న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్ల చెలామణి క్రమంగా తగ్గిపోతోంది. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రూ.2000 నోట్లను క్రమంగా ఉపసంహరించుకోడానికి కేంద్రం, ఆర్‌బీఐలు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. 2021 నవంబర్‌లో చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రూ.2,000 నోట్లు 1.75 శాతమని రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2018 మార్చిలో ఈ నోట్లు 3.27 శాతమని ఆయన తెలిపారు. ఈ కాలంలో నోట్ల సంఖ్య 336.3 కోట్ల నుంచి 223.3 కోట్లకు తగ్గిపోయిందని వెల్లడించారు. విలువ విషయంలో ఇదే కాలంలో పెద్ద నోట్ల వాటా 37.26 శాతం నుంచి 15.11 శాతానికి తగ్గిపోయినట్లు వివరించారు. ఆయన ప్రకటనలోని ముఖ్యాంశాలు..
► ప్రజల లావాదేవీల డిమాండ్‌ను సులభతరం చేయడానికి కావలసిన నోట్ల డినామినేషన్ నిర్వహణకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదించి నిర్దిష్ట విలువ కలిగిన నోట్ల ముద్రణ కార్యకలాపాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
► 2018–19 నుంచి పెద్ద నోట్ల కోసం కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లకు ఎలాంటి తాజా ఇండెంట్ పెట్టలేదు.
►మురికిగా, ముక్కలుగా మారుతున్నందున వ్యవస్థలో మిగిలిన పెద్ద నోట్లు కూడా చెలామణిలో లేకుండా పోనున్నాయి.
► కరెన్సీకి డిమాండ్ పలు స్థూల ఆర్థిక అంశాలపై ఆదారపడి ఉంటుంది. ఆర్థికవృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల వంటి పలు అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి.
► మహమ్మారి కరోనా, అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీని దగ్గర ఉంచుకోడంపై ప్రజలు ఉత్సుకత ప్రదర్శించారు. దీనితో కరెన్సీకి డిమాండ్ నెలకొంది.
► 2020–21లో కరెన్సీ చెలామణి జీడీపీలో గరిష్టం 14.5 శాతానికి ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఇప్పటి వరకూ ఈ శాతం 13.1 శాతంగా నమోదయ్యింది. మహమ్మారి కరోనా తీవ్రత సృష్టించిన అనిశ్చితి, అభద్రతాభావం నేపథ్యంలో నగదు దగ్గర ఉంచుకోడానికి ప్రజలు మొగ్గుచూపారు. ఈ సమయంలో ప్రజలు దాదాపు రూ.3.3 లక్షల కోట్లు తమ వద్ద ఉంచుకుని ఉంటారన్నది అంచనా.
► 2007–08 నుంచి 2009–10 ఆర్థిక సంవత్సరాల మధ్య మూడేళ్లు భారత్ ఎకానమీ దాదాపు రెండంకెల వృద్ధి రేట్లను నమోదుచేసుకుంది. ఈ సమయంలో జీడీపీలో నగదు చెలామణి వరుసగా 12.1 శాతం, 12.5 శాతం, 12.4 శాతంగా నమోదయ్యాయి. అటు తర్వాత ఐదు ఆర్థిక సంవత్సరాలు దాదాపు ఇదే శాతాలు నమోదయ్యాయి. అయితే 2014–15లో మాత్రం 11.4 శాతానికి తగ్గింది.
►నల్లధనం, వ్యవస్థలో పారదర్శకత లక్ష్యగా 2016 నవంబర్ 8వ తేదీన మోదీ ప్రభుత్వం అప్పటి పెద్ద నోట్లు రూ.500, రూ.1,000 బ్యాంక్ నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం కొత్తగా రూ.2,000 నోట్లు, కొత్త సిరీస్‌లో రూ.500 నోట్లను వ్యవస్థలోకి ప్రవేశపెట్టారు. అటుపై రూ.200 నోటు కూడా వ్యవస్థలోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment