ప్రజాస్వామ్యంలో నిరంకుశ నేత | Sakshi Editorial On Turkey Democracy | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో నిరంకుశ నేత

Published Wed, May 31 2023 12:20 AM | Last Updated on Wed, May 31 2023 12:20 AM

Sakshi Editorial On Turkey Democracy

నిరంకుశులు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం పేరుకే మిగులుతుంది. అతి జాతీయవాదం ప్రబలినప్పుడు ఆలోచనను అది మింగేస్తుంది. ఆ చేదు నిజానికి టర్కీ (తుర్కియే) మరోసారి సాక్షీ భూతమైంది. తొలి దఫాలో ఫలితం తేలకపోయేసరికి రెండో దఫా సాగిన ఎన్నికలు, నాటకీయ ఫక్కీలో రోజుకొకరిది ఆధిక్యంగా మారిన ఎన్నికల ప్రచారం తర్వాత టర్కీ తాజా అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డొగాన్‌ తన పట్టు నిలబెట్టుకున్నారు.

ఎన్నికలు ‘అత్యంత న్యాయవిరుద్ధంగా సాగా’యన్న ప్రత్యర్థి మాటలు ఎలావున్నా లెక్కల్లో అంతిమ విజయం ఎర్డొగాన్‌దే అయింది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశానికి ఎగ బాకినా, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయినా ఆయన మాత్రం ప్రపంచ వేదికపై దేశప్రతిష్ఠను పెంచానని పౌరులకు నమ్మబలికారు. కుర్దిష్‌ వేర్పాటువాదుల్ని తన ప్రత్యర్థి సమర్థిస్తున్నారంటూ నమ్మించారు. అతి జాతీయవాదంతో ఆధిక్యాన్ని నిలుపుకొన్నారు. అదే ఈ ఎన్నికల విడ్డూరం.  

2017లో రిఫరెండం ద్వారా టర్కీలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలనగా మార్చిందీ, ఆ పైన ప్రధాని పదవిని రద్దు చేసిందీ ఎర్డొగానే. న్యాయవ్యవస్థ, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ సహా ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ నియంత్రణలో పెట్టుకున్న ఘనుడాయన. నైపుణ్యం కన్నా విధేయతే గీటురాయిగా అయినవాళ్ళతో వాటిని నింపేశారు. ప్రధాన స్రవంతి మీడియా అంతా చేతుల్లో ఉన్న ఆయనకు ఎన్నికల ప్రచారం పరాకాష్ఠకు చేరినవేళ 32 గంటల ప్రసార సమయం లభిస్తే, ప్రత్యర్థికి దక్కింది 32 నిమిషాలే.

విజయానికై ఎంతకు దిగజారడానికైనా వెనుకాడకపోవడం ఆయన నైజం. దాంతో, దేశంలో ఎన్నడూ లేనన్నిసార్లు హత్యాయత్నం జరిగిన నేతగా పేరొందిన ప్రతిపక్షాల అభ్యర్థి కెమల్‌ కిలిచదరోగ్లూ చివరకు బహిరంగ సభల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ చొక్కా వేసుకొని, ప్రచారం చేయాల్సిన దుఃస్థితి. మాటల్లో సౌమ్యత, మనిషి కొంత మహాత్మా పోలికలతో ‘గాంధీ కెమల్‌’ అని ముద్దుగా అందరూ పిలుచుకొనే ప్రజాస్వామికవాది ఓడిపోయారు. 

నిజానికి 600 సభ్యుల పార్లమెంట్‌కూ, అధ్యక్ష స్థానానికీ మే 14న జరిగిన ఎన్నికలు ప్రస్తుత అధ్యక్షుడిని ఇంటికి సాగనంపి, ప్రతిపక్షాల సమష్టి అభ్యర్థి కెమల్‌కు పట్టం కడతాయని భావించారు. ఎన్నికల జోస్యాలూ ఆ మాటే చెప్పాయి. తీరా జరిగింది వేరు. 6.4 కోట్ల మంది ఓటర్లలో 88 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొంటే, 49.5 శాతం ఓట్లు ఎర్డొగాన్‌కూ, 44.8 శాతం ప్రత్యర్థికీ వచ్చాయి. ఆయన కూటమి ‘పీపుల్స్‌ అలయన్స్‌’ పార్లమెంట్‌లో 323 స్థానాలు, ప్రత్యర్థి ‘నేషన్‌ అలయన్స్‌’కు 213 స్థానాలు దక్కాయి.

అధ్యక్ష పదవికి కావాల్సిన 50 శాతం ఓట్ల కోసం దేశ చరిత్రలో తొలిసారిగా కథ రెండో దఫా ఎన్నికల దాకా సాగింది. ఈ మదగజాల పోరులో సుమారు కోటి మంది సిరియన్‌ శరణార్థుల గోడు ఎవరికీ పట్టలేదు. ఇరుపక్షాలూ శరణార్థుల్ని వెనక్కి పంపేస్తామన్నాయి.

సౌమ్యుడైన కెమల్‌ సైతం చివరకు ఓట్ల పునాదిని పెంచుకొనే వ్యూహంతో శరణార్థులపై కటువుగా మాట్లాడారు. అయినా లాభం లేకపోయింది. మే 28న రెండో దఫాలో 84 శాతం ఓట్లు పోలైతే, 48 శాతం వద్దే ప్రత్యర్థి ఆగిపోయారు. 52 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడికే పట్టం దక్కింది. 

ఇల్లలకగానే పండగ కాదన్నట్టు... ఎన్నికల్లో ఎర్డొగాన్‌ గెలిచారు కానీ, కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పటికి గెలిచినా, భిన్న ధ్రువాలుగా చీలిపోయిన దేశంలో, ఆయన అజెండాను ఇప్పటికీ 47 శాతం పైగా వ్యతిరేకిస్తున్నారని మర్చిపోరాదు. అందుకే, వరుసగా అయిదోసారి అధ్యక్షుడై, అధికారంలో మూడో దశాబ్దంలోకి అడుగిడుతున్న ఆయన ముంగిట అనేక సవాళ్ళు న్నాయి.

టర్కీలో ద్రవ్యోల్బణం 44 శాతానికి చేరింది. 2018 నుంచి ఇప్పటికి కరెన్సీ విలువ 80 శాతం క్షీణించింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 151 మిలియన్‌ డాలర్ల లోటులో పడ్డాయి. ఫిబ్ర వరిలో 50 వేల మంది మరణించిన భారీ భూకంప వేళ సర్కార్‌ పనితీరూ అంతంత మాత్రమే. ఇన్ని కష్టాల మధ్యా యూఏఈ, సౌదీ, రష్యాల నుంచి గణనీయ విదేశీ సాయంతో బండి నెట్టుకొచ్చారు. రానున్న అయిదేళ్ళలో ఈ నిరంకుశ నేత ఆర్థికవ్యవస్థను ఎలా సుస్థిరం చేస్తారన్నది ఆసక్తికరం.  

ఇక, భౌగోళికంగా ఆసియా – ఐరోపాల కొసన ఉండడం, ముస్లిమ్‌ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రపంచ దేశాల్లో టర్కీ ఒకటి. రష్యా నుంచి లాభపడుతున్న ఈ ‘నాటో’ సభ్యదేశపు విదేశాంగ విధానం స్పష్టమే. రష్యాకూ, పాశ్చాత్య ప్రపంచానికీ మధ్య సాగుతున్న ప్రస్తుత పోరాటంలో ఆ దేశం తన వైఖరిని మార్చుకోదు.

పాశ్చాత్య ప్రపంచానికి కాక పుట్టేలా ప్రాంతీయంగా, విదేశీ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వతంత్రతను చూప నుంది. భారత్‌తో ఒకప్పుడు బలమైన బంధమున్నా, 370వ అధికరణం రద్దు తర్వాత కశ్మీర్‌పై ఎర్డొ గాన్‌ ప్రకటనలు, పాక్‌తో సాన్నిహిత్యం నేపథ్యంలో మన సంబంధాలెలా ఉంటాయో వేచి చూడాలి. 

మొత్తం మీద ఎన్నికలనేవి అన్నిసార్లూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న నమ్మకాన్ని అందిస్తాయని చెప్పలేం. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేసి, అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే నిబంధనల్ని మార్చేసి, అసలు స్ఫూర్తికే తిలోదకాలిచ్చినప్పుడు ఎన్నికలు నామ మాత్రమే! ప్రజాస్వామ్యం పేరుకే! సైన్యం తెర వెనుక ఉండి కథ నడిపే పాకిస్తాన్‌ సహా అనేక దేశాల్లో ఇదే ప్రహసనం.

దశాబ్ది పైచిలుకుగా టర్కీలో ఎర్డొగాన్‌ చేసిందీ, జరిగిందీ ఇలాంటి ప్రజాస్వామ్య పరిహాసమే. కానీ, అధికారాన్ని నిలుపుకోవడానికి అక్కరకొచ్చిన ఈ ఆట ఆర్థిక కష్టాల్లోని దేశాన్ని ముందుకు నడిపించడానికి ఇకపైనా పనికొస్తుందా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement