ఆంధప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ ధోరణులు సాగుతున్నాయా? అన్న ప్రశ్న ఇక్కడి వాతావరణాన్ని గమనించేవారి కందరికీ తలెత్తుతుంది. రాష్ట్రపతులు, గవర్నర్లు, స్పీకర్లు మొదలైనవారు పార్టీలకు అతీతంగా హుందాగా రాజ్యాంగ తదితర సంక్షోభాలు తలెత్తినప్పుడు తండ్రిలా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో పరిస్థితులు-రాజకీయాల్లో హుందాతనం కొరవడినట్లు సూచిస్తున్నాయి. స్పీకర్ నిష్పాక్షికంగా గాక, అధికార పక్షం ప్రతినిధిగా వ్యవహరిస్తుండటం దురదృష్టకరం.
మన రాష్ట్ర విభజన విషయంలో కూడా అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నిష్పాక్షికంగా కాక అప్పటి అధికార పక్షానికి దన్నుగా నిలబడి అపఖ్యాతి పాలయ్యారు. మరి లోక్‌సభలో ఆమెక్కూడా పెప్పర్ స్ప్రే ఘాటు తగిలింది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌కి- రోజాకు మధ్య వివాదం దానితో పోలిస్తే తక్కువే గదా! మరి అలాంటప్పుడు ఇంత రాజీలేని ధోరణి, న్యాయస్థానాల ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసే పరిస్థితి చూస్తుంటే న్యాయమూర్తులు అన్నట్లు ‘‘ఏపీలో అసలేం జరుగు తుంది? - సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్!!’’
ఎమ్మెల్యే రోజా ‘సారీ’ చెప్పాలని పట్టుబట్టే వారికి ఒక మౌలి కమైన విషయం అర్థం అవ్వాలి, కోర్టు మధ్యంతర ఉత్తర్వుల దృష్ట్యా ఆమెను సభలోకి అనుమతించి ఉన్నట్లయితే, ఆమె జరిగిన దానికి మర్యాద పూర్వకంగా ‘సారీ’ చెప్పి వుండేవారు కదా! మరికొందరు విపక్ష సభ్యులు వాడిన అన్ పార్లమెంటరీ భాష, హావభావాలను గురించి కూడా ఆమె మాట్లాడేవారు, మరి ప్రతిపక్ష నేతనుద్దేశించి ముఖ్యమంత్రి, అధికార పక్షం మంత్రులు, సభ్యులు ఉపయోగించిన పదజాలం కూడా అన్‌పార్లమెంటరీనే గదా! అంటే ఒకరికొకరు ‘సారీ’ చెప్పుకోవడం కంటే వీరంతా ప్రజలకు ‘సారీ’ చెప్పాల్సి ఉంటుంది.
కొత్త చీర, ఓ పెద్ద కరెన్సీ నోటు కోసం రాత్రంతా ఎదురుచూసి ఓటును అమ్ముకునేవారున్నంత కాలం చట్టసభలు కూడా ఇలాంటి వారికి దర్పణంగా మాత్రమే ఉంటాయనటానికి మన ప్రస్తుత రాజకీయాలు నిదర్శనం. ‘వోట్ ఫర్ నోట్’తోపాటు, రాజకీయ బేరసారాల గురించి మనం ఎన్నికలు అయిపోయాక కూడా వింటున్నాం కదా. రాష్ట్రంలో ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొనేసుకుంటున్న వైనం చూసి జాతీయ నేతలు విస్తుపోతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని ఘోర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచుగా మన మెక్కడికి పోతున్నాం అంటుంటారు. ఆయన ఇదే ప్రశ్నను తనపై తాను వేసుకుంటే అందరికీ మంచిది.
- డాక్టర్ టి. రామదాసు, సీనియర్ వైద్యులు
మొబైల్: 7675958696
నీటి దిగుమతి తప్పదా?
నేడు దేశంలో ఎటు చూసినా దాహపు కేకలే, కరవు నీడల్లో, అడుగంటిన నీటి జాడల్తో దేశంలో సింహభాగం అల్లాడుతోంది. అధికార గణాంకాల మేరకు తొమ్మిది రాష్ట్రాలు కరువుబారిన పడ్డాయి. తొంబై ఒక్క పెద్ద జలాశయాలలో నీరు అడుగంటింది. తొమ్మిది జీవనదులు ఒట్టిపోయాయి. లాతూర్ ప్రాంతానికి తాగునీటిని ప్రభుత్వం రైళ్ల ద్వారా పంపిణీ చేయాల్సిన దుర్గతి దాపురించింది. శక్తివంతమైన క్రికెట్ పోటీలు కూడా నీటి ఎద్దడి మేరకు వేరే ప్రాంతాలకు వలసపోవడం తప్పనిసరైంది. వీటన్నింటిని మించి భారతదేశంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటుతున్నాయి. తలసరి నీటి లభ్యత 1950లలో మనిషికి ఐదువేల క్యూబిక్ మీటర్లుండగా నేడది పదిహేను వందల క్యూబిక్ మీటర్లు. కనీస స్థాయి పదిహేడు వందల మేరకు లేకపోతే ఆ దేశాన్ని నీటి ఎద్దడి దేశంగా గుర్తిస్తారు.
అధికారికంగా ఇక మన దేశం ప్రమాదంలో ఉన్నట్టే కనుక భారత సమాజం కళ్లు తెరవాల్సిన సమయం. వాస్తవాన్ని గుర్తెరిగి నష్ట నివారణకు నడుం బిగించాల్సిన సందర్భం. ఇప్పుడు దేశంలో ‘సుజల భారత్’ ఉద్యమం అవసరం. అందుకు ప్రధానమంత్రి నడుం బిగించి దేశ ప్రజలను నడిపిం చాల్సి ఉంది. విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడివెయ్యడం, ఉపరితల జలాలను వృథాపర్చడం నియంత్రించాలి. నీటి పొదుపు, నీటి నిల్వ నిర్వహణ శాస్త్రీయంగా, సమర్థవంతంగా జరగాలి. ఈ అల వాట్లను వ్యక్తి స్థాయి నుండి వ్యవస్థ స్థాయి వరకూ పాదుకొల్పాలి. ప్రభుత్వం, పౌర సమాజం, మీడియా, యంత్రాంగం, ప్రజానీకం చిత్తశుద్ధితో కదలాల్సిన అత్యవసర పరిస్థితి, ఉదాసీనత వహిస్తే నీరు కూడా దిగుమతి చేసుకోవాల్సిన దినుసుల లిస్టులో చేరడం ఖాయం.
- డాక్టర్ డీవీజీ శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం
అంబేడ్కరీయం
భారతీయుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, విశ్వ మేధావి డాక్టర్ బి.ఆర్ . అంబే డ్కర్ 125వ జయంత్యుత్సవం సందర్భంగా తెలుగు రక్షణ వేదిక కవితాంజలి సమర్పి స్తోంది. పొట్ల్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ‘అంబేద్కరీయం’ పేరుతో ఆ మహనీ యుడిపై కవితా సంకలనం తీసుకురాదలి చాము. అంబేద్కర్ భావజాలం, ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను ఆవిష్కరిస్తూ కవిత లను పంపవలసిందిగా కవులను ఆహ్వా నిస్తున్నాము. మీ కవితలు 12 నుంచి 27 పంక్తులకు మించరాదు. కవిత స్వంతమేనని హామీపత్రం జతచేసి పంపాలి. కవితలను telugupaluku@yahoo.com కి 1-5-2016 లోగా పంపగలరు. అందరికీ ఆహ్వానం. సంపాదకవర్గం: డాక్టర్ కత్తిమండ ప్రతాప్ (90003 43095), జాబిలి జయచంద్ర, అనిల్ డ్యాని, బొడ్డు మహేందర్
పొట్లూరి హరికృష్ణ
జాతీయ అధ్యక్షులు, తెలుగు రక్షణ వేదిక
ప్రజాస్వామ్యం ఎటుపోతోంది?
Published Wed, Apr 27 2016 1:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement