అందరి భాగస్వామ్యంతోనే సుపరిపాలన | Grievance redress system most powerful in democracy, says Modi | Sakshi
Sakshi News home page

అందరి భాగస్వామ్యంతోనే సుపరిపాలన

Published Sun, Aug 7 2016 1:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

అందరి భాగస్వామ్యంతోనే సుపరిపాలన - Sakshi

అందరి భాగస్వామ్యంతోనే సుపరిపాలన

ప్రధాని మోదీ ఉద్ఘాటన
* ప్రజాస్వామ్యంలో ఫిర్యాదుల పరిష్కారమే కీలకం
* ప్రజాస్వామ్యం ఓటుకే పరిమితం కాకూడదు
* తొలి టౌన్‌హాలు ప్రసంగంలో వ్యాఖ్యలు
* 8% వృద్ధి కొనసాగితే మనదే అగ్రస్థానం
న్యూఢిల్లీ:
ఉత్తమ పాలనకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తప్పనిసరని, ప్రజాస్వామ్యంలో అదే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుపరిపాలన సాధించాలంటే ప్రతి ఒక్కరూ పాలనలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. అమెరికా తరహాలో మొదటిసారి నిర్వహించిన టౌన్‌హాలు(పాలనలో పౌరుల సమస్యలపై చర్చ) కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం మోదీ ప్రసంగించారు.

MyGov.in వెబ్‌సైట్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఈ సభలో పీఎంఓ వెబ్‌సైట్‌ను అనుసంధానించే మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మోదీ సమాధానమిచ్చారు.
 
ప్రసంగం ముఖ్యాంశాలు మోదీ మాటల్లోనే
సుపరిపాలనతో సాధ్యం..  ‘ప్రజాస్వామ్యంలో అంత్యంత ప్రభావిత అంశం ఏంటంటే ప్రజా ఫిర్యాదుల్ని పరిష్కరించే వ్యవస్థే.. ప్రతి పౌరుడి సమస్యకు స్పందించడంతో పాటు పరిష్కరించాలి. ప్రభుత్వ వ్యవస్థ నెమ్మదిగా సాగే చోట్ల, పౌరుల పనులు సులువుగా పరిష్కారమయ్యేందుకు సుపరిపాలనను అభివృద్ధి చేయాలి. పాలనలో అందరూ భాగస్వాములే... ప్రతి దశలో ఏ సమస్య వచ్చినా ప్రధానినే బాధ్యులుగా చూస్తారు. అది సరైన విధానం కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బాధ్యతాయుత పాలన సాగితేనే సుపరిపాలన సాధ్యం. అభివృద్ధి, సుపరిపాలన సమతుల్య సంబంధాలు కలిగి ఉండాలి. చిట్టచివరి లబ్ధిదారుడికి ప్రభుత్వ లబ్ధి చేకూరాలి’.
 
ప్రభుత్వాల మార్పుతో అభివృద్ధి అసాధ్యం...
‘ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వంతో ప్రజలు ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఆ ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో వేరే రాజకీయ పార్టీకి విజయం కట్టబెడుతున్నారు. ఓటు వేసి ఐదేళ్లు వేచిచూడడం అలవాటుగా మారడంతో పాటు ప్రభుత్వమే అన్ని పనులు చేస్తుందన్న అలక్ష్యం నెలకొంది. కేవలం ఓటు వేసేందుకు ప్రజాస్వామ్యం పరిమితమైతే దాని స్ఫూర్తి వృద్ధి చెందదు. ఎన్నికల్లో గెలిచాక తర్వాతి ఎన్నికల్లో ఎలా గెలవాలా?  అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. దీంతో అభివృద్ధి కుప్పకూలుతోంది.’
 
నిరుపేదలకు ఆరోగ్య బీమా...
‘వ్యాధుల్ని అదుపు చేసే, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలపై దృష్టిపెట్టాలి. టీకాల కోసం ప్రకటనల రూపంలో ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నాం. అయినా చాలా మంది పిల్లలకు టీకాలు వేయించడం లేదు.   ఆరోగ్య విభాగం ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరిని కలుస్తుంది. బడ్జెట్‌లో ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడంతో నిరుపేదలు కూడా మంచి వైద్యం పొందుతారు.’
 
ఆధునిక సేద్యం అవసరం
‘మన ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే సామర్థ్యం వ్యవసాయ రంగానికుంది. సంప్రదాయ విధానాల నుంచి ఆధునిక వ్యవసాయం వైపు రైతులు మారాల్సి ఉంది. వ్యవసాయంతో పాటు ఆదాయం పెంచుకునేందుకు పశుపోషణ, తేనెటీగల పెంపకాన్ని రైతులు చేపట్టాలి.’
 
చేనేతకు చేయూత
‘ఆగస్టు 7న చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలు తమ దుస్తుల అవసరాల్లో 5 శాతం ఖాదీ, చేనేత వస్త్రాలు వినియోగించండి.  వస్త్ర పరిశ్రమకు సహాకారం అందిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది.’
 
ఆర్థిక వృద్ధితో అగ్రస్థానం
‘ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలి.  మనం అగ్రస్థానంలో నిలిచేందుకు ఇది తప్పనిసరి. 30 ఏళ్ల పాటు మనం 8 శాతం వృద్ధి రేటు కొనసాగిస్తే మనం ప్రథమస్థానంలో నిలుస్తాం. ప్రపంచం ప్రస్తుతం ఆర్థిక మాద్యంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు శక్తి తగ్గుతున్నా 7.6 శాతం వృద్ధి రేటుతో  పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది. గత ఆరు నెలల్లో 40 లక్షల మంది పర్యాటకులు దేశాన్ని సందర్శించారు. పారిశుద్ధ్యం ఈ మార్పుకు దోహదపడింది.’
 
విదేశాంగ విధానంలో రాజీలేదు
‘ద్వైపాక్షిక అంశాల్లో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలే ముఖ్యం. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడ్డాయి. చాలా అంశాల్లో కలిసికట్టుగా సాగడం ఒక నిబంధనగా మారింది. విదేశాలతో భారత్ ఒప్పందాలు బలోపేతమయ్యేలా ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత దేశం బలమంతా భిన్నత్వంలోనే ఉంది.’
 
అలసటకు చోటులేదు..
‘విదేశాల్లోని భారతీయులు త రచూ జెట్‌లాగ్(విమాన ప్రయాణ అలసట) గురించి మాట్లాడతారు. అంతదూరం ప్రయాణించి మళ్లీ వెంటనే ఆఫీసుకు ఎలా వెళతారని ప్రశ్నిస్తుంటారు.  నేనెప్పుడూ అలసిపోను. 125 కోట్ల మంది ప్రజలు, వారి కలలు, వారి పరిస్థితులు హృదయపూర్వకంగా ముందుకు సాగేలా చేస్తున్నాయి. ఎక్కువ శక్తి ఉండడంతో అంతగా కష్టపడుతున్నారని నాతో చెపుతుంటారు. అది సరికాదు. అంతపని చేయాల్సి ఉందని తెలిసినప్పుడు శక్తి దానంతట అదే వస్తుంది. ’
 
రూర్బన్ పథకంపై...
‘నగరాల్లోని మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ సేవలు గ్రామాల్లోను కల్పించేందుకు దేశవ్యాప్తంగా 300 గ్రామాల్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికతో ఉంది. రూర్బన్ మిషన్ పేరిట ‘స్మార్ట్ సిటీ ప్లస్’ కింద ఈ గ్రామాల్ని గుర్తించాం. నగర తరహా సదుపాయాలు కల్పించేటప్పుడు గ్రామీణ వాతావరణం  చెడిపోకుండా చూస్తాం.’
 
గోరక్షణ పేరిట అక్రమాలు

‘రాత్రిళ్లు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ  పగలు గోరక్షకులుగా ప్రచారం చేసుకుంటున్న వారిపై ఆగ్రహంగా ఉన్నాను. తమ అక్రమ వ్యాపారాల్ని కప్పిపుచ్చుకునేందుకు చాలా మంది గోరక్షకులుగా చెప్పుకుంటున్నారు. వారిలో 80 శాతం సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్నట్లు సమాచారం. వారి పూర్తి వివరాల్ని సిద్ధం చేయమని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నా. ప్రజల్ని భయపెట్టడం, దాడులు చేసేందుకు స్వచ్ఛంద విభాగాలు, సంస్థలు ఏర్పాటు చేయొద్దు. గోవధ కన్నా ప్లాస్టిక్ బ్యాగులు తినడం వల్లే ఎక్కువ గోవులు మరణిస్తున్నాయి. జంతు పరిరక్షణకు కృషిచేయాలనుకుంటే గోవులు ప్లాస్టిక్‌ను తినకుండా చూడాలి. అదే పెద్ద సేవ. జంతువుల కోసం గతంలో నేను నిర్వహించిన ఒక వైద్య శిబిరంలో ఒక ఆవు నుంచి రెండు బకెట్ల ప్లాస్టిక్ ను తొలగించాం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement