దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా జరు గుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అగ్రెసివ్ పోరాటాలూ, రాజకీయాలే ఆయా రాజకీయ పార్టీలను అందలం ఎక్కిస్తాయా అని అనిపిస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీగా దూకుడు (అగ్రె సివ్)గా పోరాడిన పార్టీలనే ఓటర్లు ఆదరిస్తారని పలు ఎన్నికలు నిరూపిస్తున్నాయి. బీజేపీ చేపట్టిన రామజన్మ భూమి ఉద్యమం, అయోధ్య రథయాత్ర, అస్సాం గణ పరిషత్ రాజకీయాల నుంచి మొదలు పెట్టి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా నిశితంగా పరిశీలిస్తే ఈ సంగతి విదితమవుతుంది.
1984 సాధారణ ఎన్నికలలో కేవలం 2 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ అప్పటి దాకా విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు నిర్వహిస్తున్న అయోధ్య ఉద్యమానికి బహి రంగంగా మద్దతు పలికింది. అప్పటి బీజేపీ అధ్యక్షుడైన లాల్ కృష్ణ అడ్వాణీ చేపట్టిన అయోధ్య రథయాత్ర దేశంలో సంచలనం రేపింది. అడ్వాణీతో పాటు అనేకమంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. తదనంతర పరిణామాలు ఆ పార్టీని కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి తీసుకువచ్చాయి.
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కూడా అగ్రెసివ్ రాజకీయాలే ‘అస్సావ్‌ు గణ పరిషత్’ను అధికారంలోకి తీసుకు వచ్చాయి. అస్సాంలోకి విచ్చలవిడిగా జరుగుతున్న బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా ‘ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్’ (ఆసు) ఉద్యమించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆసు ప్రఫుల్ల కుమార్ మహంత నేతృత్వంలో ‘అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) పేరుతో రాజకీయ పార్టీగా ఆవిర్భవించి అస్సాంలో అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చింది.
మహంత చేపట్టిన విద్యార్థి ఉద్యమానికి ప్రేరేపి తులైన అస్సాం ప్రజానీకం ఆయన నేతృత్వంలోని అస్సాం గణ పరిషత్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్‌సీ) అధినేత్రి మమతా బెనర్జీ తన దూకుడుతనంతో కూడిన రాజకీయ ఉద్యమాలతోనే దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కమ్యూనిస్టులను ఓడించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్రకు ‘రెండు కళ్ల సిద్ధాంతం’తో పరోక్ష మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తదితర పక్షాలను వెనక్కినెట్టి అధికారాన్ని చేపట్టింది. అయితే ప్రజా సమస్యలను తెలుసుకుంటూ నాటి తెలుగు దేశం పాలనను ఎండగడుతూ పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజల మనసు గెలుచుకున్నారు. ఫలితంగా మలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అధికారం అప్పగించారు.
ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన టీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా రెండు సార్లు తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్ట బెట్టడం గమనార్హం. ఆ పార్టీ చేసిన అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగట్టిన బీజేపీ పోరాటాల ద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. నాటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్ చేపట్టిన ‘మహా సంగ్రామ పాదయాత్ర’తో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా బలపడింది. నిరుద్యోగులు, ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు, టీచర్లు వంటి వారి సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసింది.
దీంతో దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలతోపాటు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య విజయాలను ప్రజలు అందించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష స్థానం నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వం మార్చింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రజలను నమ్మించ డంలో సఫలీకృతులయ్యారు.
గతంలోని కాంగ్రెస్ నాయకుల కంటే విభిన్నమైన రీతిలో పార్టీని ఉద్యమ పంథాలో ముందుకు నడిపి రాష్ట్రంలో ఇతర పక్షాల మద్దతు అవసరం లేకుండానే 64 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విధంగా కేంద్రంలో కాని, రాష్ట్రాల్లో కాని ప్రజలపక్షాన నిలిచి దూకుడుగా రాజకీయాలు చేసిన పార్టీలనే ప్రజలు అందలం ఎక్కిస్తారని తేటతెల్లమవుతోంది.
శ్యామ్ సుందర్ వరయోగి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
దూకుడు పోరాటాలే అందలం ఎక్కిస్తాయా?
Published Fri, Dec 29 2023 5:11 AM | Last Updated on Fri, Dec 29 2023 5:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment