సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కు తీసుకోవాల్సిందేనంటూ కోస్తా, రాయలసీమకు చెందిన ఎంపీలు మరోసారి లోక్‌సభను స్తంభింపజేశారు. అయిదు రోజుల సస్పెన్షన్ ముగియడంతో శుక్రవారం తిరిగి లోక్‌సభకు హాజరైన ఎంపీలు రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలనే ఆందోళనను కొనసాగించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా మధ్యంలోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో లోక్‌సభను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. స్పీకర్ మీరాకుమార్ ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టగానే టీడీపీకి చెందిన సభ్యులు కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి పోడియం వద్దకు చేరుకొచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు మాత్రం సభామధ్యం అంచుల వద్ద నిలబడి నినాదాలు చేశారు. వీరికితోడు తమిళ జాలర్లపై శ్రీలంక సైన్యం దాడులను నిరసిస్తూ అన్నా డీఎంకే సభ్యులు కూడా వెల్‌లోకి రావడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పడు కూడా టీడీపీతోపాటు కాంగ్రెస్ సభ్యులు కూడా వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. బీహార్, యూపీ వరదలపై ఆర్జేడీ సభ్యులు పోడియం వద్దకు రావడంతో మరోసారి సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ మొదలైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మూడు గంటల వరకూ వాయిదా వేసి సీమాంధ్ర ఎంపీలనందరినీ మరోసారి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం లోక్‌సభ సచివాలయ అధికారులు సభ ను అడ్డుకుంటున్న సభ్యుల జాబితాను సిద్ధం చేశారు. అయితే, 3 గంటలకు సభ సమావేశమైన తర్వాత చివరి నిమిషంలో ప్రభుత్వం మనసు మార్చుకుని సస్పెన్షన్లను సోమవారానికి వాయిదా వేయాలని సూచించింది. దీంతో సభను వచ్చే సోమవారానికి వాయిదావేశారు. రాజ్యసభలో కూడా టీడీపీకి చెందిన సభ్యులు వై.ఎస్.చౌదరి, సి.ఎం.రమేష్‌లు సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు ముద్రించి ఉన్న చొక్కాలు ధరించి సభామధ్యంలో కొంతసేపు ప్లకార్డులను ప్రదర్శించారు. మధ్యాహ్నం వారు ఆందోళన విరమించడంతో సభ సజావుగా సాగింది.
లోక్‌సభను స్తంభింపజేసిన సమైక్యగళం
Published Sat, Aug 31 2013 2:48 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement