బైడెన్‌ బెంబేలు.. ఇలాంటి సన్నివేశాన్ని ఇండియాలో ఊహించగలమా? | FBI Raids In Joe Biden Residence Is It Possible In India | Sakshi
Sakshi News home page

దేశాధ్యక్షుడికే చెమటలు.. ఇలాంటి సన్నివేశాన్ని ఇండియాలో ఊహించగలమా?

Published Tue, Jan 24 2023 11:36 AM | Last Updated on Tue, Jan 24 2023 12:49 PM

FBI Raids In Joe Biden Residence Is It Possible In India - Sakshi

అమెరికాలో ఏకంగా ఆ దేశ అద్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదికారులు సోదాలు జరిపినట్లు వచ్చిన వార్త సంచలనాత్మకమైనదే. ప్రజాస్వామ్యంలో ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా, తప్పు చేస్తే తత్పరిణామాలను ఎదుర్కోవలసిందేనని అమెరికా అనుభవం చెబుతుంది. బైడెన్ ఇంటిలో సోదాలు ఏకంగా 13 గంటల పాటు జరిగాయి.

అందులో ఆరు రహస్య ఫైళ్లు దొరికాయట. గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఉంచుకున్న ఆ ఫైళ్లు పదవి పోయిన వెంటనే ఆర్కివ్స్ కు పంపించవలసి ఉండగా, ఇంటిలోనే ఉంచుకోవడం వివాదాస్పదం అయింది. అది ఆయన అధ్యక్ష స్థానంలోకి వచ్చాక వెలుగులోకి రావడం విశేషం. 

మరో వైపు ఆయన కుమారుడి వ్యాపార లావాదేవీలపై కూడా విమర్శలు వస్తున్నాయి. అది వేరే సంగతి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే మన భారత దేశం అమెరికాకన్నా పెద్ద  ప్రజాస్వామ్య దేశం. కాని ఇక్కడ మాత్రం అధికారంలో ఉన్నవారి జోలికి తప్పనిసరి అయితే తప్ప సంబంధిత దర్యాప్తు సంస్థలు వెళ్లవు. ఒకవేళ వెళ్లినా అది మొక్కుబడిగానే ఉంటుందని చెప్పనవసరం లేదు.

అదే ప్రతిపక్షానికి చెందినవారైతే దర్యాప్తు సంస్థలు జోరుగా విచారణకు వెళతాయన్న అభిప్రాయం ఉంది. అందుకే కేంద్రంలో అదికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీలకు చెందినవారు చేరుతుంటారు. అలాకాకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడవలసి వస్తుంది. 

ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో యుపీఏ టైమ్‌లో శక్తిమంతమైన నేతగా ఉన్న సోనియాగాంధీని ఆ పార్టీ ఎంపీగా  ఉన్న వైఎస్ జగన్ ఎదిరించారు. సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. అంతే! సోనియాగాంధీకి కోపం వచ్చింది. ఏపిలో ప్రతిపక్షపార్టీ అయిన తెలుగుదేశంతో కుమ్మక్కై మరీ జగన్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అదే టైమ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన అభియోగాలపై విచారణ జరపడానికి న్యాయ వ్యవస్థ కూడా ముందుకు రాకపోవడం గమనించవలసిన అంశం. 

2014లో చంద్రబాబు అదికారంలోకి వచ్చాక తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఆయనను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెలంగాణ సీఎం కేసీఆర్ అనేవారు. కాని కేంద్రంలోని ఎన్.డి.ఎ.లో భాగస్వామిగా టీడీపీ ఉండడంతో చంద్రబాబుకు కేంద్రంలోని కొందరు పెద్దలు రక్షణగా నిలబడ్డారు. అదే సమయంలో కొన్ని వ్యవస్థలలోని వారిని కూడా మేనేజ్ చేయగలిగారని చెబుతారు.

ఏదైతేనేమీ ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యారు. ఆ తరుణంలో సీబీఐపై ఆయన ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిందే. బీజేపీ వారు తనపై కేసు పెట్టబోతున్నారని, ప్రజలంతా వచ్చి తనకు అండగా ఉండాలని కోరేవారు. అసలు సీబీఐని ఏపీలోకి రాకుండా ఆంక్షలు పెట్టారు. తర్వాత 2019లో ఆయన అధికారం కోల్పోయారు. 

తదుపరి ఆదాయపన్ను శాఖ చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడి ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల విలువైన అక్రమాలకు ఆధారాలు దొరికాయని ప్రకటించింది. కానీ చంద్రబాబు తన వైఖరి మార్చుకుని బీజేపీని ఒక్క మాట అనకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎవరూ తన జోలికి రాకుండా కేంద్రాన్ని మేనేజ్ చేసుకోగలిగారని చాలామంది భావిస్తుంటారు. అంతేకాదు.

రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు  బీజేపీలో చేరడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారిలో ఇద్దరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఐటీ, ఈడీ వంటి సంస్థలు దాడులు చేశాయి.  ఒకాయన అయితే ఏకంగా ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు బకాయిపడ్డారు. అయినా ఆయన బీజేపీలో చేరాక దర్యాప్తు సంస్థలు మరీ అంత సీరియస్‌గా వ్యవహరించలేదన్న అభిప్రాయం ఉంది. 

మరో వైపు బీజేపీ అంటే పడని పార్టీల నేతలపై సీబీఐ పలుమార్లు దాడులు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఏకంగా జైలుకు వెళ్లవలసి వచ్చింది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై సీబీఐ అధికారులు జరిపిన దాడులు సంచలనమే. పశ్చిమబెంగాల్ లో ఒక మంత్రి వద్ద రూ.45 కోట్లు పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ బీజేపీపై మరీ అంత గట్టిగా ఉండకుండా జాగ్రత్తపడుతున్నారు. 

తెలంగాణలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెపైనే ఈడి ఆరోపణలు చేయడం, దానిని బీఆర్ఎస్ నేతలు ఖండించడం జరిగింది. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ఊబిలో దిగబడుతున్నాయన్న భావన ఉంది. మరి అమెరికాలో అధ్యక్ష స్థానంలో ఉన్న నేత ఇంటిలోనే ఎఫ్‌బీఐ సోదాలు జరిపితే మన దేశంలో మాత్రం ఒక్కొక్కరిపట్ల ఒక్కో రకంగా ప్రమాణాలు పాటిస్తున్నాయన్న అభిప్రాయం ఉండడంలో తప్పులేదేమో!
-హితైషి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement