371(డి)పై సుప్రీంలో సీఎం రమేష్ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకుని ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక రక్షణగా ఉన్న 371(డి) ఆర్టికల్‌పై తేల్చాలని కోరుతూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రానికి సంక్రమించిన ప్రత్యేక రక్షణ ఏర్పాటు ఈ 371(డి) అని, దీనికోసం పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించారని తెలిపారు.
విభజించాలనే ఆలోచన ఉంటే ముందుగా 371(డి)ని రాజ్యాంగ సవరణ ప్రక్రియ ద్వారానే తొలగించాలని, ఆ తర్వాతే ఏ అడుగులైనా వేయాలని అన్నారు. పిటిషన్‌కు సంబంధించి సుప్రీంలో తన తరఫున సీనియర్ న్యాయనిపుణులైన సొలిసొరాబ్జీ, గోపాల సుబ్రహ్మణ్యం, అశోక్‌భాన్‌లు వాదనలు వినిపిస్తారని తెలిపారు. కాగా రాష్ట్ర విభజన ప్రకియను నిలిపేయాలంటూ సీమాంధ్ర నుంచి కొన్ని గ్రూపులు, కొందరు వ్యక్తులు విడివిడిగా 4 పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.