ఉదారవాద ‘పీఠాధిపతులు’! | Shekhar Gupta Guest Column Writes About Democracy | Sakshi
Sakshi News home page

ఉదారవాద ‘పీఠాధిపతులు’!

Published Sun, Jun 24 2018 2:00 AM | Last Updated on Wed, Aug 15 2018 2:40 PM

Shekhar Gupta Guest Column Writes About Democracy

ఉదారవాద గురుపీఠానికి చెందిన అయతుల్లాలు, లేక ఆర్చిబిషప్‌లు అని ఈ వ్యాసానికి నేను శీర్షికను పెడినట్లయితే సరిగ్గా సరిపోవచ్చు. శంకరాచార్యులు ఎన్ని ప్రభోధాలు చేసినప్పటికీ వారు ఫత్వాలు మాత్రం జారీచేయరు. లేదా రంకెలేయరు కూడా.య కానీ ఈ రోజుల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఇలాంటి వ్యాఖ్యలు నేను చేశానంటే ఇరుపక్షాలూ నన్ను లక్ష్యంగా చేసుకోవచ్చు. విశ్వాసాలకు సంబంధించినంతవరకు ఛాందసులు, ఉదారవాదులు ఇరువురూ మైనారిటీలపై ఆరోపించడంలో సమాన స్థాయిలో ఉంటున్నారు. కాబట్టి, నేను నా సొంత హిందువుల వ్యవహారాలతో జోక్యం చేసుకుంటేనే ఉత్తమంగా ఉంటుంది.
 
నేను చేస్తున్న ఈ వాదన పైన చెప్పిన మహా విశ్వాసాలలో దేనిగురించో కాదు. మనుషుల చరిత్రలో (మానవజాతి అనే పదం నేను వాడటంలేదు) ఆవిర్భవిస్తున్న సరికొత్త మతం అంటే ఉదారవాద వ్యవస్థ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఇది కొత్త వ్యవస్థ కాబట్టి అనేక వైవిధ్యపూరితమైన ప్రయాసల గుండా ముందుకు వెళ్లాల్సి ఉంది. తన సొంత పవిత్ర గ్రంథం నుంచి కాస్త పక్కకు పోయినా ఈ కొత్త వ్యవస్థ కూడా సహించదు. షియా/సున్నీ అని కాదు, కాథలిక్‌/ప్రొటెస్టెంట్‌ అని కాదు, వైష్ణవులు/శైవులు అని కాదు. నువు నా పీఠానికి లేక నా అధికారానికి చెంది ఉంటే, దానికి నీవు పూర్తిగా విధేయుడవై ఉండాల్సిందే. ఎలాంటి మినహాయింపులు, రాయితీలు లేవు. మార్గం నుంచి కాస్త పక్కకు పోవడానికి లేదు. వారాంతాల్లో కూడా హాజరు కాకుండా ఉండటానికి లేదు. నువ్వు మాతో అయినా ఉండు, లేదా మాకు వ్యతిరేకంగా అయినా ఉండు. ఇలాంటి పంథాను గతంలో జార్జి బుష్‌ జూనియర్‌ నుంచి విన్నాం. కానీ తాను ఉదారవాది కాదు.

ఉదారవాది అంటే నిర్వచనం ఇదా?
నా ప్రశ్న ఏదంటే, ఏమాత్రం వెసులుబాటు లేని నిబంధనలను, ప్రవర్తనను, ప్రసంగాలను కలిగి ఉంటూ మీరు ఎలా ఉదారవాదిగా ఉంటారన్నదే. కాకపోతే ఇతరులకోసం మీరు రూపొందించిన కనీస ప్రవర్తనా నియమావళిని వివరించడానికి నన్ను ప్రయత్నించనివ్వండి. మొదటిది, నా నిబంధనల ప్రకారం లౌకికవాదిగా ఉండండి. ఆవిధంగా మీ మతధర్మాలను, దేవుళ్లను డంప్‌ చేయండి. రెండు, స్వేచ్ఛా–మార్కెట్, ప్రపంచీకరణ, క్రమబద్ధీకరణను తీసివేయడం, లేదా వ్యర్థమైన నయా ఉదారవాదపు సకల రోతలను ఆమోదించండి. రాజ్యవ్యవస్థను మీ పవిత్రమైన దేవతగా అంగీ కరించడమే కాకుండా దాన్ని మరింత పరిపూర్ణంగా రూపొందించడంలో మాకు సహా యం చేయండి. కార్పొరేట్‌ సంస్థలు మొత్తంగా దొంగలని చెప్పండి. అదే సమయంలో కార్పొరేట్‌ సంస్థలు, గజదొంగలు కాకపోతే పవిత్ర సంస్థలన్నింటికీ  నిధులు సమకూర్చిపెట్టేది ఎవరు అనే ప్రశ్న మాత్రం నన్ను అడక్కండి. దానికి ప్రతిఫలంగా ఫోర్డ్, రాక్‌ ఫెల్లర్, బిల్‌ – మెలిందా గేట్స్, మెకార్థర్, ఇన్‌లేక్స్, టాటా వంటి పవిత్రవాద సంస్థలన్నీ నాకు చాలినన్ని నిధులు ఇస్తారు. అంతే కానీ మీ నయా ఉదారవాద వ్యాపార సంస్థలు ఇవ్వవు.

అలాగే అన్ని రకాల డ్యామ్‌లు, విద్యుత్‌ సంస్థలు, గనులు, పురుగుమందులు కంపెనీలను మొత్తంగా మీరు కచ్చితంగా వ్యతిరేకించాలి మరి. మూర్ఖపు అమెరికన్‌లు ట్రంప్‌ భూతాన్ని ఎన్నుకున్నారనే విషయాన్ని మీరూ ఆమోదించండి. కానీ పుతిన్, గ్జి జిన్‌పింగ్‌ ఈ జాబితాలోకి రారు. వీళ్లను ఎన్నుకున్నందుకు గాను ఆ దేశాల ప్రజలను కనీసంగా అయినా మీరు తప్పుపట్టరు. ప్రభుత్వం ఘనమైనదే కానీ ఎన్జీవోలే మెరుగైనవి. ప్రైవేట్‌ సెక్టర్‌ నియంత్రణలో ఉంది కాబట్టి సైన్స్‌ కూడా ప్రమాదకరమైనదే. ఇకపోతే మానవజాతికి అతి గొప్ప ప్రమాదం ఏదంటే జన్యుపరంగా మెరుగుపర్చిన ఆహార పదార్థాలే. ఈ తరహా షరియత్‌ ఆంక్షలను కాదని ఏమాత్రం పక్కకు పోయినా సరే మీరు దుష్ట కార్పొరేట్‌ సంస్థలు, అమిత్‌ షా లేక ఈ ఇద్దరినుంచి డబ్బులు పుచ్చుకుంటున్న ఉదారవాద వ్యతిరేక పందులుగా మిగిలిపోతారు. అందుకే సంక్షిప్త సందేశం ఏమిటి: ఉదారవాదిగా ఉండు, కానీ నా మార్గంలో, కచ్చితంగా నేను చెప్పినట్లుగా మాత్రమే పాటించు.

నేర నిర్ధారణకు ముందే ఉరి తీయండి
అమిత్‌ షా గురించి మేం చెప్పలేదా? న్యాయమూర్తి లోయా ఉదంతాన్ని జడ్జి లోయా వివాదాస్పద మృతిగా మీరు వర్ణించి దానిపై న్యాయబద్ధమైన దర్యాప్తును చేపట్టాల్సిందిగా కోరినట్లయితే నా పవిత్ర మార్గం నుంచి పక్కకు వెళ్లినట్లే. నిజమైన ఉదారవాది సరైన భాషను ఉపయోగిస్తాడు. న్యాయమూర్తి లోయా మృతిని చూద్దాం. ఆయన ఎలా చనిపోయారో దర్యాప్తు చేసి సమయం వృధా చేసుకోవడం ఎందుకు? ఆయన చనిపోయిన విషయం, ఎవరు చంపారు అనేది కూడా మీకు తెలుసు. ఈ ఆరోపణలన్నింటినీ బలమైన దారాలతో ముడివేసి అమిత్‌షాను ఉరి తీయండి. ఈ ఆరోపణలకు మీరు దూరంగా ఉండవచ్చు. అప్పుడు మీరు అమిత్‌ షా భయంకర లక్షణాలను కలిగి ఉన్నట్లే మరి.

మిగతావారు సహజంగానే అనుసరిస్తారు. మీరు మేధావి అయినట్లయితే, సోషల్‌ మీడియా మిమ్మల్ని ప్రభావశీలురిగా పేర్కొన్నట్లయితే, మీరు మాట్లాడే ప్రతి మాటా మీకు వ్యతిరేకంగానే నిలుస్తుంది. చివరగా, మీరు సంపాదకులయినట్లయితే, మీరు పిలిచే ప్రతి న్యూస్‌ రూమ్‌ కాల్‌కి గాను మీపై విచారణ జరుగుతుంది. ఉదారవాద శంకరాచార్యులు, స్వయం ప్రకటిత పవిత్రుల్లో కెల్లా అతిపవిత్రులు మిమ్మల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంటారు.

పోయిన బుధవారం దిప్రింట్‌.ఇన్‌ లో ముంబైకి చెందిన రూపా సుబ్రహ్మణ్య కథనాన్ని ప్రచురించాం. ఆవిడ ఒక ఆర్థికవేత్త, దృఢమైన ట్విట్టర్‌ యుద్ధవీరురాలు. గత అయిదేళ్లుగా, ఆమె నరేంద్రమోదీకి అత్యంత మద్దతుదారుగా ఉంటూవస్తున్నారు. ఎవరైనా మోదీని విమర్శించినట్లయితే ఇక వారిని ఆమె క్షమించే ప్రసక్తే లేదు. ఈ రచయితను కూడా ఆమె వదిలిపెట్టలేదు. ఆమె ఇప్పుడు తనకు మోదీ పట్ల భ్రమలు ఎలా తొలిగిపోయాయో చెబుతూ మాకు ఒక కథనం పంపారు. ఆర్థిక సంస్కరణలు చేపడతాననీ, మత దురభిమానాన్ని, ఆర్థికవ్యవహారాల్లో ప్రభుత్వ పెత్తనానికి అవకాశం ఇవ్వనని మోదీ ఇచ్చిన హామీవల్లే తాను ఆయన్ని సమర్థిస్తూవచ్చానని రూపా వివరించారు. నిజంగా కూడా ఆమె రచన చక్కటి వాదనా పటిమతో రూపొందింది.
 
ఊహించినట్లుగానే ఆమె వ్యాసం బీజేపీ నుంచి తీవ్ర అపనిందలను, దూషణలను ఎదుర్కొంది. విద్రోహిగా మారినందుకు ఆమెను, ఆమె  విద్రోహాన్ని మా ఎజెండాను పరిపూర్తి చేసుకోవడానికి ఉపయోగించుకున్నందుకు మమ్మల్ని కలిసికట్టుగా తూర్పారబట్టారు. అనూహ్యంగా స్వయం ప్రకటిత ఉదారవాద ప్రత్యర్థులు కూడా దీనిపై కారాలూ మిరియాలూ నూరారు. ఒకప్పుడు మితవాద కోణంగి (ట్రోల్‌)లా వ్యవహరించిన రూపాకు మేం వేదిక ఎలా ఇచ్చాం? ఆమెకు గౌరవం ఆపాదిస్తు మా గౌరవాన్ని ఎలా తగ్గించుకుంటాం? న్యూస్‌ రూమ్‌ అనేది కోర్టు కాదని, పోలీసు స్టేషన్‌ అసలే కాదనే మా వాదనను ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అవివేకపు, బుద్ధిహీన గతం పట్ల ఆమె ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు, పైగా మన క్షమాపణను ఆమె గెల్చుకోలేదు మరి.

ఇతరులకు మాత్రమే నిబంధనలా?
ఇప్పుడు ఇది అయోమయానికి దారతీస్తోంది. ఉదారవాదం అంటే ఇతరులకు నిబంధనలు రూపొందించి వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందిగా చెప్పడం కాదు. లేక, మీరు నాకోసం నిబంధనలను రూపొందించినట్లయితే, సత్ప్రవర్తనా నియమావళి అనేది ఎలా ఉంటుందో, మీరు ఆమోదించదగిన ప్రవర్తన ఏదో మీరు నిర్వచిం చాల్సి ఉంది. మీరు ఉదారవాది కాదు. మీరు శీలవంతులే అయి ఉండవచ్చు. నాకంటే మంచి వ్యక్తి కావచ్చు, బహుశా గోవు కంటే పవిత్రమైన వ్యక్తి కావచ్చు. కానీ మీరు ఉదారవాది కాదు. మీరు ఒక అయతుల్లా వంటివారు. క్రీస్తు మతాధిపతి వంటివారు లేక శంకరాచార్యులు కావచ్చు. మీ దండాన్ని మీరు తీసుకుని ఇతరులు ఎలా ప్రవర్తించాలో, ఏం చెప్పాలో, దేన్ని ప్రచురించాలో ఆదేశాలు జారీ చేసేస్తారు. కానీ ఒక ప్రత్యేక ఇజాన్ని అంటే జర్నలిజాన్ని విశ్వసిస్తున్న మాలాంటి వారికి ఇది పెద్ద సవాలుగానే ఉంటుంది.

సరిగ్గా మూడేళ్ల క్రితం, ఒక అమెరికన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థిని తాను విశ్వసిస్తున్న ఉదారవాదంపై చిన్నపాటి యుద్ధమే చేసింది. కానీ తన విశ్వాసం కారణంగా ఆ యుద్ధంలో ఓడిపోయింది. దీని వివరాలకోసం హలోవెన్, సిల్లిమన్‌ కాలేజ్, యేల్‌ యూనివర్శిటీ అన్న సెర్చ్‌ పదంతో గూగుల్‌లో వెతకండి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ రెసిడెన్షియల్‌ కాలేజీలోని కొంతమంది విద్యార్థులు ఆల్‌ సెయిట్స్‌ డే సందర్భంగా ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అంటూ తలకుమించిన ఆంక్షలు విధిస్తున్నారంటూ (ఇలా దుస్తులు ధరించొద్దు, దానివల్ల ఒక సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతింటాయి) వారి మాస్టర్, ఆయన సహోద్యోగి, ఆయన భార్యపై ఆరోపణలు గుప్పించారు. ప్రొఫెసర్‌ ఎరికా క్రిస్టకిస్‌ ఈ సందర్భంగా సరదాగా గడపండి అంతే కానీ అతిశయించిన రాజకీయ సవ్యమార్గం గురించి పట్టించుకోవద్దని అందరిగీ చిలిపి ఈమెయిల్‌ పంపారు. ఇది ఉదారవాద విద్యార్థి బృందాల్లో ఆగ్రహం రగిలించి నిరసనలకు దారితీసింది. అధ్యాపకుడు నికోలస్‌ క్రిస్టకిస్‌ను ఒక విద్యార్థి నేరుగా ప్రశ్నించిన దృశ్యం కెమెరా కంటపడింది. ‘‘ఇలాంటి ఆంక్షలను మీరు ఎలా అంగీకరిస్తారు? నిన్ను ఉద్యోగంలోకి తీసుకొచ్చిన వెధవ ఎవరు? వెంటనే ఉద్యోగం మానేయి! నీవు రాత్రి పూట నిద్రపోకూడదు!అసహ్యం కలిగిస్తున్నావు!’’

రాజకీయ పరిశుద్ధత తెచ్చి పెట్టే ఇక్కట్లు
ఒక నిమిషం 20 సెకన్ల పాటు సాగిన ఆ వీడియో దృశ్యం ఫాక్స్‌ న్యూస్‌లో వచ్చింది. అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న శ్వేత అమెరికన్లను ఇది మరింతగా మండిం చింది. ఉదార వాద రాజకీయాల పరిశుద్ధతకు ఇది అతిశయించిన రూపమని వారు ఆరోపించారు. అది ‘అప్రసిద్ధమైన’ ఉదారవాద ఈస్ట్‌ కోస్ట్‌ క్యాంపస్‌ అని ఆగ్రహించి నది నల్లజాతికి చెందిన విద్యార్థిని అని ప్రత్యేకించి చెప్పడంద్వారా ఒరిగిదేమీ లేదు. ట్రంప్‌ ఎన్నికకు ఈ ఉదంతం మార్గం కల్పించిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఈ సందర్భంగా ఎరికా క్రిస్టకిస్‌ వాషింగ్టన్‌ పోస్ట్‌కు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘‘అక్టోబర్‌ 31 రాత్రి హలొవిన్‌ సందర్భంగా నేను పంపిన ఈమెయిల్‌ క్యాంపస్‌ను మండించింది. ఇది స్వయం సెన్సార్‌షిప్‌కు సంబంధించిన చక్కటి గుణపాఠం’’ దీనిపై ఆమె మరింతగా వివరిస్తూ, ‘‘స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మన దేశం లోని అతి గొప్ప విశ్వవిద్యాలయాలు కొన్నింటిలో వెలిగిపోతూండవచ్చు. కానీ ఇతరులు చెప్పేది వినాల్సిన సంస్కృతిని కాస్త చక్కదిద్దాల్సి ఉంది’’ అని ముగించారు.

మరింత ముందుకెళ్లి ఇప్పుడు ట్రంప్‌పై సెమినార్లలో, పబ్‌లలో, కాఫీ షాపుల్లో, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలోనే కాకుండా మీ టీ షర్టులపై కూడా ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేయండి. రాబర్ట్‌ డి నీరో వంటి సుప్రసిద్ధ వ్యక్తి లాగా ట్రంప్‌ గురించి దూషణ భూషణలకు దిగి జనంచే చప్పట్లు కొట్టించుకోండి. భారతదేశంలో మోదీ పట్ల కూడా మీరు ఇలాగే వ్యవహరించవచ్చు. ఫలితం మాత్రం ఒకేవిధంగా ఉంటుంది. అలా విమర్శించడం ద్వారా, దూషించడం ద్వారా, గేలి చేయడం ద్వారా ట్రంప్, మోదీ వంటి వారి పునాది మరింత బలపడుతుంది. ఎందుకంటే మీరు చేసే ఇలాంటి దూషణలు, ఖండనమండనలు ఉదారవాద వ్యతిరేక మితవాదులు విజయవంతంగా నిర్మిస్తూవస్తున్నట్లుగా ట్రంప్, మోదీ వంటివారిని బాధితులుగా మార్చివేస్తాయి. అలాంటి పరిణామానికి మీవంటివారి సహాయం కూడా లభిస్తున్నట్లే మరి.

విశ్వాసులు అధికారాన్ని కట్టబెట్టలేరు
వర్గాలుగా విడిపోయిన ప్రజాస్వామిక వ్యవస్థల్లో అధికారాన్ని ఎవరు గెల్చుకుంటారు అనే అంశాన్ని రెండు పక్షాలలోని నిజమైన విశ్వాసుల సంభాషణ నిర్థారించదు. ఈ రెండు పక్షాలకు చెందని వారే నిజంగా అధికారాన్ని కట్టబెడుతుంటారు. ఇలాంటివారందరినీ మీరు బుర్రతక్కువవారనీ, నాగరికత తెలీనివారని, నిరక్షర కుక్షిలని, ఉదారవాద రహిత క్షుద్రులని మీరు మీవైన తీర్పులు చెబుతున్నప్పటికీ, వాళ్లు మాత్రం మీకూ, మీ వ్యతిరేక పక్షం వారికి మధ్య ఎలాంటి వ్యత్యాసాన్నీ చూడలేరు. వారు కచ్చింతగా మీకు దూరమౌతారు. లేక మీరు వారిని కోల్పోతారు. అలాగే మీ ప్రత్యర్థి పక్షం వారు సైతం క్షమాపణ అన్నదే ఎరుగని జాతీయవాదంపైవు కొట్టుకుపోతారు. అంతిమంగా ఇది యావత్‌ ప్రజానీకానీకి ఉపద్రవం కలిగించక మానదు.

కాబట్టి, తమకు తాము ఉదారవాదులుగా పిలుచుకుంటున్నావారు తమ పరిధిని కాస్త విస్తరించుకోవాలి. ఉష్ట్ర పక్షిలాగా తమలో తాము కూరుకుపోవడం కాకుండా తమ చోటును ఇతరులకు కూడా కాస్త పంచిపెట్టాలి. అలా కాకుండా దానికి భిన్నమైన మార్గంలో వెళితే గోతులు తీసి గోడలు కడతారు కానీ ద్వీపం మాత్రం ఒరుసుకునిపోతుంది. అందుకని, మనలో చాలామంది ఎరికా క్రిస్టకిస్‌ చెప్పినట్లుగా ఇతరులు చెప్పింది వినడం అనే సంస్కృతికి మరమ్మతులు చేయాల్సి ఉంది.

వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement