పెద్దల సభలో వాయిదాల పర్వం | Both houses of Parliament repeatedly adjourned | Sakshi
Sakshi News home page

పెద్దల సభలో వాయిదాల పర్వం

Published Thu, Feb 20 2014 3:33 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Both houses of Parliament repeatedly adjourned

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో ఆందోళన కొనసాగుతోంది. బిల్లు రాబోతోందని సభా వ్యవవహారాల సప్లిమెంటరీ ఎజెండాలో ఉండటంతో రోజంతా ఉత్కంఠతో సాగింది. ఉదయం 11 గంటలకు తొలుత రాజ్యసభ ప్రారంభం కాగానే.. చైర్మన్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అప్పటికే సీమాంధ్ర సభ్యులు కె.వి.పి.రామచంద్రరావు, సుజనాచౌదరి, సి.ఎం.రమేశ్‌లు వెల్‌లో ఆందోళనకు దిగారు. బుధవారం లోక్‌సభలో జరిగిన తీరును ఖండిస్తున్నామంటూ ఎస్‌పీ సభ్యుడు ప్రస్తావించగా.. మరో సభ గురించి ఇక్కడ ప్రస్తావన తేవద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ దశలో సభ అదుపు తప్పటంతో వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు.
 
తిరిగి సమావేశం కాగానే.. టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ చైర్‌లో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ వద్ద నుంచి కాగితాలు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో మంత్రులు పలు నివేదికలు ప్రవేశపెట్టారు. కొద్దిసేపటికి ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఈనెల 18న ఆమోదం తెలిపింది. దాన్ని సభ ముందుంచుతున్నాను..’ అని రాజ్యసభ సెక్రటరీ జనరల్.. లోక్‌సభ నుంచి వచ్చిన సందేశాన్ని చదివి వినిపించారు. ఆ సమయంలో సి.ఎం.రమేశ్ సెక్రటరీ జనరల్ నుంచి కాగితాలు లాగి చింపేయటానికి ప్రయత్నించారు. వెంటనే డిప్యూటీ చైర్మన్ ‘సిబ్బందిపై దాడిచేయబోవడం సరికాదు.. ఇది దురదృష్టకరం..’ అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక.. ‘సభ్యుడు రమేశ్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరం.. ’ అంటూ ఆయనపై చర్య తీసుకోబోతున్నట్లు డిప్యూటీ చైర్మన్ చెప్పబోయారు. అయితే విపక్షాలు అభ్యంతరం చెప్తూ రమేశ్‌కు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరాయి. దీంతో రమేశ్ లేచి సభకు క్షమాపణలు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పేపర్లు గుంజుకోలేదని, భావోద్వేగంతోనే అలా జరిగిందన్నారు. దీంతో ఆయనపై చర్య తీసుకోవటం లేదని కురియన్ ప్రకటించారు. అనంతరం సి.ఎం.రమేశ్, సుజనాచౌదరి, కేవీపీలు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. వారికి మద్దతుగా కేంద్రమంత్రి చిరంజీవి కూడా తన స్థానంలో లేచి నిల్చున్నారు.
 
 సెక్రటరీ జనరల్‌ను తోయలేదు: రమేశ్
 రాజ్యసభలో బిల్లును టేబుల్ చేసే సమయంలో చించేశానని.. అంతేకానీ, సెక్రటరీ జనరల్‌ను తాకడం, తోయడం లాంటి ఘటనలేవీ జరగలేదని రమే్‌శ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనను సస్పెండ్ చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. రాజ్యసభ సజావుగా నడిచి సీమాంధ్రుల సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో కూడా టీవీ ప్రసారాలు నిలిపేసి బిల్లును ఆమోదించాలనే ప్రయత్నాలను మానుకోవాలని చైర్మన్‌కు చెప్పామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement