపరునిగా పాలన సాగించని రోజు లేదు. పైగా తాను వేలువిడిచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే కుమ్మక్కై వైఎస్సార్ ఆకస్మిక మరణానంతరం రాష్ట్ర పాలనలో ఏర్పడిన వ్యవధిని అవకాశంగా తీసుకుని కేంద్ర కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో కుమ్మక్కైనవారు చంద్రబాబు.
రాజన్న మరణంతో సంక్షేమ పథకాలు, ఇక తమకు అందబోవన్న దిగులుతో ఉమ్మడి రాష్ట్రంలోని ఉభయప్రాంతాలలోని పథకాల లబ్ధిదారులైన పేద మధ్యతరగతి ప్రజలు సుమారు 600 మంది (ఒక్క తెలంగాణలోనే 400 మంది) గుండె ఆగి చనిపోవడం అక్షర సత్యం! ఆ సన్నివేశాలను కళ్లారా చూసి, చెవులారా విన్న రాజన్న బిడ్డ జగన్... చనిపోయిన పేదసాదల, లబ్ధిదా రుల కుటుంబాల్ని పరామర్శించడానికి ఓదార్పు యాత్రను తలపెడితే దాన్ని కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అక్కడికీ అధిష్టానానికి నచ్చచెప్పడానికి, బాధిత కుటుంబాల పట్ల ఆత్మీయతను వ్యక్తిగత సందర్శన ద్వారా ప్రకటించడం ధర్మమని చెప్పినా అధిష్టానం వినలేదు. అక్కడికీ కొన్ని నెలలు ఆగిన తర్వాత తండ్రిరుణం తీర్చుకునే యత్నంలో ఓదార్పు యాత్రను జగన్ కొనసాగించడాన్ని అధిష్టానం ధిక్కారంగా భావించింది. బహుశా ఇప్పుడు జగన్‌కు అవకాశమిస్తే కాంగ్రెస్‌లో జాతీయ స్థాయికి ఎక్కడ ఎదిగిపోయి రాహుల్‌కో మరొక రికో ప్రత్యామ్నాయ శక్తి కాగలడన్న దురాలోచన అధిష్టానానికి కల్గి ఉంటుంది. ఈ దురాలోచనకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు డూడూ బసవన్నలుగా మారి ఉమ్మడి రాష్ట్రం రెండు ప్రాంతాలలోనూ ఆ పార్టీ ఉనికినే చంపేసుకున్నారు. ఇప్పటికీ ఆ పెద్దలు జ్ఞాన వృద్ధులు కాలేక పోయి కుమిలిపోవలసిన దుస్థితి వచ్చింది.
అంతేకాదు, జగన్‌ను సంబంధం లేని అనేక కేసుల్లో ఇరికించడానికి ఇదే అదనుగా చంద్రబాబు కేంద్రంతో చేతులు కలిపో, జమిలిగానో ‘దేశం’ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీబీఐ మాజీ డైరెక్టర్ అయిన విజయ రామారావు వద్ద పనిచేసిన జాయింట్ డైరెక్టర్ అయిన లక్ష్మీనారాయణను తోడు చేసుకుని సోనియా–చంద్రబాబు వర్గంగా జగన్‌పై డజనుకుపైగా కేసులుమోపి, జైలులో నిర్బంధించడానికి కారకు లయ్యారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ద్వారా ‘ఏవి నీ సాక్ష్యాలు, నెలల తరబడి సాక్ష్యాలు చూపడం లేదెందుకని ప్రశ్నిస్తూ వచ్చినా ఆ కేసుల్ని అలాగే ఉంచి 16 మాసాలపాటు జగన్‌ను నిర్బంధాలు, వ్యథల పాలు చేశారు.
ఈ చర్య ఆసరాగా, జగన్ నిర్బంధకాలంలో ఉండగానే అనేక భూముల అన్యాక్రాంతాలకు చంద్రబాబు తెరలేపి ఆ అవినీతి నీడలో తాను ఎదుగుతూ వచ్చాడు. జగన్‌పై ఒక్క కేసూ రుజువు కాక పోగా, బాబుపై ఉన్న భూముల ఆక్రమణ, అన్యాక్రాంతాల తాలూకు హైకోర్టు, సుప్రీంకోర్టులలో నానుతున్న 17 కేసుల విషయంలో అధి కారం, పలుకుబడి చాటున దాగి విచారణకు రాకుండా ముఖం చాటే స్తున్నారు. ఇలా యువకుడైన జగన్‌ను సుదీర్ఘకాలం జైలుపాలు చేస్తూ, కుటుంబ సభ్యుల నుంచి, భార్యా పిల్లలనుంచి దూరం చేయటమేగాక, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా జగన్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వ లేక పళ్లునూరుతూ అరుపులతో కోపాన్ని, ఉగ్రరూపాన్ని తన ఆయు ధంగా మలచుకున్న బాబు ప్రతిపక్ష నాయకుని నోరు నొక్కడానికి సీఎం పదవిని సదా దుర్వినియోగం చేస్తూ వచ్చాడు. దీనికి సమాధానంగానే.. ప్రతిపక్షాన్ని గౌరవించని పాలకుడున్నచోట ప్రపంచంలో కొన్ని శాసన వేదికలను ప్రతిపక్షాలు బహిష్కరించినట్టే జగన్ కూడా ప్రజా వ్యతిరేక వేదికగా తయారైన ఏపీ శాసనసభను శాశ్వతంగా బహిష్కరించి ప్రజా క్షేత్రంలోకి దిగి, సుమారు తన 16 మాసాల పాద యాత్ర ద్వారా కోట్లాది మంది ప్రజా బాహుళ్యానికి దగ్గరై, ఆత్మబంధు వయ్యారు.
దేశ చరిత్రలోనూ, బహుశా ప్రపంచ చరిత్రలోనే కుల, మత వర్గ, వర్ణ వివక్షకు దూరంగా సకల జన సౌభాగ్యాన్ని ఆశిస్తూ సకల వృత్తుల వారి వెయ్యిన్నొక్క పనిముట్లను సమాదరించి సామూహిక శక్తి ప్రతి నిధిగా, వారి ప్రతిధ్వనిగా పాదయాత్రతో నిరూపించుకున్నవాడు జగన్. కాగా, చంద్రబాబు కంపెనీల.. కాదు కాదు దొంగ కంపెనీలకు ప్రతినిధి కాబట్టే రిలయెన్స్ లాంటి గుత్త పెట్టుబడిదారులతో ‘సీఈవో’ బిరుదు పొంది గుడిని, గుళ్లో లింగాన్నీ మింగేయగల శక్తియుక్తుల్ని పొందబట్టే అమరావతిని రాజధానిగా కాకుండా పేకమేడలా లేదా రాజమౌళి తరహా ‘సినీ సెట్టింగ్’లా తయారు చేశారు. మూడు పంటలు పండే సుక్షేత్రాలను చౌకగా ఇవ్వడానికి నిరాకరించిన రైతుల భూముల్ని తగలబెట్టించి, ఆ నేరాన్ని నందిగం సురేశ్ లాంటి దళితుడిపైకి నెట్టి మానసిక చిత్రవధకు గురిచేసి, అతనిపై హత్యా ప్రయత్నానికి పోలీసులను పురిగొల్పిన పాలకుడు బాబు. ఇందుకు ‘తందాన’ పలికినవి ఆయన ‘ఉంచుకున్న’ పత్రికలు. ‘కంప్యూటర్లు జనాలకి తిండి పెట్టవని ఆఫ్రికా పర్యటనలో గ్రామీణుల ప్రశ్నల పరంపరకు తట్టుకోలేక వెనక్కి తిరిగి వచ్చిన బిల్ గేట్స్ చెప్పినా చెవిలో సీసం నింపుకున్న బాబు విద్యా సంస్థలలో చరిత్ర పాఠాల్ని, సామాజిక శాస్త్రాల్ని మాన్పించి కేవలం కంప్యూటర్ డబ్బాల తోనే కాలక్షేపం చేసే దళారీ పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రపంచ బ్యాంకు అండదండలతో ముందుకు నెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ప్రజల్ని, వ్యవ స్థల్ని రుణానందలహరిలోకి నెట్టి కూర్చున్నాడు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పగ్గాలు ఈనెల 30 నుంచి చేబట్టబోతున్న చిరంజీవి యువనేత జగన్ కడు జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. 1999 నాటికి, అనంతరం ప్రపంచబ్యాంకు ‘కాబూలీ రుణ వడ్డీ’లతో రాష్ట్ర జనాభాలో తల ఒక్కంటికి పేరుకుపోయిన సుమారు రూ. 15 వేల రుణాలు ఇప్పుడు పాలకుల కటిక దోపిడీ ఫలితంగా సుమారు తల ఒక్కింటికి లక్ష చేరుకుని రాష్ట్ర రుణ భారం రూ. 2 లక్షల 30 వేల కోట్లకు చేరిందని ఒక అంచనా. ఈ పరిస్థితుల్లో అటు కేంద్రంలోని బీజేపీ పాల కుల నుంచి, ఇటు నిన్నటిదాకా కేంద్రంలోని బీజేపీ మంత్రి వర్గంలో భాగస్వామి అయి, ఇటీవలనే విడిపోయినట్టు నాటకమాడిన బాబుతో తెగతెంపులయినట్టు పైకి కనిపిస్తున్న బీజేపీ పాలకపక్షం నుంచీ జగన్ పాలనకు కొత్త చిక్కులు రావని అజాగ్రత్తగా ఉండరాదు. రాజ్య పాల నలో ఎత్తులకు పై ఎత్తులు వేయించిన ఘనత కూడా చాణక్య నీతిలో భాగమని మరవరాదు. నోటితో నవ్వినట్టు, కరచాలనం చేసినట్టు కని పిస్తూనే నొసటితో వెక్కిరించడం తల నెరిసిన పాలకుల సహజ గుణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తన పదవి కోసం విడగొట్టడానికి కాంగ్రెస్‌తో చేతులు కలిపిందీ, అస్తుబిస్తు మెజారిటీ ఆధారంగా, బలమైన ప్రతి పక్షంగా అవతరించిన వైఎస్సార్ కాంగ్రెస్‌ను 23 మంది ఎమ్మెల్యేలను ధన బలంతో చీల్చి, మరి ముగ్గురు ఎంపీలను కూడా కొని, ప్రలోభంతో వేరుచేసినా తాజా ఎన్నికల్లో దక్కింది ఏమిటి? టీడీపీ చరిత్రలో అత్యంత అవమానకరమైన 23 అసెంబ్లీ సీట్లు, మూడే మూడు పార్లమెంటు స్థానాలు. బాబు తానొకటి తలిస్తే, ప్రజలు మరొక మార్గంలో ఆలోచించి అవే ఎక్కువ, అంతటితో ఉనికి చాలించుకోమని పాఠం నేర్పారు. అయినా బింకం చావక ఫలితాలు వెలువడిన 48 గంటల తర్వాత ‘నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటున్నాను, నా 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఎవరూ కాదనలేరు’ అంటూ ఆ బింకం మధ్యనే బాబు ‘రేపటి నుంచి వో ‘పప్పు’ అధికారంలోకి వస్తాడు’ అంటూ పరో క్షంగా జగన్‌ని ఆడిపోసుకోవడానికి వెనుకాడ లేదు.
అంటే, కుట్రదారుడు మట్టి కరిచినా, కుట్ర మనస్సుకు విశ్రాంతి ఉండదు. అలాగే బీజేపీ ఇతర రాష్ట్రాలలో ప్రతిపక్షాలపై పన్నిన కుట్ర ఫలితాలు గమనించిన వారికి– తాత్కాలికంగా ఇప్పుడు సద్దుమణిగి నట్టు పైకి కనిపించినా రేపు కేంద్రంలో తన అవసరాలను బట్టి, వీలూ, వాలూ చూసుకుని రాష్ట్ర పాలక పక్షంలోని కొందరు బలహీనుల్ని చీల్చ డానికి ప్రయత్నించదని జగన్ భావించరాదు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా సాధనకు నిరంతరం జగన్ ఒత్తిడి చేస్తున్నకొద్దీ– పరోక్షంగా ప్రత్యామ్నాయ ఒత్తిళ్లను బీజేపీ కేంద్ర పాలకులు పెంచరని భావిం చరాదు. సుదీర్ఘ పోరాటాల, కష్టనష్టాల మధ్య ప్రజలనుంచి పొందిన ఉత్తేజానికి ప్రతిఫలంగా ప్రకటించిన ‘నవ రత్నాలు’ నిరాటంకంగా అమలులోకి తెచ్చుకోవాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే రాజీలేని మార్గం. తెలుగు ప్రజలు అమరారులు కావాలన్నా, అడ్మినిస్ట్రేటివ్ రాజ ధానిగా అమరావతి అలరారాలన్నా అదే మార్గం. కోకిలకు కుల, వర్ణ, వర్గ వివక్ష ఉండదు. తన గాన మాధుర్యంతో సర్వ జనావళినీ అలరి స్తుంది. వసంత రుతువు వచ్చేదాకా మౌనంగా ఉంటుంది, అనువైన సమయంలో గొంతెత్తడం దాని విజ్ఞత. అదే జగన్ ఎత్తిన గళం. అదే రాజన్న, విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మల ప్రత్యక్ష, పరోక్ష ఆశీర్వ చనం ‘యావత్ సర్వజనానందదాయినీ వాక్ ప్రవర్తతే’!
-ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment