'విభజన విషయంలో హడావుడి తగదు' | Heated Debate in Parliament over Andhra Pradesh Reorganisation Act, 2014 | Sakshi
Sakshi News home page

'విభజన విషయంలో హడావుడి తగదు'

Published Sun, Nov 15 2015 10:46 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM

Heated Debate in Parliament over Andhra Pradesh Reorganisation Act, 2014

పార్లమెంట్‌లో ఏం జరిగింది-13
 
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20-02-2014 నాటి రాజ్యసభ సమావేశ వివరాల కొనసాగింపు...
 వెంకయ్యనాయుడు:సార్, తొందర పెట్టకండి. నా బాధ అర్థం చేసుకోండి. నేను ఆ రాష్ట్రంలో పుట్టాను. అక్కడ ఎమ్మెల్యేని! అక్కడ ఒక పార్టీ కార్యకర్తని. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో వేలాది మంది కార్యకర్తల్ని అభివృద్ధి చేశాను. సీమాంధ్ర ప్రాంతం వాళ్లు దోపిడీదారులని కొందరు నినాదాలు చేస్తున్నారు. ఎవరు దొంగలు ఎవరు మోసగాళ్లు - జనం తేలుస్తారు. నా పాయింట్ ఏమిటంటే, (హిందీలో) ఈ తొందరపాటు కుదరదు. హైద్రాబాద్ ఈ దేశంలోనే ఒక ముఖ్యమైన నగరం. ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇక ముందు కూడా అందరికీ హైద్రాబాద్‌లో నివసించే అధికారముంది. ఆ అధికారాన్ని నిలబెట్టి ఉంచటం కోసం మేము అన్నివేళలా కృషి చేస్తూనే ఉంటాం. అలా చేసేవాళ్లని భారతీయ జనతాపార్టీ సమర్థిస్తూనే ఉంటుంది.
సార్, చివరగా నేను ప్రభుత్వానికి చెప్తున్నా.. అన్ని రాజకీయ పార్టీలనూ పిలవండి. అందరితో మాట్లాడి సీమాంధ్రకు న్యాయం చెయ్యండి.
 
డిప్యూటీ చైర్మన్: అలాగే వెంకయ్యాజీ! ఇప్పుడు చిరంజీవి గారికి ముందు సీతారాం ఏచూరి గారు రెండు నిమిషాలు....

వెంకయ్యనాయుడు: ఇది ఇంత హడావుడిగా చేయకండి... మీరు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. (అధికార పార్టీ సభ్యులను ఉద్దేశించి)

డిప్యూటీ చైర్మన్: మీది అయిపోయింది. ఓకే, ఏచూరీ, రెండు నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్నది చెప్పండి.

వెంకయ్యనాయుడు: (తెలుగులో) సార్! మేము అధికారం లోకి వస్తున్నాం. ఈ సవాళ్లన్నీ మేము స్వీకరిస్తాం. మేము అడుగుతున్నవన్నీ నెరవేర్చవలసిన బాధ్యత మాపై కూడా ఉంది. అందుకే వారినడుగుతున్నా. నిజమైన ఇబ్బందులని పరిగణనలోనికి తీసుకోండి. మాటలతో సరిపోదు. కేబినెట్ తీర్మానం కావాలి. ప్లానింగ్ కమిషన్ ఆమోదం కావాలి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు నడపటం మానాలి. అధికార పార్టీకి ఇది నా విజ్ఞప్తి. ఈ చరిత్రాత్మక బిల్లు పై చర్చ జరిగే సమయంలో చైర్మన్‌గారు ఉంటారని ఆశించాను.... అంతరాయం.

వెంకయ్యనాయుడు: అన్ని పార్టీలకు సమాన అవకాశం ఇవ్వండి. మాకు భయం లేదు. ఆరోగ్యకరమైన చర్చ జరిగిన తరువాత మేమిచ్చిన మూడు నాలుగు సవరణలను పరిగణనలోనికి తీసుకోండి. ప్రభుత్వం కలిసొస్తే సరే... లేకపోతే మా సవరణల విషయమై మేము ఒత్తిడి చేస్తాం. నేను మా ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తే చట్టపరమైన విషయాలనూ సవరణలనూ వినాలను కుంటున్నాం. జై తెలంగాణ, జై సీమాంధ్ర. భారత్ మాతాకీ జై.
 డిప్యూటీ చైర్మన్: చిరంజీవి గారిని పిలిచే ముందు ఏచూరి గారి వివరణ కోసం- రెండు నిమిషాలు.

సీతారాం ఏచూరి: సార్! శ్రీ వెంకయ్యనాయుడు మా పార్టీ మీద ఒక ఆరోపణ చేశారు. అది తప్పు. సీపీఐ(ఎం) ఒకే ఒక జాతీయ పార్టీ- నిరంతరమూ ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకించిన పార్టీ. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మేము సమర్థిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయి. దీనిని మేము ఒప్పుకోం. మా మీద చేసిన ఆరోపణను మేము ఖండిస్తున్నాం. మా పాయింట్ మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్పుడు చెప్తాం. కానీ మాపై చేసిన ఈ ఆరోపణను రికార్డుల నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇది తప్పుడు స్టేట్‌మెంట్. వక్రీకరించిన మాటలు. తెలుగు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా; ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్, బీజేపీలు ఏకమై విడదీస్తున్నాయి. ఇది రికార్డులలోకి ఎక్కాలి. కాంగ్రెస్, బీజేపీలు కలసి చేస్తున్న ఈ విభజనకు వారే బాధ్యత వహించాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడదీస్తున్నారు. ప్రజల్ని ఇక్కట్ల పాల్జేస్తున్నారు. మేము సమైక్య ఆంధ్రప్రదేశ్‌కే కట్టుబడి ఉన్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు మేం అంగీకరించం!

డిప్యూటీ చైర్మన్: థాంక్యూ ఏచూరి.. శ్రీ చిరంజీవి....

చిరంజీవి (టూరిజం మంత్రి): డిప్యూటీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు. ఈ రోజు నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. నా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను మాట్లాడడం, ఒక కాంగ్రెస్ వాదిగా చాలా బాధాకరం. ఇలాంటి సున్నితమైన విషయంలో నా పార్టీ నిర్ణయంతో నేను విభేదించడం నాకు చాలా కష్టం కలిగించే అంశం. ఇది ఈ సభలో నా మొట్టమొదటి ఉపన్యాసం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మాట్లాడుతుంటే విని తీరాలన్నది రూల్. నేనీవేళ తెలుగువారి తరఫున మాట్లాడతాను. ఏ ప్రాంతం వారి తరఫునా కాదు. ఎందుకంటే అన్ని ప్రాంతాల ప్రజల ప్రేమ అభిమానాల వల్లే నేనీ స్థితికి చేరుకున్నాను.

కొన్ని రోజులుగా పార్లమెంటులో బాధాకరమైన స్థితి నెలకొని ఉంది. 11 కోట్ల మంది తెలుగు ప్రజల గుండెలు పగిలిన జీవితాల గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.
 కోట్లాది తెలుగు ప్రజలు అక్రమంగా తమ హక్కులు కోల్పోతున్నారు. నేను కాంగ్రెస్‌లో చేరగానే, మీడియా అడిగిన ప్రశ్న తెలంగాణ గురించే.. ఒక సమైక్యవాదిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు మారలేదని చెప్పాను. నేనొక పార్టీ సభ్యుడిని కాబట్టి,  పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పాను.
 

http://img.sakshi.net/images/cms/2015-11/41446693982_295x200.jpg

వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: ఉండవల్లి అరణ్ కుమార్

ఈ మెయిల్: a_vundavalli@yahoo.com


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement