మా హయాంలోనే టి-బిల్లు
* హోం మంత్రి షిండే స్పష్టీకరణ
* ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెడతారా అంటే సమాధానం దాటవేత
* పార్లమెంట్లో బిల్లు ఆమోదంపై నేనేం మాట్లాడలేను
* మాకిచ్చిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తాం
* ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పరిధిపై అనేక ప్రతిపాదనలు వచ్చాయి.. పరిశీలిస్తున్నాం
* 371డిపై జీవోఎం సిఫార్సుల మేరకే ప్రభుత్వ చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత యూపీఏ ప్రభుత్వ హయాం 2014లో ముగిసేలోగానే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. అయితే, ఈ బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెడతారా లేదా అనే అంశంపై ప్రశ్నలకు ఆయన స్పష్టంగా బదులివ్వలేదు. ‘‘బిల్లు వస్తుంది, మా హయాం ముగిసేలోగానే...’’ అని మాత్రమే చెప్పారు. షిండే సూటిగా చెప్పకపోవడంతో శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. హోంశాఖ నెలవారీ నివేదిక విడుదల కోసం ఢిల్లీలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో షిండే రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు ప్రశ్నలకు బదులిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగం ప్రకారం బిల్లును పార్లమెంట్లో పెడతామని, అక్కడ ఆమోదం పొందే అంశంపై తానేం మాట్లాడలేనని అన్నారు. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే టీ-బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. విభజనపై కేబినెట్ తమకు అప్పగించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి మంత్రుల బృందం(జీవోఎం) ప్రయత్నిస్తోందని షిండే అన్నారు. ఎప్పటిలోగా బిల్లు అసెంబ్లీకి వెళ్తుందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘‘ప్రక్రియ నడుస్తోంది. ఇది కాగానే మేం కేబినెట్‌కు నివేదిస్తాం. అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి నుంచి బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వెళ్తుంది’’ అని చెప్పారు.
రాష్ట్ర విభజనకు తాను అంగీకరించలేదని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘‘చూడండి... సీఎం ఇప్పటివరకు నన్ను కలవలేదు. ఆయన కలిసినపుడు, నేను మాట్లాడతాను’’ అని అన్నారు. విభజనకు ముందు పలు సమస్యలను పరిష్కరించడం అవసరమని, ఇప్పటివరకూ వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ జీవోఎం పరిశీలిస్తుందని చెప్పారు. గతంలో పలుమార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించామని, మంగళ, బుధవారాల్లో మరోసారి జరుపుతున్నామని, అందులో అన్ని పార్టీలతో అనేక అంశాలపై చర్చిస్తామని, పార్టీల అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 18న రాష్ట్రానికి చెందని కేంద్ర మంత్రులతో సమావేశమవుతామని వెల్లడించారు.
హైదరాబాద్‌పై పలు ప్రతిపాదనలు..
హైదరాబాద్‌పై అనేక ప్రతిపాదనలు జీవోఎం ముందుకు వచ్చాయని, వాటన్నింటినీ జీవోఎం పరిశీలిస్తోందని షిండే చెప్పారు. ఆర్టికల్ 371డీ విషయంలో జీవోఎం సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వ చర్యలు ఉంటాయని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. హైదరాబాద్‌లో ఏ పరిధివరకు ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తారని ప్రశ్నించగా, రెవెన్యూ జిల్లావరకు పరిగణించాలని, కమిషనరేట్‌నే తీసుకోవాలని రకరకాల ప్రతిపాదనలు, అభిప్రాయాలు తమ ముందుకు వచ్చాయని, వాటిని తాము పరిశీలిస్తున్నామన్నారు. ఈ విషయంలో శ్రీకృష్ణ కమిటీ కూడా పలు ప్రతిపాదనలు చేసిందని, ప్రతి అంశాన్నీ జీవోఎం పరిశీలిస్తోందని చెప్పారు. శాంతిభద్రతలను కొంత కాలంపాటు కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకునే ఆలోచన ఉందా అని అడగ్గా, ఈ విషయం ఇంకా పరిశీలనలోనే ఉందని, తుది నిర్ణయం తీసుకోలేదని ఆయనన్నారు.
కార్యదర్శులతో అన్నీ చర్చిస్తున్నాం..
కేంద్ర మంత్రిత్వశాఖల కార్యదర్శులతో జీవోఎం పలు సమస్యలపై సవివరంగా చర్చిస్తోందని షిండే తెలిపారు. చర్చలు ఎంతవరకు వచ్చాయనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘‘తెలంగాణ, ఆంధ్ర... రెండు ప్రాంతాలకు చెందిన సమస్యల్ని జీవోఎం పరిశీలిస్తోంది. నీళ్ల సమస్య ఉంది. విద్యుత్ సమస్య ఉంది. విద్యారంగం సమస్య ఉంది. ఆర్థికాంశాలు ఉన్నాయి. ఇంకా ఇతర సమస్యలున్నాయి.
వీటన్నింటినీ నిశితంగా చూడాల్సి ఉన్నందున జీవోఎం విధివిధానాలకు లోబడి నివేదికలివ్వాలని ఆయా మంత్రిత్వశాఖలను మేం లోగడ కోరాం. ఆ మేరకు ఆయా శాఖలు నివేదికలు ఇచ్చాయి. అయితే మరింత లోతుగా సమస్యల్ని పరిశీలించి అర్థం చేసుకోవడం కోసం ఆయా శాఖల కార్యదర్శులను మాతో సమావేశానికి ఆహ్వానించాం. ఈరోజు వారితో మాట్లాడాం... ఇచ్చిన నివేదికల్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం’’ అని అన్నారు. బిల్లు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్తుందని మళ్లీ అడగ్గా, ‘‘నేను ముందు చెప్పిన సమాధానాన్నే మళ్లీ చెప్తాను. సాధ్యమైనంత త్వరగా మా ప్రక్రియ పూర్తిచేస్తాం. తర్వాత బిల్లు వెళ్తుంది’’ అని అన్నారు.