సంపాదకీయం: రాష్ట్ర విభజన నిర్ణయంపై పార్లమెంటు వేదికగా కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు సాగిస్తున్న డ్రామాలో కొత్త అంకానికి తెరలేచింది. ఇరు పార్టీలకూ చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ శుక్రవారం లోక్‌సభలో స్పీకర్ మీరా కుమార్ నిర్ణయం తీసుకున్నారు. నిత్యమూ నినాదాలతో, ప్లకార్డుల ప్రదర్శనతో వీరంతా సమావేశాలకు అంతరాయం కలిగిస్తున్నారు. సభ మధ్యలోకి దూసుకెళ్లడంతో ఆగక స్పీకర్ మైక్‌ను విరగ్గొట్టే ప్రయత్నమూ జరిగింది. ఇవన్నీ చానెళ్లలో గమనిస్తున్న వారికి ఈ ఎంపీలను సస్పెండ్ చేయడం వింతేమీ అనిపించలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచీ సభా కార్యకలాపాలు నడుస్తున్న తీరు ప్రజల్ని విస్మయపరుస్తోంది. ఉభయసభలూ ఆద్యంతమూ గందరగోళంతోనే సాగుతున్నాయి.
టీవీలు వీక్షిస్తున్న పౌరులే అసహనానికి గురై చానెళ్లను మార్చేయవలసిన అవసరం ఏర్పడుతున్నదంటే సభాధ్యక్ష స్థానంలో ఉండేవారి పరిస్థితేమిటో ఊహించుకోవచ్చు. వేరే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమకు అవకాశమివ్వాలని మరో విపక్షం బతిమాలితే సీమాంధ్ర ఎంపీలంతా కాస్సేపు మౌనంగా ఉండటానికి అంగీకరించారు. ఏతా వాతా పార్లమెంటులో గందరగోళానికి మాత్రం తెరపడలేదు. అది విసుగొచ్చే సీరియల్‌లా అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఒకపక్క అర్జెంట్‌గా ఆహారభద్రతా బిల్లు, భూసేకరణ బిల్లు ఆమోదింపజేసుకుందామని తహతహ లాడుతూ, అందుకోసమని పార్లమెంటు సమావేశాలను కూడా పొడిగించిన యూపీఏ పెద్దలు చివరకు ఈ సస్పెన్షన్ రూటు ఎంచుకున్నారన్నది సుస్పష్టమే.
విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్రలో పెద్దయెత్తున ప్రజా ఉద్యమం పెల్లుబికింది. వివిధ వర్గాల ప్రజలంతా రోడ్లమీదికొచ్చారు. విద్యాసంస్థలు మూత బడ్డాయి. బస్సులు ఆగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు పని చేయడంలేదు. తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో పలువురు మరణించారు. ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న తెలంగాణ సమస్యకు విభజనే పరిష్కారమని విశ్వసించే వారు సైతం తప్పుబట్టేలా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించింది.
ఎవరినైనా సంప్రదిస్తే, తన ప్రతిపాదనేమిటో బహిరంగపరిస్తే తనకు రావల్సిన కీర్తి దక్కదేమోనన్న భయంతో అది గోప్యత పాటించింది. పుష్కర కాలంగా తెలంగాణ ఉద్యమానికి సారథ్యంవహిస్తున్న కేసీఆర్‌ని సంప్రదించలేదు. తమకు ఇష్టమైన ఇతరులను పిలిపించుకుని మాట్లాడుతూనే, నిర్ణయం ప్రకటించాక టీఆర్‌ఎస్ నుంచి తనవైపు రాగలవారెవరన్న జాబితా తయారు చేసుకుంటూనే పైకి గుంభనంగా ఉండిపోయింది. అయితే, జాతీయ మీడియాకు మాత్రం లీకులిచ్చింది. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం అంతరంగం, అది వేయబోతున్న అడుగుల సంగతి ముందుగా తెలుసో, లేదో ఎవరికీ తెలియదు.
రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో... తమకు ముందే చెప్పారంటే ఏమవుతుందో, చెప్పలేదంటే ఏమవుతుందో తెలియక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా గందరగోళపడుతున్నారు. ‘కేవలం పక్షం రోజులముందు మాత్రమే తమకు తెలిసింద’ని ఒక ఎంపీ బయటపడేసరికి మిగిలినవారంతా ఆయన నోరు నొక్కారు. అటు టీడీపీ పరిస్థితీ ఇంతకన్నా మెరుగ్గా లేదు. విభజన సంగతి బాబుకు ముందే తెలిసిందని, దానిపై ఆయన కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫోన్లుచేసి మాట్లాడారని ఒక జాతీయ పత్రిక బయటపెట్టింది. అటు తర్వాత నే ఆయన విలేకరుల సమావేశం పెట్టి విభజన జరిగిపోయిందని, ఇప్పుడు కొత్త రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు అడుగుదామని సీమాంధ్రులకు హితవు పలికారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల ఎంపీలూ ముందుగా నిలదీయాల్సింది తమ తమ పార్టీ అధినేతలను కాగా, పార్లమెంటుకొచ్చి రచ్చచేయడమేమిటని సహజంగానే ప్రజలంతా అనుకున్నారు.
ప్రజాస్వామ్యవ్యవస్థలో పార్లమెంటు అత్యున్నత ప్రజా వేదిక. ఈ వేదికపై ప్రజా సమస్యలనూ, ప్రజలను ఆందోళన పరుస్తున్న ఇతర అంశాలనూ ప్రస్తావించడంలో... వారి అభిమతాన్ని వెల్లడించడంలో తప్పేమీ లేదు. కానీ, అంతకన్నా ముందు ఆ పని పార్టీ వేదికల్లో జరగాలి. ఫలానా సమస్యలు పరిష్కరించకుండా నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు వికటిస్తాయని తమ అధినాయకురాలికి కాంగ్రెస్ నేతలు చెప్పి ఉండాలి. కనీసం విభజనకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించే సమయంలోనే కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి తాము సమకూర్చబోతున్నవేమిటో స్పష్టం చేయించాలి. ఉద్యోగాలు, నీళ్లు, నిధుల పంపకం వగైరా అంశాల్లో తమ ప్రతిపాదనలేమిటో ప్రజలముందు పెట్టించాలి. ఇటు టీడీపీ ఎంపీలూ అదే తరహాలో వ్యవహరించి ఉండాల్సింది. కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన మాట్లాడినదేమిటో, వారు ఆయనకు చెప్పిందేమిటో తెలుసుకుని ఉండాల్సింది. తమ అధినేతల నిర్ణయంతో ఏకీభవించకపోతే ఆ రెండు పార్టీల ఎంపీలూ బాహాటంగా ఆ సంగతిని ప్రకటించి పదవులను వీడాల్సింది.
ఆ మార్గాన్ని వదిలి వీరు పార్లమెంటులో గొడవచేశారు సరే... కనీసం ఆ పార్టీల సభా నాయకులైనా తమ సభ్యుల్ని నియంత్రించడానికి ప్రయత్నించలేదు. తమ పార్టీకి చెందినవారు అలా నిరవధికంగా గొడవ చేస్తుంటే అది తమ చేతగానితనానికి, వైఫల్యానికి నిదర్శనమని గుర్తించలేదు. అసలు రాజీనామాలిచ్చి సభకు ఎందుకొచ్చారని అడగాల్సి ఉండగా ఆ పనీ చేయలేదు. మొత్తానికి వీరంతా పార్లమెంటును తమ రాజకీయ విన్యాసాలకు వేదికగా చేసుకున్నారు. సస్పెండైతే ప్రజల్లో వీరోచిత కార్యంగా ప్రచారమై తమ పార్టీలకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేసుకున్నారు. సారాంశంలో పార్లమెంటు విలువైన సమయాన్ని వృథా చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ప్రవర్తించాల్సింది ఇలాగేనా? ఆ రెండు పార్టీలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.