చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు: వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గోవు భారతీయ జీవన విధానంలో భాగమని, గోవు పేరుతో దాడులు చేయొద్దని, దాడులకు దిగేవారు హిందువులు కాలేరని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిని సహించబోమని వెంకయ్యనాయుడు హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తం చేసిన త్యాగ పురుషులను మరిచిపోవద్దని, దేశభక్తిని రగిలించడానికే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ పోరాటం చేసిన కుటుంబాలను గౌరవించుకోవాలన్నారు. రజాకారుల ఆగడాల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ను కూడా ఆగస్టు 15 లాగానే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గుర్తుచేసే విధంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 17 దాకా రాష్ర్టమంతా తిరంగా జెండా పండుగను చేస్తామని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున నిధులను కేటాయించిందని, రెండేళ్లలో తెలంగాణకు రూ.96 వేల కోట్లు ఇచ్చిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు, బీజేపీ శాసనసభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీని వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు.