ప్రమాదం అంచున ప్రజాస్వామ్యం | democacy in danger zone says krishnaiah | Sakshi
Sakshi News home page

ప్రమాదం అంచున ప్రజాస్వామ్యం

Published Sat, Jun 4 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

ప్రమాదం అంచున ప్రజాస్వామ్యం

ప్రమాదం అంచున ప్రజాస్వామ్యం

సందర్భం
ఉస్మానియా యూనివర్సిటీలో ఈ గురువారం నాటి ‘‘జనజాతర’’ బహిరంగ సభను ముఖ్యమంత్రి ఏ విధంగా అణచివేశారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఉద్యమాల కేసీఆర్‌ అణచివేత కేసీఆర్‌గా ఎంత త్వరగా మారిపోయారో చూస్తుంటే నమ్మశక్యం కావడం లేదు. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం.

ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పురిటి గడ్డ. 1969 నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు పుట్టినిల్లు. సంక్షేమ హాస్టళ్ల ఉద్యమం, నిరుద్యోగుల ఉద్యమం, క్యాపిటేషన్‌ ఫీజులు, ఇంజనీరింగ్‌ కాలేజీల డొనేషన్ల వ్యతిరేకత ఉద్యమం, బీసీ విద్యార్థుల ఉద్యమం, స్కాలర్‌ షిప్‌ల పెంపు ఉద్యమం – ఇలా ఏ ఉద్యమం జరిగినా ఉస్మా నియా యూనివర్సిటీ కేంద్రం. అనేకమంది నాయకులను తయారు చేసింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. కానీ నిన్నటి ‘‘జనజాతర’’ బహిరంగ సభను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ విధంగా అణ చివేశారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. బయటనుంచి చీమ కూడా వర్సిటీలోకి దూరకుండా జల్లెడపట్టారు. నాయకు లను కూడా అడ్డుకున్నారు. పోలీసు నిర్భంధంలో, ఉక్కు పిడికిలిలో యూని వర్సిటీని బంధించారు.

అసలు విద్యార్థులు జన జాతర ఎందుకు పెట్టారు? 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, టీఆర్‌ఎస్‌ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయ మని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే దీని లక్ష్యం. కానీ కేసీఆర్‌కి ఇది నచ్చడం లేదు. ఏ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించామో! ఏ ఉద్యమం ద్వారా తాను సీఎం అయ్యారో అది మరిచిపోయారు. ప్రజా స్వామ్య విలువలను వదిలేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన గాడి తప్పు తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంకుశ ధోరణి, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఆశ్రితపక్ష పాతం, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం హద్దులు దాటింది.

ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించడం లేదు. అసెంబ్లీ ఆమో దించిన విధంగా బడ్జెట్‌ ఖర్చు పెట్టాలి. కానీ తనకు తోచినట్లుగా ఎప్పుడు ఏ ఆలోచన వస్తే ఆ విధంగా స్కీములు ప్రకటించి బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడింది. కానీ అడ్డగోలుగా.. అప్పులు తెచ్చి అప్పుల తెలంగాణగా మార్చారు. మొదటి ఏడాది 10 వేలకోట్లు, రెండవ సంవత్సరం 15 వేలు, ఈ సంవత్సరం 25 వేలకు అప్పులు తెస్తున్నారు. ప్రాధాన్యత లేని వాటర్‌ గ్రిడ్‌ కోసం ఆక్సిస్‌ బ్యాంకు, హడ్కో, నాబార్డ్‌ ఇతర బ్యాంకుల నుంచి 40 వేల కోట్ల అప్పులు తెచ్చారు. ‘‘తాగునీరు కాదు సాగునీరు’’ కావాలని రైతులు అడుగు తుంటే ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చే విధంగా అవినీతి వాటర్‌ గ్రిడ్‌ పథకానికి వేల కోట్లు కేటాయిస్తున్నారు. ‘‘నాలుగు బిందెల నీళ్లు తెచ్చుకొని తాగుతాం కానీ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి’’ అని తల్లిదండ్రులు అడుగుతుంటే దానిని పట్టించుకోకుండా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే మరలా వచ్చే ఎన్నికలలో ‘‘ఓట్లు అడగమని’’ గోబె ల్స్‌ను తలదన్నేలా ఎదురు ప్రచారం చేస్తున్నారు.

ఇంకొకవైపు ప్రభుత్వ ఆస్తులు – భూములు వేలం వేస్తూ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూంలతో ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేస్తూ ప్రభుత్వ భూములను వేల కోట్లకు అమ్మడంలో ఏమైనా ఔచిత్యం ఉందా! ముందుచూపు లేకుండా ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుంది? ప్రభుత్వ భవనాలు, పాఠశా లలు, హాస్పిటల్స్, హాస్టళ్లు ఎలా నిర్మిస్తారు? కేసీఆర్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు అమ్మడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పుడు తాను చేస్తున్నదేమిటి?

పోలీసుల్ని ఉసిగొల్పి ప్రజా ఉద్యమాలను తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన నిరుద్యోగుల ఉద్యమ సంద ర్భంగా ఉద్యమాన్ని అణచివేయడానికి ఏసీపీ, సీఐ స్థాయి పోలీస్‌ అధికారులు కోచింగ్‌ సెంటర్లకు, లైబ్రరీలకు, హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమంలో పాల్గొనరాదని, పాల్గొంటే కేసులు అవు తాయి, ఉద్యోగాలు రావని బెదిరించారంటే ఎంతగా దిగజారారో అర్థమ వుతుంది. ఏ ఉద్యమాల ద్వారా తెలంగాణ వచ్చిందో మరిచిపోయారు. పోలీసులు ఇప్పుడు ఉద్యమాలకు, బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. నక్సల్స్‌పై ఎదురుకాల్పులు ఉండవన్నారు. కానీ ఎదురు కాల్పులు కాదు కదా, పట్టుకు పోయి దొంగ కాల్పులతో చంపుతున్నారు.

పత్రికలను, టీవీ చానల్స్‌ను భయపెట్టడం, ప్రలోభ పెట్టడం ద్వారా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఉద్యమ వార్తలు రాకుండా చేస్తున్నారు. ముఖ్య మంత్రి కార్యాలయంలో నలుగురు అధికారులతో ఒక ‘‘మానిటరింగ్‌ కమిటీ’’ ఏర్పాటు చేసి, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, ఉద్యమ వార్తలు రాకుండా పత్రికలపై, టీవీ చానల్స్‌పై ఒత్తిడి చేస్తున్నారు. వినక పోతే అడ్వర్టైజ్‌మెంట్స్‌ జారీ చేయకుండా ఆపుతామని బెదిరిస్తున్నారు. పత్రికలను, టీవీ చానల్స్‌ను బెదిరించి వాటిని లొంగ దీసుకుంటున్నారు. ప్రజాసమస్యలు, ఉద్యమ వార్తలు రాయొద్దని బెదిరి స్తున్నారు. ఈ వార్తలపై ప్రచ్ఛన్న నిషేధం విధించారు. తెలంగాణ ఉద్య మంలో సాంస్కృతిక విప్లవం సృష్టించిన కళాకారులను నోరు మూయించ డానికి 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నోటికి సంకెళ్లు వేశారు. ప్రజల గొంతుకై నిలిచే కళాకారులు ప్రభుత్వ నిర్బంధంలో చిక్కుకుపోయారు. కళాకారులు బయట ఉంటే ప్రజలను చైతన్యం చేస్తారనే కుట్రతో వారిని కాంట్రాక్టు ఉద్యోగాలలో బంధించారు.

అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా ప్రవర్తిస్తూ పాలిస్తున్నారు. ప్రజలను, ప్రజా సంఘాలను, నాయకులను చివరకు శాసనసభ్యులను కూడా కలవడం లేదు. ఇంటర్వూ్యలు లేవు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిరంకుశంగా ప్రవర్తించలేదు. ప్రతిరోజూ ఒక గంట ప్రజ లకు ధర్మదర్శనం ఇచ్చేవారు. కానీ కేసీఆర్‌ అధికారం చేపట్టిన ఈ రెండేళ్ల కాలంలో ఇంటర్వూ్యలు లేవు. సెక్రటేరియట్‌కు రారు. రాష్ట్ర సీఎం ప్రజ లను కలవకుండా వ్యవసాయ క్షేత్రంలో ఉండటం దేనికి చిహ్నం?

తెలంగాణ కోసం ప్రజలు పోరాడింది ముఖ్యంగా నిధులు, నియా మకాలు, నీళ్ల కోసమే.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఎంత సేపూ వేల కోట్ల కమీషన్లు వచ్చే మిషన్‌ భగీరథ, ఇరిగేషన్‌ కాంట్రాక్టుల మీద ధ్యాసే తప్ప మరేమీ లేదు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరు ద్యోగులు గత ఒక సంవత్సర కాలంగా ఉద్యమాలు చేయగా, రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉంటే కేవలం 15 వేల ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేశారు.

కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఇప్పటికే మూడవ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది. ఒక్క పాఠశాల కూడా ప్రారంభం కాలేదు. ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే టీచర్లను నియమించలేదు. ఇక కేజీ నుండి పీజీ గగన కుసుమమేనా! ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. ఏ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా తాను తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యారో ఆ ప్రక్రియను గౌరవించి,  కొనసా గించాలి. ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని కాపాడాలి. కేసీఆర్‌ ఆ దిశగా మారతారని, సుపరిపాలన అందిస్తారని ఆశిద్దాం.

వ్యాసకర్,త జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు :ఆర్‌. కృష్ణయ్య
మొబైల్‌ : 90000 09164

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement